Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

కమ్యూనిస్టు సిద్ధాంతంపై కన్హయకు నమ్మకం లేదు

సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా

న్యూదిల్లీ : భారత కమ్యూనిస్టు పార్టీని వీడిన కన్హయ కుమార్‌కు కమ్యూనిస్టు సిద్ధాంతాలపై నమ్మకం లేదని సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా అన్నారు. కన్హయ కుమార్‌ కాంగ్రెస్‌లో చేరడంపై ఆయన స్పందనను ఓ ప్రముఖ పత్రికకు తెలిపారు. ‘కన్హయ కుమార్‌ తనంట తానుగా పార్టీని వీడారు. కులం, వర్గంరహిత సమాజం కోసం సీపీఐ పోరాడుతుంది. ఆయనే స్వయంగా బయటకు వెళ్లారంటే అర్థం.. వ్యక్తిగత ఆశలు, ఆకాంక్షలు ఉండివుండటమే. దీనినిబట్టి ఆయనకు కమ్యూనిస్టు సిద్ధాంతాలపైగానీ కార్మిక వర్గ సిద్ధాంతాలపైగానీ నమ్మకం లేదని తెలుస్తోంది’ అని రాజా వెల్లడిరచారు. కన్హయ వంటి వారు బయటకు వెళ్లినప్పటికీ పార్టీ పనితీరులోగానీ భవిష్యత్‌ కార్యాచరణలోగానీ ఎలాంటి మార్పు ఉండదన్నారు. ‘సీపీఐ కష్టపడుతుంది.. విజయం సాధిస్తుంది. ఇదే విషయాన్ని నేను చెప్పదలిచాను. ఆయన (కన్హయ) బయటకు వెళ్లినంత మాత్రాన పార్టీ పని అయిపోయినట్లు ఏమాత్రం కాదు. కన్హయ నిష్క్రమణతో పార్టీపై ప్రభావం ఉండబో దన్నారు. నిస్వార్థ పోరాటాలు, ఉద్యమాలు, త్యాగాలకు పెట్టిందిపేరుగా సీపీఐ ఉందని రాజా చెప్పారు. తమ పార్టీలోకి వచ్చే వారంతా నిస్వార్థంగా జీవించేందుకు సిద్ధంగా ఉండాలని, దేశం కోసం శ్రామికుల కోసం ఎంతటి త్యాగానికైనా వెనుకాడరాదన్నారు. పార్టీ పట్లగానీ నాయకత్వం పట్లగానీ పూర్తి నిబద్ధతలో కన్హయ లేరన్నారు. ఈ క్రమంలోనే ఆయనపై విమర్శలు రాగా కనీసం వివరణ ఇచ్చుకోలేదన్నారు. పార్టీని వీడవద్దని కన్హయను కోరారా అన్న ప్రశ్నకు ‘ఏ పార్టీ అయినా అదే చేస్తుంది. తమ వాళ్లను అంత త్వరగా వదులుకోదు. చివరి నిర్ణయం మాత్రం సంబంధిత వ్యక్తిదే ఉంటుంది. వారికి పార్టీ, దాని సిద్ధాంతాల పట్ల ఉన్న నిబద్ధత, చిత్తశుద్ధిపై ఇలాంటి నిర్ణయాలు ఆధారపడతాయి. దేశానికి, శ్రామిక వర్గానికి వారు ఏ మేరకు కట్టుబడి ఉన్నదీ ఇలాంటప్పుడే తెలుస్తుంది. ఎవరు బయటకు వెళ్లినా పార్టీ ఆగదు.. వ్యక్తినిగానీ వ్యక్తిత్వాన్నిగానీ సమర్థించదు’ అని రాజా బదులిచ్చారు. కాగా, జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) మాజీ విద్యార్థి నేత కన్హయ కుమార్‌ ఇప్పటివరకు సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యునిగా కొనసాగారు. ఆయన మంగళవారం న్యూదిల్లీలోని ఏఐసీసీ కేంద్ర కార్యాలయంలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img