Friday, April 19, 2024
Friday, April 19, 2024

కరోనా మృతుల కుటుంబాలకు రూ.50వేల పరిహారం ఇవ్వాల్సిందే


ఏ రాష్ట్రం కూడా కాదనడానికి వీల్లేదు సుప్రీం కోర్టు తీర్పు
` ఎన్‌డీఎంఏ మార్గదర్శకాలకు ఆమోదం

న్యూదిల్లీ : కరోనా మృతుల కుటుంబాలకు పరిహారంపై జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ (ఎన్‌డీఎంఏ ) రూపొందించిన మార్గదర్శకాలకు సుప్రీంకోర్టు ఆమోదం తెలిపింది. కరోనా మృతుల కుటుంబాలకు రూ.50 వేల చొప్పున పరిహారం అందించాల్సిందేనని న్యాయమూర్తులు ఎం.ఆర్‌.షా, ఎ.ఎస్‌.బోపన్నలతో కూడిన సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. కొవిడ్‌తో చనిపోయినట్లు ధ్రువీకరణ పత్రం లేకున్నా పరిహారం అందించాలని ఆదేశించింది. దరఖాస్తు చేసుకున్న 30 రోజుల్లోగా పరిహారం అందించాలని పేర్కొంది. కరోనాతో చనిపోయిన వారి కుటుంబాలకు ఎన్‌డీఎంఏ ప్రతిపాదించిన రూ.50 వేల పరిహారాన్ని ఏ రాష్ట్రం కూడా ఇవ్వబోమని నిరాకరించరాదని కోర్టు స్పష్టం చేసింది. మరణ ధ్రువీకరణ పత్రంలో కరోనాతో చనిపోలేదని పేర్కొనడాన్ని ఇందుకు కారణంగా చూపరాదని కూడా తెలిపింది. ఈ సందర్భంగా సుప్రీం ధర్మాసనం కీలక సూచనలు చేసింది. మరణ ధ్రువీకరణ పత్రం అప్పటికే జారీ చేస్తే దానిలో మార్పుల కోసం బాధితులు సంబంధిత విభాగం వద్దకు వెళ్లొచ్చని సూచించింది. ఆర్టీపీసీఆర్‌ పరీక్ష వంటి అవసరమైన డాక్యుమెంట్‌లపై సంబంధిత అధికారులు మరణ ధృవీకరణ పత్రాలను సవరించవచ్చునని కోర్టు పేర్కొంది. ఇంకా ఇబ్బంది పడుతుంటే మృతుల కుటుంబ సభ్యులు ఫిర్యాదు పరిష్కార కమిటీని సంప్రదించవచ్చని పేర్కొంది. కమిటీ మరణించిన రోగుల వైద్య రికార్డులను పరిశీలించి, 30 రోజుల్లోపు కాల్‌ చేసి పరిహారాన్ని ఆదేశించాలని కూడా సుప్రీం కోర్టు ఆదేశించింది. ఈ పథకానికి సంబంధించి ప్రింట్‌ మీడియా, ఎలక్ట్రానిక్‌ మీడియాలో విస్తృత ప్రచారం చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీం కోర్టు ఆదేశించింది. కోవిడ్‌`19 తో మరణించిన వారి కుటుంబాలకు రూ .50,000 ఇవ్వాలని ఎన్‌డీఎంఏ గతంలో సిఫార్సు చేసింది. కోవిడ్‌-19 సహాయక చర్యలలో పాల్గొనడం లేదా మహమ్మారిని ఎదుర్కోవటానికి సంసిద్ధతతో సంబంధం గల కార్యాచరణల కారణంగా వైరస్‌ సోకి మరణించిన వారి బంధువులకు కూడా పరిహారం అందించబడుతుందని తెలిపింది. సుప్రీంకోర్టు జూన్‌ 30న ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా ఎన్‌డీఎంఏ సెప్టెంబర్‌ 11 న మార్గదర్శకాలను జారీ చేసిందని ప్రభుత్వం తెలిపింది. కోవిడ్‌-19 బాధితుల కుటుంబ సభ్యులకు పరిహారం కోరుతూ న్యాయవాదులు గౌరవ్‌ కుమార్‌ బన్సాల్‌, సుమీర్‌ సోధి పిటిషన్లపై దాఖలు చేసిన అఫిడవిట్‌లో, బీమాకు సంబంధించి 15వ ఆర్థిక సంఘం సిఫార్సుపై ఎన్‌డిఎంఎ ఇప్పటికే చర్చలు/సంప్రదింపులు ప్రారంభించిందని కేంద్రం పేర్కొంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img