Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

కృష్ణా జలాలపై కిరికిరి

. నీటి వినియోగం లెక్కలు తేల్చాలని తెలంగాణ పట్టు
. వాటాకు మించి ఏపీ వాడుకుంటోందని అభియోగం
. కేఆర్‌ఎంబీ త్రిసభ్య సమావేశంలో ఫిర్యాదు

విశాలాంధ్ర బ్యూరో`అమరావతి : కృష్ణా జలాల వినియోగంపై ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదం ఇప్పట్లో తేలేలా కనపడటం లేదు. కృష్ణా నీటి వినియోగంపై ఏ రాష్ట్రం ఎంత వాడుకోవాలనే దానిపై స్పష్టంగా లెక్కలున్నప్పటికీ తెలంగాణ, వివిధ అంశాలను లేవనెత్తుతూ కిరికిరి పెడుతోంది. హైదరాబాద్‌ జలసౌధలో శుక్రవారం కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) త్రిసభ్య కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఏపీ ఈఎన్సీ నారాయణ రెడ్డి హాజరు కాలేదు. ఈరోజు పోలవరం ప్రాజెక్టు సందర్శన ఉన్నందున సమావేశానికి హాజరు కాలేనని బోర్డు సభ్య కార్యదర్శికి తెలియజేశారు. అయితే ఆయన ముందుగానే సమాచారం ఇచ్చినప్పటికీ, ఆ స్థానంలో మరో అధికారిని పంపే ప్రయత్నం చేయలేదు. దీంతో ఈ త్రిసభ్య కమిటీ సమావేశానికి కేఆర్‌ఎంబీ సభ్య కార్యదర్శి రాయిపురే, తెలంగాణ ఈఎన్సీ మురళీధర్‌ మాత్రమే హాజరు కాగా, ఆయన తన రాష్ట్రం తరపున కమిటీ ఎదుట తన వాదనలను బలంగా వినిపించారు. ప్రస్తుత నీటి సంవత్సరంలో కృష్ణా నీటి వినియోగం లెక్కలు తేల్చాలని కోరారు. దానివల్ల రెండు రాష్ట్రాల్లో ఏ రాష్ట్రం ఎంత వాడుకున్నది, ఎవరి వాటా ఎంత మిగిలి ఉందో తేలిపోతుందన్నారు. ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్‌ ఇప్పటికే వాటాకు మించి కృష్ణా జలాలను వాడుకుందని లెక్కలు చెప్పారు. నీటి లెక్కల విషయంలో కఠినంగా వ్యవహరించాలని కోరారు. తెలంగాణ రాష్ట్రం ఇంకా 141 టీఎంసీల నీటిని వాడుకోవడానికి అవకాశం ఉందని, ఆ మేరకు నీటిని వాడుకుంటామని మురళీధర్‌ తెలియజేశారు. ఇటీవల కృష్ణానదీ నీటి యాజమాన్య బోర్డుకి చైర్మన్‌ కొత్తవారు నియమితులైనందున సాధ్యమైనంత త్వరగా పూర్తిస్థాయి బోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. ఆ సమావేశంలో కృష్ణా జలాల వినియోగంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలపై అన్ని అంశాలను చర్చిద్దామని ప్రతిపాదించారు. ఏపీ ఈఎన్సీ సమావేశానికి హాజరు కానందున వచ్చే నెల మొదటివారంలో మరోసారి త్రిసభ్య కమిటీ సమావేశం ఏర్పాటు చేసి, దానిలో చర్చిద్దామని కేఆర్‌ఎంబీ సభ్య కార్యదర్శి రాయిపురే సూచించినట్లు తెలిసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img