Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

కృష్ణమ్మ పరవళ్లు – సందర్శకుల తాకిడి

నిండుకుండలా శ్రీశైలం
90 శాతం నిండిన నాగార్జునసాగర్‌
నేడు ప్రకాశం బ్యారేజీకి చేరనున్న భారీ నీటివరద
దిగువ ప్రాంతాలను అప్రమత్తం చేసిన అధికార యంత్రాంగం

విశాలాంధ్ర బ్యూరో` అమరావతి : కృష్ణమ్మ పరవళ్ళు తొక్కుతోంది. పక్షం రోజుల క్రితం ఆందోళనకరంగా ఉన్న నీటి ప్రాజెక్టులు ఇప్పుడు నీటితో కళకళలాడుతున్నాయి. ఆలమట్టి డ్యామ్‌ నిండడం, ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో ఏపీలో కృష్ణా నీటి ప్రాజెక్టులకు భారీ నీటి ప్రవాహం వచ్చి చేరుతోంది. శ్రీశైలం జలాశయా నికి ప్రస్తుతం 5,58,084 లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది. దీంతో ప్రాజెక్టు నిండుకుండలా ఉంది. పది గేట్లను 20 అడుగుల మేరకు ఎత్తి దిగువకు సుమారు నాలుగున్నర లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఈ ఆహ్లాదకరమైన దృశ్యాల్ని చూసేందుకు పర్యాటకులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. దీంతో కిలోమీటర్ల మేరా వాహనాలు నిలిచిపోతున్నాయి. సందర్శకులు సెల్ఫీలు దిగుతూ ఆనందంలో మునిగి తేలుతున్నారు. డ్యాం చుట్టూ అన్ని రహదారులు రద్దీగా మారాయి. జలాశయ సామర్థ్యం 215.807 టీఎంసీలు కాగా ప్రస్తుత సామర్థ్యం 207.4103 టీఎంసీలుగా నమోదయింది. జలాశయానికి ఎగువ ప్రాంతాలు జూరాల 4,82,523 క్యూసెక్కులు, సుంకేసుల 55,356 ఇన్ఫ్లోగా 5,11,125 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది. కుడి విద్యుత్‌ కేంద్రానికి విద్యుత్‌ ఉత్పాదన కొనసాగిస్తూ 30,646 క్యూసెక్కులు, ఎడమ విద్యుత్‌ కేంద్రం నందు విద్యుత్‌ ఉత్పాదన కొనసాగిస్తూ 31,784 క్యూసెక్కులు జలాశయం రేడియల్‌ క్రస్ట్‌ గేట్ల ద్వారా 4,67,920 క్యూసె క్కుల నీరు అవుట్‌ ఫ్లోగా విడుదల చేస్తున్నారు.ఈ వరద నీరంతా దిగువన ఉన్న నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుకు చేరుతోంది. శనివారం సాయంత్రానికి సాగర్‌ నీటిమట్టం 590 అడుగులకు గాను ప్రస్తుతం 574.74 అడుగులకు చేరింది. సాగర్‌ రిజర్వాయర్‌ సామర్ధ్యం 312 టీఎంసీలకు గాను ప్రస్తుతం 264.3579 టీఎంసీల నీరు నిల్వ వుంది. సాగర్‌కు ప్రస్తుతం ఇన్‌ఫ్లోగా 3,85,191 క్యూసెక్కుల నీరు వస్తుండటంతో విద్యుత్‌ ఉత్పత్తి ద్వారా 36, 441 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నీటి నిల్వ భారీగా పెరగటంతో కుడి, ఎడమ గట్టు జలవిద్యుత్‌ కేంద్రాలలో జెన్‌కో అధికారులు విద్యుత్‌ ఉత్పాదనను కొనసాగిస్తున్నారు. పై నుండి వరద నీరు రోజురోజుకి భారీగా తరలి వస్తుండడంతో రోజుకి 32 టీఎంసీలకు పైగా ప్రాజెక్టుకు నీరు చేరుకుంటోంది. దీంతో మరో 24గంటల్లోనే ప్రాజెక్టు నీటిమట్టం పూర్తి స్ధాయికి చేరుకొనే అవకాశాలున్నాయని ప్రాజెక్టు అధికారులు అంచనాలు చేస్తున్నారు. ఇక సాగర్‌ జలాశయాన్ని చూసేందుకు ఇప్పటికే పర్యాటకులు తరలిరావటంతో పర్యాటక ప్రాంతమైన నాగార్జున సాగర్‌ సందడిగా మారింది. ఇక సాగర్‌ దిగువన ఉన్న పులిచింతల ప్రాజెక్టుకు రూ.38,701 క్యూసెక్కుల నీటి ప్రవాహం చేరుతుండగా, వచ్చిన నీటిని మొత్తం దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో విజయవాడ దగ్గరున్న ప్రకాశం బ్యారేజీకి వరద ఉధృతి పెరుగుతోంది. ప్రస్తుతం 35,346 క్యూసెక్కుల నీరు చేరుతుండగా, ఈ మొత్తం నీటిని అన్ని గేట్లు ఎత్తి సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ఇక మరికొద్ది గంటల్లో సాగర్‌ నిండితే మొత్తం గేట్లు ఎత్తి నీరు దిగువకు వదలనున్నందున పులిచింతల, ప్రకాశం బ్యారేజ్‌ దిగువనున్న నదీ తీర ప్రాంతాలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. లోతట్టు ప్రాంత ప్రజలను, లంకల్లో నివసించేవారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. కృష్ణా జిల్లాలో జగ్గయ్యపేట నుంచి అవనిగడ్డ వరకు నదీ పరీవాహక ప్రాంతాలను అప్రమత్తం చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్‌ నివాస్‌ దీనిపై శనివారం ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో ప్రత్యేక కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img