Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

కంగన నోటిదురుసు.. వెల్లువెత్తుతున్న విమర్శలు

ఆమెపై చర్యలకు డిమాండ్లు
ముంబై : దేశంలో వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తున్న బాలీవుడ్‌ నటి కంగనారనౌత్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొద్దిరోజుల క్రితం భారత స్వాతంత్య్రంపై చేసిన వ్యాఖ్యలు చిచ్చురేపుతూనే ఉన్నాయి. భారత్‌ కు స్వాతంత్య్రం వచ్చింది 1947లో కాదని, 2014లో మోదీ సర్కార్‌ రాకతో అని, 1947లో వచ్చింది బ్రిటీష్‌ వాళ్లు పెట్టిన భిక్ష అంటూ కంగన చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. దీనిపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. ఈ వ్యాఖ్యల తర్వాత ఆమె పద్మశ్రీ అవార్డు కూడా అందుకోవడంతో ఇది తిరిగిచ్చేయాలనే డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. అయినా కంగనా వెనక్కు తగ్గడం లేదు. తన ట్విట్టర్‌ ఖాతా రద్దయినా ఇన్‌స్ట్రాగ్రామ్‌లో రెచ్చిపోయి తాజాగా జాతిపిత మహాత్మాగాంధీని విమర్శిస్తూ వరసగా పోస్ట్‌లు పెట్టింది. ‘ఒక చెంప చూపితే స్వాతంత్య్రం రాదని, భిక్ష మాత్రమే వస్తుందని.. స్వాతంత్య్ర వీరులు సుభాష్‌ చంద్రబోస్‌, భగత్‌ సింగ్‌కు గాంధీ మద్దతు ఇవ్వలేదని ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌ల్లో రాసుకొచ్చింది. ఈ వ్యాఖ్యలపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. గాంధీ, నేతాజీలను పోలుస్తూ.. ఈ దేశంలో ఉంటే మహాత్మాగాంధీ అభిమానిగా ఉండాలని, లేదా నేతాజీ మద్దతుదారులుగా ఉండాలని, ఇద్దరిలా ఉంటానంటే సాధ్యం కాదని పేర్కొంది. రెండిరటిలో ఏదో ఒకటి ఎంచుకోవాలని కంగన సూచించింది. సోషల్‌ మీడియాలో గాంధీజీ కి సంబంధించిన ఓ క్లిపింగ్‌ను పోస్టు చేసింది. స్వాతంత్య్రం కోసం పోరాడిన నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ను బ్రిటీష్‌ వారికి అప్పగించేందుకు గాంధీ తదితరులు అప్పట్లో అంగీకరించారనే న్యూస్‌ క్లిప్పింగ్‌ వివాదం రేపింది. ఆమె వ్యాఖ్యలు గాంధీజీ, జవహర్‌లాల్‌ నెహ్రూల్ని ఉద్దేశించినవనే వాదన వినిపిస్తోంది. స్వాతంత్య్ర పోరాటంలో గాంధీ అహింసను ఆయుధంగా చేసుకోగా, నేతాజీ పోరాటంతోనే స్వాతంత్య్రం వస్తుందని నమ్మారు. వీరిద్దరి విధానాలు వేరయినా స్వాతంత్య్ర సమరయోధులుగా పేరుతెచ్చుకున్నారు. ఇప్పుడు కంగన వీరిలో ఎవరో ఒకరిలాగే ఉండాలంటూ చేసిన వ్యాఖ్యలు వారిని అవమానించేలా ఉన్నాయన్న చర్చ సాగుతోంది. ఇక కంగన నోటి దురుసుపై రాజకీయ పక్షాలు, ప్రజాసంఘాలు మండిపడుతున్నాయి. కంగన నోటికి తాళం వేయాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. రాష్ట్రపతికి సైతం వినతిపత్రాలు వెళ్లాయి.
హిందూ, ముస్లింల మధ్య చిచ్చుకు యత్నాలు : శివసేన
స్వాతంత్య్రంపై కంగన చేసిన వ్యాఖ్యలను ఆమె పేరు ప్రస్తావించకుండా శివసేన పరోక్షంగా విమర్శించింది. నవంబర్‌ 17న.. శివసేన వ్యవస్థాపకుడు బాలాసాహెబ్‌ ఠాక్రే 9వ స్మారక దినం సందర్భంగా సామ్నా పత్రికలో వ్యాసం ప్రచురితమైంది. ఇందులోనే కంగనపై పరోక్షంగా విమర్శలు చేసింది శివసేన. ఆమె గంజాయి తాగుతూ ఆ వ్యాఖ్యలు చేసిందని పేర్కొంది. ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో.. హిందూ, ముస్లింల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేయడం ద్వారా పరోక్షంగా బీజేపీకి చురకంటించింది.
