Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

కరోనా విలయంలో పాపం పసివాళ్లు..

విశాలాంధ్ర బ్యూరో ` అమరావతి :
కరోనా సృష్టించిన విలయం అన్ని రంగాలను కుదిపేసింది. వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ప్రపంచ దేశాలు చేపట్టిన నివారణ చర్యల్లో భాగంగా విధించిన లాక్‌డౌన్‌ సహా తప్పనిసరిగా తీసుకున్న ఇతర చర్యలు భవిష్యత్తు మానవ వనరులైన చిన్నారుల విషయంలో ఇప్పట్లో పూడ్చుకోలేని నష్టాన్ని మిగిల్చింది. దిగజారిన ఆర్థిక స్థితిని మళ్లీ చక్కబెట్టుకునే అవకాశం అన్ని దేశాలకు ఉన్నా భవిష్యత్తు ప్రపంచ గమనాన్ని నిర్దేశించాల్సిన పసివాళ్లపై కరోనా సుదీర్ఘకాలం తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తున్నదనే చెప్పక తప్పదు. కరోనా నేపథ్యంలో ప్రజల్లో నెలకొన్న ఆందోళన, కుటుంబాలపై పెరిగిన ఒత్తిడి క్రమంగా పిల్లలపై ఎనలేని దుష్ఫరిణామాలను కలిగిస్తున్నది. పాఠశాలల్లో, ఆటపాటలతో అందరి మధ్య ఉల్లాసవంతమైన బాల్యం గడపాల్సిన చిన్నారులను మానసికపరమైన హాని కలిగించే స్థితిలోకి నెట్టింది. రెండు దశల మహమ్మారి విజృంభణ సమయంలో జరిగిన ఒక ప్రాథమిక అధ్యయనంలో 3-6 సంవత్సరాల వయసున్న చిన్నపిల్లల్లోనూ చిరాకు పెరుగుదలను గుర్తించినట్టు తెలిపింది. ఇందుకు పిల్లలు అనిశ్చితంగా, భయంతో, ఒంటరిగా ఇంటి నాలుగు గోడలకే పరిమితమవడమే కారణంగా వెల్లడిరచింది. నిద్ర లేమి, పీడకలలు, ఆకలి లేకపోవడం, తల్లిదండ్రులు కూడా గుర్తించలేని ఆందోళనకు గృహ నిర్బంధమే కారణంగా చాలా అధ్యయనాలు పేర్కొన్నాయి. కరోనా కన్నా ముందున్న దిన చర్యలోని ఆరుబయట ఆడలేకపోవడం, స్నేహితులను కలవలేక పోవడం వంటి ఆనందాలను దీర్ఘకాలికంగా కోల్పోయి తల్లిదండ్రులనే అతుక్కొని ఉండాల్సిన పరిస్థితులు కల్పించబడ్డాయి. ఇంటిలోనూ బలవంతపు ఆంక్షలు పెరిగాయి. ఇవే వారి మానసిక ఆరోగ్యంపై దీర్ఘకాలిక ప్రతికూల ప్రభావాన్ని కలిగిస్తోంది. గత రెండేళ్లుగా ఎక్కువ కాలం నిర్బంధాలకు గురికావడంతో ఇంటర్‌నెట్‌, ఇతర సోషల్‌ మీడియా వినియోగం కూడా అధికమై సమస్యలు మరింత జఠిలమవుతున్నాయి. పాఠశాల స్థాయి విద్యార్థులకు గతంలో నిషేధిత వస్తువయిన సెల్‌ఫోన్‌ నేడు నడుస్తున్న ఆన్‌లైన్‌ విద్యలో అత్యవసరమైన వస్తువుగా మారడం, అది క్రమంగా అభ్యంతరకరమైన విషయాలు వైపు దృష్టి సారించే అవకాశాలను పెంచుతున్నది. అవి కళ్లబడడంతో చాలా హాని జరుగుతోంది. ఉద్యోగమే చదువుల పరమావధిగా మారిన నేటి విద్యావ్యవస్థలో పిల్లల చదువుల బెంగ తల్లిదండ్రులను కుంగదీస్తోంది. పిల్లలు చదువుకు దూరమవుతున్న మాట వాస్తమే అయినా అందుకు సంబంధించి రెండిరతల ఆందోళన నెలకొంది. ఒక తరగతికి మరో తరగతులకు చెందిన సిలబస్‌ మధ్యనున్న అంతర్లీన సంబంధం కారణంగా విద్యార్థులు చాలా నష్టపోతున్నారు. ఆన్‌లైన్‌ బోధన సాగుతున్నా ఆ లోటును అది పూడ్చడం లేదన్నది విద్యావేత్తలందరికీ తెలిసిందే. పైగా దేశంలో ప్రత్యక్ష బోధన అవకాశం లేక ఆన్‌లైన్‌ బోధన సంతృప్తిని అందించే మార్గంగా నిలుస్తోంది తప్ప పరిష్కార మార్గం కాలేదు. ఆర్థిక ప్రతికూలతతో కొట్టుమిట్టాడుతున్న దేశంలోని పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆన్‌లైన్‌ విద్య అందుబాటులో లేదు. ఈ కారణంగా భవిష్యత్‌లో లాక్‌డౌన్‌ ఎత్తివేసిన అనంతరం కూడా పాఠశాల మానేసే వారి సంఖ్య పెరుగే అవకాశం అధికంగా కనిపిస్తోంది. ప్రపంచంలో అత్యధిక పిల్లల జనాభా గల భారతదేశంలో పేద కుటుంబాల నుంచి కరోనా విలయంతో దాదాపు 40 మిలియన్ల మంది పిల్లలు బడులకు దూరమవుతారనే అంచనాలు వెలువడుతున్నాయి. ఆయా కుటుంబాల ఆర్థిక, సామాజిక పరిస్థితుల నేపథ్యంలో వారంతా క్రమంగా బాలకార్మికులుగా మారే ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ఇదే జరిగితే దేశ అభివృద్ధిలో కీలకంగానున్న మానవ వనరులు నిర్వీర్యమవడం ఖాయం.
మునుపటికన్నా భిన్న మార్పులు..
పిల్లల్లో మునపటి స్థితికన్నా భిన్నమైన మార్పులను చూస్తున్న తల్లిదండ్రులు పడుతున్న బాధ కన్నీరు తెప్పిస్తోంది. కరోనా కారణంగా తలకిందులైన కుటుంబాల ఆర్థిక స్థితికి తోడు పిల్లలే ప్రాణంగా వారి భవిష్యత్తే లక్ష్యంగా పని చేస్తున్న పేద, మధ్యతరగతి తల్లిదండ్రులు నిస్సహాయత వర్ణనాతీతం. దేశంలో లాక్‌డౌన్‌ ప్రారంభమైనప్పటి నుంచి పిల్లల విషయంలో అవసరమైన సలహాలు, సూచనల కోసం ‘1098’ హెల్ప్‌లైన్‌కు వస్తున్న ఫోన్‌ కాల్స్‌ 50 శాతం పెరిగినట్లు చైల్డ్‌లైన్‌ ఇండియా డిప్యూటీ డైరెక్టర్‌ ప్రకటించారంటే పరిస్థితి ఎంత క్లిష్టంగా మారిందో అర్థం చేసుకోవచ్చు. పేద కుటుంబాలు రోజువారీ వేతనాలు కోల్పోవడంతో తీవ్ర నిరాశ, నిస్సహాయతతో కుటుంబ వివాదాలు నెలకొంటున్నాయి. అవి క్రమంగా పిల్లల పట్ల హింస రూపంలో వ్యక్తమవుతున్న సందర్భాలు అనేకం వెలుగులోకి వస్తున్నాయి. సొంత ఇంటిలోనే బాధితులుగా మారుతున్న పిల్లల సంఖ్య పెరగడం విచారకరం. ఇక ఇరువురూ ఉద్యోగస్తులైన తల్లిదండ్రుల పరిస్థితి మరింత దారుణంగా మారింది. పిల్లలను వదలలేక, కరోనా భయంతోనూ.. ఉద్యోగాలను వదుకోలేక వారు అనుభవిస్తున్న క్షోభతో మొత్తం కుటుంబం మానసిక రుగ్మతల బారినపడుతోంది. కరోనా కారణంగా తల్లిదండ్రులిద్దరిని కోల్పోయిన పిల్లల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఏపీ సహా కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వారికి కొంత ఆర్థిక భరోసా కల్పించినా వారు పోగొట్టుకున్న నిండు భవిష్యత్తుకు ప్రత్యామ్నాయం కాలేవు. వారి భవిష్యత్తుకు సంబంధించి ఆర్థికంగానూ.. సామాజికంగానూ కేరళ ప్రభుత్వం ప్రకటించిన భరోసా దేశ వ్యాప్తంగా అమలు కావలసి ఉంది.
