Friday, April 19, 2024
Friday, April 19, 2024

కార్మికులను చైతన్యపరచాలి

ఏఐటీయూసీ రాష్ట్ర మహాసభల్లో రామకృష్ణ సందేశం

విశాలాంధ్రబ్యూరో`గుంటూరు: ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయాలే సుప్రీం అని, కార్మికవర్గమంతా రాజకీయాలలోకి రావాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ పిలుపుని చ్చారు. రాష్ట్రంలోని లక్షలాది మంది ఉద్యోగులు, కార్మికులను రాజకీయంగా చైతన్యవంతం చేసి బలమైన సంస్థగా ఎదిగి రాష్ట్ర రాజకీయాలలో మార్పునకు ఏఐటీయూసీ రాష్ట్ర 17వ మహాసభలు నాంది పలకాలన్నారు. ఇక్కడ జరుగుతున్న ఏఐటీయూసీ రాష్ట్ర 17వ మహాసభల్లో చివరి రోజు మంగళవారం రామకృష్ణ సందేశమిస్తూ, కార్మికవర్గాన్ని ఉత్తేజ పరచడానికి ఈ మహాసభలు దోహదపడతాయన్నారు. దేశాన్ని మోదీ కార్పొరేట్‌ ఎజెండాతో ముందుకు తీసుకువెళుతున్నారన్నారు. రైతు వ్యతిరేక, కార్మిక చట్టాలను తీసుకువచ్చి రైతు చట్టాలని పేరు పెట్టారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో జగన్‌ ప్రభుత్వం 13 లక్షల మంది ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్‌లను పీఆర్సీ విషయంలో తీవ్ర ఇబ్బందులకు గురిచేసిందన్నారు. ఫిబ్రవరి 3న విజయవాడలో జరిగిన ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నిరసన రాష్ట్ర రాజకీయాలు పూర్తిగా మార్చివేసిందన్నారు. అసెంబ్లీ సమావేశాలలో గవర్నర్‌ ప్రసంగిస్తూ రూ.1.32 వేల కోట్లు సంక్షేమ పథకాల రూపేణ ప్రజల అకౌంట్‌లలో వేశారని పేర్కొన్నారు. అయితే ముఖ్యమంత్రి జగన్‌ రెండున్నర ఏళ్లల్లో చేసిన అప్పు మాత్రం చెప్పలేదన్నారు. పరిశ్రమలు, ఐటీ రంగం రాష్ట్రంలో పూర్తిగా లేకుండా పోయిందన్నారు. చివరికి ఆంధ్ర రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్‌గా మార్చారన్నారు. కార్మికవర్గం రాజకీయాలలో ముందుకు పోవాలని సూచించారు. ఏఐటీయూసీ రానున్న రోజులలో బలోపేతమైన శక్తిగా ఎదిగి మరిన్ని పోరాటాలకు నాంది పలకాలని ఆకాంక్షించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img