Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

కార్పొరేట్‌శక్తులకు దేశ సంపద దోపిడీ

. బీజేపీ ప్రభుత్వానికి గుణపాఠం చెబుదాం
. ఉక్కు కర్మాగారాన్ని రక్షించుకుందాం
. విశాఖ సభలో నారాయణ, రాఘవులు

విశాలాంధ్ర- గాజువాక/కూర్మన్నపాలెం: దేశాన్ని కొల్ల గొట్టే కార్పొరేట్‌లకు దేశ సంపదను కట్టబెట్టే బీజేపీ ప్రభుత్వానికి ఈ ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్‌ కె.నారాయణ, సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు పిలుపు నిచ్చారు. విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌ ఆర్చి వద్ద సీపీఐ, సీపీఎం అధ్వర్యాన బీజేపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రచార భేరి బహిరంగ సభ బుధవారం జరిగింది. బహిరంగ సభకు సీపీఐ, సీపీఎం పార్టీల జిల్లా కార్యదర్శులు మరుపిళ్ల పైడిరాజు, ఎం. జగ్గునాయుడు అధ్యక్షత వహించారు. నారాయణ మాట్లాడుతూ పటిష్ఠవంతమైన వైసీపీ మోదీ ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టే ప్రతి బిల్లుకు ఆమోదం తెలిపిందని విమర్శించారు. అంత సఖ్యతగా ఉండే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య విశాఖ స్టీల్‌ప్లాంట్‌ విషయంలో ఎందుకు తేడాలు వచ్చాయని ప్రశ్నించారు. ఉద్యమంతో సాధించుకున్న విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరించాలని మోదీ సర్కారు భావించడం దుర్మార్గమని మండిపడ్డారు. విశాఖ ఉక్కును ఉద్యమాల ద్వారా సాధించుకున్నామని గుర్తుచేశారు. ప్రభుత్వాల అసంబద్ధ పోకడలతో విశాఖ ఉక్కును సర్వనాశనం చేస్తున్నారన్నారు. గుజరాత్‌లో మోదీ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో అదానీ ఒక స్మగ్లర్‌ అని చెప్పారు. నాటి నుండి నేటి వరకూ దేశంలోని ప్రజల సంపదను దోచుకున్నారని తెలిపారు. పోర్టులు, ఎయిర్‌పోర్టులను మోదీకి కట్టబెట్టారని, నరేంద్ర మోదీ ప్రభుత్వం అండగా ఉండడం వల్లే కార్పొరేట్‌ శక్తులు పేట్రేగి పోతున్నాయన్నారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని నూటికి నూరు శాతం అమ్మడానికి కేంద్రం కుట్ర చేస్తున్నదని ఆక్షేపించారు. ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికవర్గం రెండేళ్లుగా ఆందోళన చేపడుతున్నదన్నారు. ప్రజల సంపదను కార్పొరేట్లకు కారుచౌకగా కట్ట బెట్టే నరేంద్ర మోదీకి పరాభవం తప్పదన్నారు.
బీవీ రాఘవులు మాట్లాడుతూ లౌకిక రాజ్యాన్ని మోదీ కాలరాస్తున్నారని విమర్శించారు. వేర్పాటువాదం, మతతత్వాన్ని పెంచి పోషించడం వల్లే దేశంలో అల్లర్లు జరుగుతున్నాయని మండిపడ్డారు. దేశంలో రాజకీయ పార్టీల నాయకులు అనేక అక్రమాలకు పాల్పడిన సంఘటనలు కోకొల్లలుగా ఉన్నాయన్నారు. బాబాసాహెబ్‌ డాక్టర్‌ అంబేద్కర్‌ కుల వ్యవస్థ ఉండకూడదని ఆనాడే చెప్పారన్నారు. అయితే నేటి ప్రభుత్వాలు అంబేద్కర్‌ ఆలోచనలను పట్టించుకోవడం లేదన్నారు. పాలకులు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రజలంతా తీవ్రంగా ఖండిరచాలన్నారు. దేశ సంపదను కార్పొరేట్‌ శక్తులకు దోచిపెట్టే కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ కుల వ్యవస్థను పెంచి పోషించడం వల్లే దేశంలో అరాచకం ప్రబలిందని చెప్పారు. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ తప్పుడు విధానాలు అవలంబిస్తున్న మోదీని గద్దె దించడమే లక్ష్యంగా ముందుకుసాగాలని పిలుపునిచ్చారు. రానున్న ఎన్నికల్లో మోదీని, వారికి మద్దతు పలికే పార్టీలను ఓడిరచాలన్నారు. విశాఖ ఉక్కు ప్రభుత్వ రంగంలోనే కొనసాగుతుందని, ఆ దిశగా పోరాటాలు ఐక్యంగా సాగిస్తామని చెప్పారు. సభలో సీపీఎం రాష్ట్ర నాయకులు సీహెచ్‌ నరసింగరావు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె.లోకనాథం, ఏఐటీయూసీ గుర్తింపు యూనియన్‌ ప్రధాన కార్యదర్శి డి.ఆదినారాయణ, జీవీఎంసీ సీపీఐ ఫ్లోర్‌ లీడర్‌ ఏజే స్టాలిన్‌, ఏఐటీయూసీ అధ్యక్షుడు టి.నరసింగరావు, స్టీల్‌ ప్లాంట్‌ సీఐటీయూ గౌరవాధ్యక్షుడు జె.అయోధ్యరాము, ప్రధాన కార్యదర్శి యు.రామస్వామి, నాయకులు నమ్మి రమణ, సీపీఎం జిల్లా అధ్యక్షుడు కేఎం శ్రీనివాస్‌, గాజువాక సీపీఐ నేత కసిరెడ్డి సత్యనారాయణ, సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఆర్‌కేవీఎస్‌ కుమార్‌, సీపీఐ స్టీల్‌ కార్యదర్శి తాండ్ర కనకరాజు, సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జగన్‌, సీపీఐ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎస్‌కెే రెహమాన్‌, కె.సత్యాంజనేయ, ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి వై.సత్యవతి, మహిళా సంఘం జిల్లా కార్యదర్శి కె.వనజాక్షి, స్టీల్‌ ప్లాంట్‌ సీఐటీయూ నాయకులు ఎన్‌.రామారావు, స్టీల్‌ ఏఐటీయూసీ నాయకులు బి.అప్పారావు, సీపీఐ శాఖ కార్యదర్శులు ఎల్లేటి శ్రీనివాసరావు, జి.ఆనంద్‌, అప్పారి విష్ణుమూర్తి, పల్లేటి పోలయ్య, సీఐటీయూ కార్యదర్శి వీవీజీఎస్‌డీ ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img