Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

కార్మికోద్యమనేత వీవీ రామారావు కన్నుమూత

కన్నీరుమున్నీరైన కార్మికవర్గం
నేడు అంత్యక్రియలు

విశాఖపట్నం : కార్మిక ఉద్యమానికి పెద్దదిక్కుగా ఉన్న వీవీ రామారావు (వీవీఆర్‌) (74)ఇకలేరు. దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇక్కడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం 8-30 గంటల సమయంలో తుది శ్వాసవిడిచారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తెలున్నారు. పారిశ్రామిక నగరంగా ఉన్న విశాఖలో కార్మిక ఉద్యమాన్ని నిర్మించడంలో వీవీఆర్‌ కృషి ఎనలేనిది. ఆల్‌ ఇండియా పోర్ట్‌ అండ్‌ డాక్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ ప్రధాన కార్యదర్శిగా, విశాఖపట్నం హార్బర్‌ అండ్‌ పోర్ట్‌ వర్కర్స్‌ యూనియన్‌ అగ్రనాయకుడుగా ఉద్యమ నిర్మాణంలో ముఖ్య భూమిక పోషించారు. విశాఖ పోర్టులో, వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఏఐటీ యూసీని తిరుగులేని సంస్థగా నిలపడంలో ఆయన కృషి ఎనలేనిది. పోర్ట్‌ యూనియన్‌ను తిరుగులేని, శక్తివంతమైన సంస్థగా నిర్మించడంలో వీవీఆర్‌ పోషించిన పాత్ర అనితరసాధ్యమైనది.
విద్యార్థి దశలోనే ఉద్యమాలవైపు
కృష్ణా జిల్లా, కైకలూరు తాలూకా, బైరావపట్నం గ్రామంలో 1947 అక్టోబరు 7న వేమూరి వెంకట కృష్ణయ్య, సంపూర్ణమ్మ దంపతులకు రామారావు జన్మించారు. బందరు తాలూకాలో చిట్టిగూడూరులో ప్రాథమిక విద్యాభ్యాసం, గూడూరులో హైస్కూలు విద్య, మచిలీపట్నం ఆంధ్ర జాతీయ కళాశాలలో పీయూసీ, కర్నూలు జిల్లా నంద్యాల పాలిటెక్నిక్‌ కాలేజి లో సివిల్‌ ఇంజనీరింగ్‌ డిప్లొమా చేశారు. పీయూసీ చదివే రోజుల్లోనే కామ్రేడ్‌ కొండపల్లి మాధవరావు సహచర్యంలో కమ్యూనిస్టు భావాల వైపు, అఖిల భారత విద్యార్థి సమాఖ్య(ఏఐఎస్‌ఎఫ్‌) ఉద్యమం వైపు ఆకర్షితులయ్యారు. విద్యార్థి దశ పూర్తికాగానే పార్టీ కోసం పూర్తి కాలం పనిచేయాలని భావించి నాటి పార్టీ రాష్ట్ర కార్యదర్శి నీలం రాజశేఖరరెడ్డి సూచన మేరకు విశాఖపట్నం పోర్ట్‌ యూనియన్‌లో పూర్తికాలం ట్రేడ్‌ యూనియన్‌ కార్యకలాపాలు నిర్వహించే నిమిత్తం 1971 జన వరిలో విశాఖపట్నం చేరుకున్నారు. 1969 ఏప్రిల్‌లో సామాన్యమైన రైతు కుటుంబానికి చెందిన అఖిల కుమారితో వివాహమైంది. 1971లో పోర్ట్‌ యూని యన్‌లో ఆఫీసు కార్యదర్శిగా చేరారు. 1975లో యూనియన్‌ కార్యదర్శిగా ఎన్నికయ్యారు. 1980లో యూనియన్‌ కార్యనిర్వాహక అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. 1936లో స్థాపించి నేటి వరకూ విశాఖ రేవు కార్మికుల అగ్రగామి సంస్థగా వున్న యూనియన్‌ను విచ్ఛిన్నం చేయాలని చేసిన ప్రయ త్నాలను త్రిప్పికొట్టి యూనియన్‌ను పరిరక్షించు కోవడంలో, పటిష్టవంతం చేయడంలో రామారావు క్రియాశీల పాత్ర పోషించారు. పోర్ట్‌ ట్రస్ట్‌ బోర్డులో 1984 నుండి 25 సంవత్సరాలకు పైబడి కార్మిక ప్రతినిధిగా ప్రాతినిథ్యం వహించారు. విశాఖ రేవులో ఎగుమతులు, దిగుమతులు చేసే కార్మికుల స్థితి గతులను మెరుగుపరచడం కోసం ఏర్పాటు

