Friday, April 19, 2024
Friday, April 19, 2024

కన్నడనాట మళ్లీ ఉద్రిక్తత

భజరంగ్‌దళ్‌ కార్యకర్త హత్య
రెచ్చిపోయిన అల్లరి మూకలు
అనేక వాహనాలు ధ్వంసం
శివమొగ్గలో 144 సెక్షన్‌ విధింపు

బెంగళూరు: కర్ణాటకలో వరుసగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. మొన్నటికి మొన్న హిజాబ్‌ వివాదం ఆ రాష్ట్రంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారి తీయగా తాజాగా భజరంగ్‌దళ్‌ కార్యకర్త హత్య… మరోమారు ఆ రాష్ట్రంలో ఉద్రిక్తతలను రాజేసింది. కర్ణాటకలోని శివమొగ్గలోని సీగెహట్టిలో హర్ష అనే 23 ఏళ్ల భజరంగ్‌దళ్‌ కార్యకర్త ఆదివారం రాత్రి దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తుతెలియని కొందరు యువకులు అతడిపై మారణాయుధాలతో దాడి చేసి హత్య చేసిన ఘటన ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. ఈ హత్య గురించి తెలిసిన వెంటనే భజరంగ్‌ దళ్‌ కార్యకర్తలు రెచ్చిపోయారు. సోమవారం హర్ష అంత్యక్రియలు జరుగుతున్న వేళ విధ్వంసానికి పాల్పడ్డారు. అంతిమ యాత్ర జరుగుతుండగా రాళ్లు రువ్వి ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారు. శివమొగ్గ సహా అనేక ప్రాంతాల్లో ఉదయం నుంచే అల్లరి మూకలు స్వైర విహారం చేశాయి. అనేక వాహనాలకు నిప్పంటించి తగులబెట్టారు. ఈ ఘటనలో 10కిపైగా వాహనాలు ధ్వంసమయ్యాయి. మరికొన్ని వాహనాలు కాలి బూడిదయ్యాయి. అల్లరి మూకల చర్యలతో శివమొగ్గ ఓడీ రోడ్డులో భీతావహ వాతావరణం నెలకొంది. ఇలాంటి పరిస్థితి తలెత్తుతుందని ఊహించే ఆదివారం రాత్రి నుంచే శివమొగ్గలో పోలీసు అధికారులు 144 సెక్షన్‌ విధించారు. అయినా హింసను ఆపలేకపోయారు. కాగా అంతకు ముందు హర్ష మృతిని నిరసిస్తూ అనేక సంస్థలు నిరసనకు దిగాయి. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశాయి. పోస్టుమార్టం అనంతరం పటిష్ఠ బందోబస్తు మధ్య హర్ష మృతదేహాన్ని పోలీసులు అతని నివాసానికి తరలించారు.
ముగ్గురు అరెస్టు
హర్ష హత్య కేసుకు సంబంధించి ఇప్పటివరకు ముగ్గురిని అరెస్టు చేసినట్లు కర్ణాటక హోంమంత్రి అరగ జ్ఞానేంద్ర వెల్లడిరచారు. మిగతా నిందితుల కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. కాగా హర్ష హత్యపై కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మై స్పందించారు. ఆదివారం రాత్రి జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కీలక సమాచారాన్ని సేకరించినట్లు చెప్పారు.
కాంగ్రెస్‌ ఖండన
ఈ ఘటనను కాంగ్రెస్‌ సీనియర్‌ నేత సిద్ధరామయ్య తీవ్రంగా ఖండిరచారు. సీఎం, హోంమంత్రి సొంత జిల్లాలో ఇలా జరగడం ఆందోళనకరమన్నారు. నిందితులను ఉరి తీయాలని, రాష్ట్ర హోంమంత్రి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు.
హిజాబ్‌ వివాదంతో సంబంధం లేదన్న హోంమంత్రి
ఇదిలా ఉండగా హిజాబ్‌ వివాదంతో హర్ష హత్యకు ఎలాంటి సంబంధం లేదని కర్ణాటక హోంశాఖ మంత్రి ప్రకటించారు. హర్షపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేశారని, ఈ ఘటనలో హర్ష అక్కడికక్కడే చనిపోయాడని తెలిపారు. ఈ ఘటనపై ఇప్పటికే విచారణకు ఆదేశించామని, అనుమానితుల కోసం పోలీసులు గాలిస్తున్నారని ఆయన తెలిపారు. సోషల్‌ మీడియాలో కనిపించే అసత్య పోస్టులను నమ్మొద్దని, ప్రజలంతా సంయమనం పాటించాలని ఆయన కోరారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img