Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

కదం తొక్కిన ఎర్రసైన్యం

. బెజవాడలో సీపీఐ భారీ ప్రదర్శన
. డప్పు కళాకారుల డప్పు చప్పుళ్లతో దద్దరిల్లిన నగరం
. దేశవ్యాప్తంగా తరలివచ్చిన ఎర్ర దండు

విశాలాంధ్ర`విజయవాడ: ఎర్ర సైనికుల కవాతుతో విజయవాడ ఎరుపెక్కింది. డప్పు కళాకారుల డప్పు చప్పుళ్లతో నగరం దద్దరిల్లింది. సీపీఐ 24వ జాతీయ మహాసభలకు దేశంలోని అనేక ప్రాంతాల నుంచి కమ్యూనిస్టు శ్రేణులు తరలివచ్చారు. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు పండ్ల మార్కెట్‌ నుంచి ప్రారంభమైన ఈ భారీ ప్రదర్శనలో అగ్రభాగాన సీపీఐ అగ్రనేతలు నిలిచారు. వీరి వెనుక వివిధ జిల్లాల నుంచి తరలివచ్చిన ఎర్ర సైన్యం రెడ్‌షర్ట్‌ ధరించి కవాతు చేశారు. రెడ్‌షర్ట్‌ వాలంటీర్ల కమాండెంట్‌, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఈశ్వరయ్య నాయకత్వం వహించగా వాలంటీర్ల ప్రదర్శనలో అగ్రభాగాన సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు హరినాథ్‌రెడ్డి, రావులపల్లి రవీంద్రనాథ్‌, ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి కేవీవీ ప్రసాద్‌, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దోనేపూడి శంకర్‌, రామానాయుడు, మనోహర్‌ నాయుడు తదితరులు నిలిచారు. వారి వెనుక రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి పెద్దఎత్తున తరలివచ్చిన రెడ్‌షర్ట్‌ వాలంటీర్లు సుమారు 4 వేల మంది పురుష, వెయ్యి మంది మహిళా వాలంటీర్లు కవాతు చేశారు. విజయవాడకు చెందిన నాలుగు సంవత్సరాల వయస్సు ఉన్న పంచకర్ల దీక్షిత బాల వాలంటీర్ల ముందు వరుసలో నిలిచి అందరినీ ఆకట్టుకుంది. తెలంగాణ రాష్ట్రం సూర్యాపేటకు చెందిన వారు తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అధ్వర్యంలో 24వ జాతీయ మహాసభలకు చిహ్నంగా 24 బోనాలు తీసుకొని ర్యాలీలో నిలిచారు. విజయవాడ నగర సమితి అధ్వర్యంలో చలసాని రాఘవేంద్రరావు నేతృత్వంలో 117 మీటర్ల పొడవైన బ్యానర్‌ను తీసుకుని ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. చెన్నైకి చెందిన ఒక సీపీఐ అభిమాని భారీ సీపీఐ జెండాను చేతబూని ర్యాలీలో పాల్గొన్నారు. నంద్యాల జిల్లా డోన్‌కు చెందిన గౌండా బాషా ర్యాలీలో జీఎస్‌టీ, మతోన్మాద భూతం వేషధారణ చూపరులను ఆకట్టుకుంది. గుంటూరు జిల్లా తెనాలి పట్టణానికి చెందిన తుంగ బాలస్వామి లెనిన్‌ వేషధారణ అబ్బురపరిచింది. తిరుపతికి చెందిన మురళీ అధ్వర్యంలో మహిళలు కోలాటంతో తిరుపతి జిల్లా ర్యాలీలో నిలిచారు. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడికి చెందిన వెంకయ్య జెండా పట్టుకొని ప్రదర్శనలో పాల్గొన్నారు. తాను గత 30 సంవత్సరాలుగా సీపీఐలో కొనసాగుతున్నానని, పార్టీ అంటే తనకు ప్రాణమని తెలిపారు. మణిపూర్‌ రాష్ట్రానికి చెందిన హక్కిదేవి ప్రదర్శనలో పాల్గొన్నారు. రాష్ట్రవాప్తంగా దాదాపు 1,700 మంది డప్పు కళాకారులు ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. తిరుపతికి చెందిన డప్పు శ్రీను నాయకత్వంలో 1400 మంది, కడప, కర్నూలు, నంద్యాల, విజయనగరం, ఏలూరుకు చెందిన కళాకారులు డప్పు చప్పుళ్లతో అలరించారు. అలాగే రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు చెందిన పార్టీ నాయకులు తమతమ జిల్లాల బ్యానర్లు పట్టుకొని ప్రదర్శనలో పాల్గొన్నారు. తెలంగాణా, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, హైదరాబాద్‌ నగరానికి చెందిన పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో ఈ ర్యాలీలో కదం తొక్కారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img