చేసిన విశాఖ డాక్‌ లేబర్‌ బోర్డు (త్రైపాక్షిక సంఘం) 1969లో ఏర్పడిరది. ఈ బోర్డులో పనిచేసే 3,000 మంది కార్మికులు ఐఎన్‌టీయూసీ నాయకత్వానికి స్వస్తి చెప్పి 1972లో మొత్తం కార్మికులు ఏఐటీయూసీలో చేరారు. నేటికీ 85 శాతం మంది ఏఐటీయూసీ యూనియన్‌లో కొనసాగుతున్నారు. 1969లో పోర్టు డాక్‌ వాటర్‌ ఫ్రంట్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా స్థాపితమైంది. దానికి ప్రారంభం నుండి ఇంద్రజిత్‌ గుప్తా అధ్యక్షునిగా వుండేవారు. 1995లో విశాఖపట్నంలో జరిగిన ఫెడరేషన్‌ మహాసభలో ఇంద్రజిత్‌ గుప్తా అధ్యక్షునిగా, వీవీరామారావు ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఏఐటీయూసీలో సాధారణ కార్యకర్త స్థాయి నుండి అంచెలంచెలుగా ఎదిగి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ లో రాష్ట్ర అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహించారు. 2005లో ఢల్లీిలో జరిగిన జాతీయ మహాసభలో కార్యదర్శిగా ఎన్నికైనారు. ప్రస్తుతం ఉపాధ్యక్షులుగా ఉన్నారు. సీపీఐ సాధారణ సభ్యుడిగా జీవితం ప్రారంభించి, అనతికాలం లోనే విశాఖపట్నం జిల్లా కార్యవర్గ సభ్యుడిగా, పట్టణ కార్యదర్శిగా, జిల్లా కార్యదర్శిగా, రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యు డుగా, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా, కార్యదర్శివర్గ సభ్యుడిగా బాధ్యతలు నిర్వహించారు. ఉద్యమాలకు నాయకత్వం వహించి 10 రోజులపాటు విశాఖపట్నం సెంట్రల్‌ జైలులో శిక్ష అనుభవించారు. 1981 తొలి విశాఖపట్నం కార్పొరే షన్‌ ఎన్నికలలో కార్పొరేటర్‌ (1981-86) గా ఎన్నికయ్యారు. విశాఖ స్టీల్‌ యూనియన్‌కు 10 సంవత్సరాలుగా గౌరవాధ్య క్షునిగా వున్నారు. చిట్టివలస జూట్‌ కార్మికుల యూనియన్‌ కు గౌరవాధ్యక్షులుగా పది సంవత్సరాలపాటు పనిచేశారు.
సీపీఐ సంతాపం
కార్మిక యోధుడు వీవీ రామారావు మృతికి సీపీఐ జాతీయ కార్యదర్శివర్గం సంతాపం తెలిపింది. ఆయన మృతితో పార్టీ నిబద్ధతకలిగిన కార్మిక నాయకుడిని కోల్పోయిందని పేర్కొంది. దేశంలో కార్మిక, కమ్యూనిస్టు ఉద్యమానికి ఆయన మృతి తీరనిలోటని తెలిపింది. న్యాయమైన సమస్యల పరిష్కారానికి పోరాటాలలో కార్మిక, అట్టడుగు వర్గాల ప్రజానీకాన్ని సమీకరించారని పేర్కొంది. ఆయన మృతికి సంతాపాన్ని కుటుంబ సభ్యులకు సానుభూతిని సీపీఐ జాతీయ కార్యదర్శివర్గం తెలిపింది. రామారావు మృతికి సీపీఐ ప్రధాన కార్యదర్శి డి. రాజా, మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి, జాతీయ కార్యదర్శి డాక్టరు కె. నారాయణ, ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి అమర్‌జిత్‌ కౌర్‌, జాతీయ ఉపాధ్యక్షులు బీవీ విజయలక్ష్మీ తదితరులు రామారావు మృతివార్త తెలిసినవెంటనే ఆయన భార్య, కుమార్తెలకు ఫోన్‌ చేసి సానుభూతి తెలిపారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, సహాయ కార్యదర్శులు ముప్పాళ్ల నాగేశ్వరరావు, జేవీ సత్యనారాయణమూర్తి, కార్యదర్శివర్గ సభ్యులు జల్లి విల్సన్‌, రావుల వెంకయ్య, పి హరినాథ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి కామేశ్వరరావు, ఏ జె స్టాలిన్‌, వై. చెంచయ్య, సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్ష , ప్రధాన కార్యదర్శులు రావులపల్లి రవీంద్రనాథ్‌, జి. ఓబులేసు, జాతీయ ఉపాధ్యక్షులు డి. ఆదినారాయణ, రాష్ట్ర కార్యదర్శి పడాల రమణ, ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం అధ్యక్షులు పి. రామచంద్రయ్య, కేవీవీ ప్రసాద్‌, ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయకార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి ఆవుల శేఖర్‌, విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌ ఎడిటర్‌ గడ్డం కోటేశ్వరరావు, ఆర్టీసీఎంప్లాయీస్‌ యూనియన్‌ రాష్ట్ర మాజీ అధ్యక్షులు ఎన్‌ఏ ఖాన్‌, దళిత హక్కుల పోరాట సమితి (డీహెచ్‌పీఎస్‌) రాష్ట్ర అధ్యక్షులు జేవీ ప్రభాకర్‌, సీపీిఐ జిల్లా, నగర కార్యదర్శులు బాలేపల్లి వెంకటరమణ, ఎం పైడి రాజు తమ సంతాపాన్ని తెలియజేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img