దేశ పరువును మంటగలపొద్దు : బీజేపీ
దిల్లీ బీజేపీ అధికార ప్రతినిధి, ప్రముఖ సామాజిక కార్యకర్త నిఘత్‌ అబ్బాస్‌ కంగనా వ్యాఖ్యలపై మండిపడ్డారు. ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్రమోదీ కూడా గాంధీజీని స్ఫూర్తిగా తీసుకున్నారని కంగనాకు హితబోధ చేశారు. మహాత్ముడిని విమర్శించడం ద్వారా అంతర్జాతీయంగా భారతదేశ పరువును కంగనా మంటగలుపుతోందని నిఘత్‌ మండిపడ్డారు. ఈ మేరకు ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను విడుదల చేసింది. ‘భారతదేశ స్వాతంత్రోద్యమంలో గాంధీజీ పోరాటానికి గుర్తుగా అందరూ ఆయనకు ‘జాతిపిత’ అని పిలుచుకుంటున్నారు. గాంధీజీ నుంచి ప్రేరణ పొందానిని ప్రధాని నరేంద్రమోదీ కూడా పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. అలాంటి మహాత్ముడిని కంగనా విమర్శించింది. ఆమె తన అసంబద్ధ వ్యాఖ్యలతో ఏం సాధించాలనుకుంటుందో అర్థం కావడం లేదు. భారత స్వాతంత్య్రోద్యమం, అందులో పాల్గొన్న వారిని తరచూ విమర్శించడం ద్వారా కంగనా దేశ ప్రజలను బాధిస్తోంది. అంతేకాదు అంతర్జాతీయంగా మన దేశ పరువు, ప్రతిష్ఠలను కాలరాజేస్తోంది’ అని అబ్బాస్‌ చెప్పుకొచ్చారు.
కంగనాను కోర్టుకీడుస్తాం : కాంగ్రెస్‌
జాతిపిత మహాత్మాగాంధీని కించపరచేలా వ్యాఖ్యలు చేసిన బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌పై మహారాష్ట్ర కాంగ్రెస్‌ న్యాయపరంగా పోరాడుతుందని మహారాష్ట్ర కాంగ్రెస్‌ చీఫ్‌ నానా పటోలే తెలిపారు. దీనిపై ముంబై పోలీసులకు అధికారికంగా కాంగ్రెస్‌ పార్టీ ఫిర్యాదు చేస్తుందన్నారు.
నేతాజీకి గాంధీజీనే ప్రేరణ : అనితాబోస్‌
నేతాజీ సుభాశ్‌ చంద్రబోస్‌ను బ్రిటిషర్లకు అప్పగించడానికి గాంధీజీ, జవహర్‌లాల్‌ నెహ్రూ సిద్ధమయ్యారన్న బాలీవుడ్‌ నటి కంగన రనౌత్‌ వ్యాఖ్యలపై నేతాజీ కుమార్తె అనిత బోస్‌ ఓ టీవీ చానల్‌తో మాట్లాడుతూ.. తాను నేతాజీని నియంత్రించలేనని గాంధీజీ భావించారని, కానీ తన తండ్రి మాత్రం గాంధీజీని అమితంగా ప్రేమించేవారని తెలిపారు. భారత దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన నేతాజీ, గాంధీజీ గొప్ప హీరోలని తెలిపారు. ఒకరు లేకపోతే మరొకరు ఉండేవారు కాదన్నారు. కేవలం అహింసా విధానం మాత్రమే భారత దేశానికి స్వాతంత్య్రం తీసుకొచ్చిందని చాలా కాలం నుంచి కాంగ్రెస్‌ చెప్తోందని, ఇది సరికాదని, దేశానికి స్వాతంత్య్రం రావడంలో నేతాజీ, ఇండియన్‌ నేషనల్‌ ఆర్మీ (ఐఎన్‌ఏ) పాత్ర కూడా ఉన్నట్లు మనందరికీ తెలుసునని తెలిపారు. అదేవిధంగా నేతాజీ, ఐఎన్‌ఏ మాత్రమే స్వాతంత్య్రం తీసుకొచ్చాయని చెప్పడంలోనూ అర్థం లేదని అన్నారు. గాంధీజీ అనేక మందికి ప్రేరణ అని, ఆయన నుంచి ప్రేరణ పొందినవారిలో నేతాజీ ఒకరని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img