Thursday, April 18, 2024
Thursday, April 18, 2024

కర్బన రహిత పర్యావరణం కోసం
ఏపీ కొత్త ఒరవడి

పెట్టుబడులకు అపార అవకాశాలు
పారిశ్రామికవేత్తలను ఆహ్వానించిన సీఎం జగన్‌
కర్బన రహిత ఆర్థిక వ్యవస్థకు ఏపీ కేంద్రమవుతుందన్న అమితాబ్‌ కాంత్‌
పెట్టుబడులు రెట్టింపు చేస్తామన్న ఆదిత్య మిట్టల్‌

విశాలాంధ్ర బ్యూరో`అమరావతి: కర్బన రహిత పర్యావరణంలో ఏపీ కొత్త ఒరవడి సృష్టించిందని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి చెప్పారు. మంగళవారం కర్బన రహిత పర్యావరణంపై దావోస్‌ వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరంలో జరిగిన సదస్సులో సీఎం సుదీర్ఘ ఉపన్యాసం చేశారు. ఇటీవల కర్నూలులో ప్రారంభించిన ఇంటిగ్రేటెడ్‌ పంప్డ్‌ స్టోరేజ్‌ రెన్యువబుల్‌ ప్రాజెక్ట్‌ గురించిన వివరాలను సీఎం తెలియజేశారు. ఏపీలో ఏర్పాటు చేసిన కర్బన రహిత విద్యుత్‌ ప్రాజెక్ట్‌ ద్వారా విండ్‌, హైడల్‌, సోలార్‌ విద్యుత్‌ను నిరంతరాయంగా ఉత్పత్తి చేయవచ్చని తెలిపారు. ఈ విధానంలో తక్కువ ఖర్చుతో ఎటువంటి కాలుష్యం లేకుండా సుస్థిరమైన విద్యుత్‌ను సాధించవచ్చన్నారు. అంతేకాకుండా హైడ్రోజన్‌, అమ్మోనియంను కూడా పొందవచ్చని సీఎం వెల్లడిరచారు. ప్రపంచంలోనే అతి పెద్దదైన కర్బన రహిత విద్యుత్‌ ప్రాజెక్ట్‌ పనులు ఇటీవలే కర్నూలులో మొదలయ్యాయని చెప్పారు. మరి కొద్ది రోజుల్లో ఈ ప్రాజెక్ట్‌ అందుబాటులోకి వస్తుందన్నారు. గ్రీన్‌ ఎనర్జీ ఉత్పత్తి విషయంలో ఏపీ కొత్త ఒరవడి నెలకొల్పిందన్నారు. అంతేకాకుండా గ్రీన్‌ ఎనర్జీ ఉత్పత్తికి సంబంధించి షోకేస్‌గా కర్నూలు ప్రాజెక్ట్‌ నిలుస్తుంద న్నారు. కేవలం పంప్డ్‌ స్టోరేజీ ద్వారానే 1650 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయడం సాధారణ విషయం కాదన్నారు. కర్నూలులో నిర్మిస్తోన్న విండ్‌, హైడల్‌, సోలార్‌ విద్యుత్‌ ప్రాజెక్ట్‌లో అనుసరిస్తున్న టెక్నాలజీతో 33,000 మెగా వాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసే అవకాశం ఏపీలో ఉందన్నారు. ఈ మహాత్తర కార్యక్రమంలో భాగస్వాములయ్యేందుకు ఏపీ తరపున పారిశ్రామిక వేత్తలను ఆహ్వానిస్తున్నట్టు సీఎం తెలిపారు. పర్యావరణం పట్ల ప్రేమ ఉన్నవారు, బిగ్‌ థింకింగ్‌ ఉన్న వారికి ఏపీలో అపారమైన అవకాశాలు ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నీతి ఆయోగ్‌ చైర్మన్‌ అమితాబ్‌ కాంత్‌ మాట్లాడుతూ కర్బన రహిత విద్యుత్‌ ఉత్పత్తికి భారత్‌లో పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని, వాటిని ఏపీ ఒడిసిపట్టుకుందని ఆయన అన్నారు. కర్నూలు ప్రాజెక్ట్‌లో పంప్డ్‌ స్టోరేజీ ద్వారానే 1650 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేయడం గొప్ప విషయంగా పేర్కొన్నారు. ఈ రోజు ఏపీ అమలు చేస్తున్న టెక్నాలజీ రేపు ప్రపంచం అంతా అనుసరించక తప్పదన్నారు. ఏపీ అమలు చేస్తోన్న కర్బన రహిత పారిశ్రామిక విధానంపై ప్రశంసలు కురిపించారు. గ్రీన్‌ ఎనర్జీ కోసం ఏపీ సీఎం అమలు చేస్తున్న విధానం బాగుందని కొనియాడారు.
ఏపీలో పెట్టుబడులకు ముందుకొచ్చిన ఆదిత్య మిట్టల్‌
27 దేశాలను పరిశీలించిన తర్వాత ఏపీలో పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించినట్టు ఆర్సెల్లార్‌ తరపున ఆదిత్య మిట్టల్‌ తెలిపారు. రాబోయే రోజుల్లో తమ పెట్టుబడులు రెట్టింపు చేస్తామన్నారు. స్టీల్‌ ఉత్పత్తి రంగం నుంచి 8 శాతం కార్బన్‌ విడుదల అవుతోంది. కానీ ఏపీలో ఉత్పత్తి చేయబోతున్న హైడ్రోజన్‌ను స్టీలు పరిశ్రమలో ఉపయోగించడం ద్వారా స్టీల్‌ రంగంలో కర్బన్‌ ఉద్గారాలను గణనీయంగా తగ్గిస్తామని అన్నారు. త్వరలో ఏపీలో తొలి పునరుత్పాదక విద్యుత్‌ ప్రాజెక్ట్‌ను ప్రారంభిస్తామని ప్రకటించారు. కర్నూలు ప్రాజెక్ట్‌ ద్వారా విద్యుత్‌తో పాటు భారీ ఎత్తున అమ్మోనియం ఉత్పత్తి అవుతుందని గ్రీన్‌కో సీఈవో అనిల్‌ చలమల శెట్టి తెలిపారు. దేశీయ అవసరాలకు పోను మిగిలిన అమ్మోనియాన్ని విదేశాలకు ఎగుమతి చేస్తామన్నారు. కర్బన రహిత విద్యుత్‌ ఉత్పత్తి సమర్థంగా చేయాలంటే డిజిటలైజేషన్‌ తప్పనిసరని, అందుకోసం ప్రపంచ స్థాయి టెక్నాలజీని ఉపయోగిస్తున్నట్లు దస్సాల్ట్‌ సిస్టమ్స్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ఫ్లోరెన్స్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇతరులు ప్రసంగించారు. కేపీఎంజీ గ్లోబల్‌ హెడ్‌ రిచర్డ్‌ సెషన్‌ మోడరేటర్‌గా వ్యవహరించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img