ప్రతికూలతలోనూ మార్పుకోసం..
మహమ్మారి సృష్టిస్తున్న విలయాన్ని అర్థం చేసుకునే జ్ఞానం, పరిపక్వత చిన్నారులకు ఉండే అవకాశంలేదు. ఈ నేపథ్యంలో మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడం చాలా అవసరం. ఇందుకోసం అనేక అంతర్జాతీయ సంస్థలు, ఆరోగ్య సలహా సంస్థలు వివిధ దశల్లోని పిల్లల మానసిక స్థితులను పరిగణనలోకి తీసుకొని అనేక మార్గదర్శకాలను జారీ చేశాయి. ఇందులో తల్లిదండ్రుల పాత్ర చాలా కీలకంగా పేర్కొన్నాయి. తల్లిదండ్రుల నుంచి దూరమవుతున్నామన్న ఆలోచనలు పిల్లలకు కలిగితే ప్రమాదం మరింత పెరిగి దీర్ఘకాలం చిన్నారుల మనసును ప్రభావితం చేస్తుంది. ఈ తరుణంలో ప్రాథమిక సంరక్షకులుగా పిల్లలను దూరం పెట్టడం, వారి ముందు తమ ఆందోళనలను వ్యక్తం చేయడం శ్రేయస్కరం కాదు.
కరోనా అంటే మరణమే అనే భావన కూడా పెద్ద పిల్లల్లో పెరిగినట్టు కొన్ని అధ్యయనాలు పేర్కొంటున్న నేపథ్యంలో వైరస్‌ సోకుతుందనే విచారం, ఆందోళన, మరణ భయం, తమ తల్లిదండ్రులు కూడా మరణిస్తారేమోనని, ఆసుపత్రిలో ఒంటరిగా ఉండాల్సిందేమోనన్న భయం పిల్లల మానసిక స్థితిపై హానికర ప్రభావాన్ని కలిగిస్తున్నది. సంక్షోభాన్ని అర్థం చేసుకునే సామర్థ్యం ఉన్న పిల్లలతో తాజాగా జరుగుతున్న పరిణామాలను చర్చించడం, కొవిడ్‌ విలయాన్ని నిర్మాణాత్మకంగా వివరించే ప్రయత్నాలు చేయాలని తల్లిదండ్రులకు సూచిస్తున్నారు. ఇల్లు జైలులా మారిన పరిస్థితి నుంచి బయటపడేందుకు పిల్లలను ఇంటిలోని పెద్దలతో కలసి వివిధ గృహ కార్యకలాపాలలో పాల్గొనేలా ప్రోత్సహించడం, ఇండోర్‌ ప్లే వంటి అవకాశాలు కల్పించడం, ఇతర సృజనాత్మక కార్యకలాపాలలో పాల్గొనేలా చేయడం అవసరమని తెలిపాయి. అందుబాటులో ఉన్న డిజిటల్‌ వ్యవస్థల ద్వారా పిల్లలను వారి స్నేహితులు, క్లాస్‌మేట్స్‌తో నిత్యం సంభాషించే అవకాశాలను కల్పించడం చాలా మేలు చేస్తుందని సూచించాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img