Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

కదం తొక్కిన రాజధాని రైతులు

. కృష్ణాయపాలెం నుంచి నిడమర్రు వరకు ప్రజా చైతన్య యాత్ర
. అమరావతి విధ్వంసానికి ప్రభుత్వం మరో కుట్ర
. ఆర్‌`5 జోన్‌ రద్దు చేసేవరకు ఉద్యమం ఆగదని హెచ్చరిక

విశాలాంధ్ర బ్యూరోఅమరావతి: అమరావతి రాజధాని మాస్టర్‌ ప్లాన్‌ను విధ్వంసం చేసే కుట్రతో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆర్‌-5 జోన్‌పై రాజధాని అమరావతి ప్రాంత రైతులు తమ పోరాటాన్ని ఉధృతం చేశారు. ప్రభుత్వం తీరును నిరసిస్తూ ఆర్‌-5 జోన్‌ పరిధి ప్రాంతాల్లో సోమవారం రైతులు పెద్ద సంఖ్యలో ‘ప్రజాచైతన్య పాదయాత్ర’ చేపట్టారు. కృష్ణాయపాలెం గ్రామంలోని అమరావతి రాజధాని దీక్షా శిబిరం నుంచి ఈ యాత్ర ప్రారంభం కాగా, మహిళలు, వృద్ధులు, పిల్లలు సైతం పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మంగళగిరి, తాడికొండ నియోజక వర్గాల పరిధిలోని మందడం, అయినపోలు, కురగల్లు, నిడమర్రు గ్రామం వరకు పాదయాత్ర కొనసాగింది. అనంతరం నిడమర్రు గ్రామ లైబ్రరీ సెంటర్‌లో ముగింపు సభ నిర్వహించారు. ఆర్‌5 జోన్‌ ఏర్పాటుతో ఇతర ప్రాంతాల్లో నివసించే పేదలకు రాజధాని ప్రాంతంలో సెంటు స్థలం చొప్పున సుమారు 54 వేల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వం అత్యంత వివాదాస్పద జీవో 45 తీసుకొచ్చింది. కృష్ణాయ పాలెం, వెంకటపాలెం, నిడమర్రు, ఐనవోలు, మందడం గ్రామాల పరిధిని ఆర్‌5 జోన్‌గా ప్రకటించి 1134.58 ఎకరాలు పేదల ఇళ్ల స్థలాలకు కేటాయించనున్నట్లు ఈ జీవోలో పేర్కొన్నారు. అలాగే భవిష్యత్‌ అవసరాలు నిమిత్తం మాస్టర్‌ ప్లాన్‌లో ఉంచిన భూములను నవులూరులో 60 ఎకరాలు, ఎర్రబాలెంలో 150 ఎకరాలు, కురగల్లులో 60 ఎకరాలు అదనంగా నవరత్నాలు పథకంలో భాగంగా పేదల ఇళ్లకు వినియోగించుకునేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేపట్టింది. దీనిపై గతంలో రైతులు హైకోర్టును ఆశ్రయించగా, ప్రభుత్వ తీరును ఆక్షేపించింది. అయినప్పటికీ ప్రభుత్వం తన పంతం నెగ్గించుకునేందుకు మరోసారి ముందడుగు వేయడంతో మళ్లీ రైతులు కోర్టును ఆశ్రయించారు. రెండు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం ఇటీవల తీర్పు రిజర్వు చేసింది. దీంతో ప్రభుత్వం జంగిల్‌ క్లియరెన్స్‌ పేరుతో పొక్లెయిన్లను తీసుకొచ్చి రాజధాని భూముల చదును పేరుతో హడావుడి చేస్తోంది. పేదల పేరుతో పట్టాలిచ్చేందుకు కూడా శరవేగంగా ఏర్పాట్లు చేపడుతోంది. ఈ నేపథ్యంలో రైతులు ప్రజా చైతన్య యాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా అమరావతి రాజధాని ఐక్య కార్యాచరణ సమితి నాయకులు పువ్వాడ సుధాకర్‌, పోతుల బాలకోటయ్య, రామారావు, చిలకా బసవయ్య తదితరులు మాట్లాడుతూ ఆర్‌5 జోన్‌ ఏర్పాటు రాష్ట్ర ప్రభుత్వం అమరావతి విధ్వంసానికి చేస్తున్న మరొక కుట్రగా పేర్కొ న్నారు. రైతులతో ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం ఏమిటి? ప్రస్తుతం చేస్తున్నదేమిటి? చేతిలో అధికారం ఉందని, ఇలా దౌర్జన్యంగా రైతులు ఇచ్చిన భూములను పప్పూబెల్లాల్లా పంచి, రాజధాని మాస్టర్‌ప్లాన్‌ను చెడగొట్టడం, పేదల పేరుతో ప్రజల మధ్య చిచ్చు పెట్టడం పాలక పెద్దలకు తగునా? అని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పేదలంటే ప్రభుత్వానికి అంత ప్రేమ ఉంటే భూములిచ్చిన రైతులకు కౌలు సక్రమంగా ఎందుకివ్వడం లేదు? వ్యవసాయ కూలీలకు పెన్షన్లు సక్రమంగా ఎందుకు చెల్లించడం లేదు? రైతులకిచ్చిన ప్లాట్లను ఎందుకు అభివృద్ధి చేయడం లేదని వారు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. అలాగే పేదల పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే రాజధాని ప్రాంతంలో పేదల కోసం గత ప్రభుత్వం నిర్మించిన సుమారు 5 వేలకు పైగా నిర్మించిన టిడ్కో ఇళ్లు గత నాలుగు సంవత్సరాలుగా లబ్ధిదారులకు ఎందుకు కేటాయించలేదని ప్రశ్నించారు. కేవలం పేదల పేరుతో ప్రజల మధ్య చిచ్చు పెట్టడానికే ఆర్‌5 జోన్‌ ఏర్పాటు చేశారని వారు విమర్శించారు. న్యాయస్థానంలో దీనిపై విచారణ సాగుతున్నప్పటికీ ప్రభుత్వం దూకుడుగా వెళ్లడం దుర్మార్గమన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా ఆర్‌5 జోన్‌ను రద్దు చేయాలని, లేనిపక్షంలో ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని ఐకాస నేతలు హెచ్చరించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img