Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

కృష్ణా ప్రాజెక్టులపై మళ్లీ కిరికిరి

ప్రకాశం బ్యారేజీ దిగువ ఆనకట్టలు, పంప్డ్‌ స్టోరేజీలకు అడ్డుకట్ట
కేఆర్‌ఎంబీకి తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు

విశాలాంధ్ర బ్యూరో` అమరావతి: కృష్ణా నదీ జలాల వివాదం ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్య ముగిసేలా కానరావడం లేదు. నదీ తీరాన ఎగువ నుంచి దిగువ ప్రాంతం వరకు చిన్నపాటి ఎత్తిపోతల పథకం ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నించినా తెలంగాణ ప్రభుత్వం కేఆర్‌ఎంబీకి ఫిర్యాదు చేస్తూ తరచూ అడ్డుపడుతోంది. తాజాగా విజయవాడ ప్రకాశం బ్యారేజీ దిగువున రెండు ఆనకట్టల నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేఆర్‌ఎంబీ చైర్మన్‌కు తెలంగాణ ఈఎన్సీ మురళీధర్‌ రెండు లేఖలు రాశారు. ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టం ప్రకారం అపెక్స్‌ కౌన్సిల్‌, కృష్ణా నదీ యాజమాన్య బోర్డు అనుమతి లేకుండా కొత్త ప్రాజెక్టులు చేపట్టడానికి వీల్లేదని లేఖలో పేర్కొన్నారు. ఎలాంటి అనుమతుల్లేకుండా ఏపీ ప్రభుత్వం కృష్ణానదిపై ప్రకాశం బ్యారేజీ దిగువన రెండు ఆనకట్టల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించడం సరికాదని అభ్యంతరం తెలిపారు. దీనిని తక్షణమే నిలువరించాలని కోరారు. కృష్ణా జలాలపై ఆధారపడి పంప్డ్‌ స్టోరేజీ స్కీమ్‌లను చేపడుతోందని తెలంగాణ ప్రభుత్వం మరో లేఖ రాసింది. తెలంగాణ పరిధిలోని కృష్ణా బేసిన్‌లో తాగునీటి కొరత ఉండటంతో జాతీయ జలవిధానం ప్రకారం మొదట తాగునీటికి ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుందని గుర్తు చేసింది. జలవిధానం మేరకు తాగునీటి అవసరాలకు ప్రాధాన్యం ఇవ్వకుండా కృష్ణా బేసిన్‌ వెలుపలకు పంప్డ్‌ స్టోరేజీ విద్యుత్‌, ఇతర అవసరాల కోసం నీటిని తరలించడం సరికాదని పేర్కొంది. సీడబ్ల్యూసీ, కృష్ణా బోర్డు, అపెక్స్‌ కౌన్సిల్‌ అనుమతి లేని పంప్డ్‌ స్టోరేజీ పథకాలను పరిశీలించాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img