Thursday, April 18, 2024
Thursday, April 18, 2024

పరిహారం ఇచ్చాకే పోలవరంలో నీళ్లు నింపుతాం.. ఆ నిధుల కోసమే కేంద్రంతో కుస్తీ…

: సీఎం జగన్‌
వరద బాధితులకు ఎక్కడా ఇబ్బంది లేకుండా చూసుకున్నామని, పోలవరం నిర్వాసితులకు న్యాయం చేశాకే పోలవరంలో నీళ్లు నింపుతామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. పునరావాసం..పరిహారం కోసం కేంద్రంతో పోరాటం చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రానికి ఇప్పటికే కేంద్రం నుంచి రెండు వేల కోట్లకు పైగా నిధులు రావాల్సి ఉందన్నారు. పునరావాసం కింద పరిహారం ఇచ్చేందుకు తక్కువ మొత్తం అయితే తానే బాధ్యత తీసుకొనేవాడినని.. దాదాపు 20 వేల కోట్లు అవుతుందని చెప్పుకొచ్చారు. పోలవరం ప్రాజెక్టు నిధుల కోసం కేంద్రంతో కుస్తీ పడుతున్నామన్నారు. బుధవారం అల్లూరి సీతారామరాజు జిల్లాలోని చింతూరు మండలం కోయుగూరులో వరద బాధితులతో సీఎం జగన్‌ పరామర్శ కొనసాగింది. వరద బాధితులతో ముఖాముఖి నిర్వహించిన ముఖ్యమంత్రి తమ లాంటి మానవత్వం ఉన్న ప్రభుత్వం మరెక్కడా ఉండదని చెప్పుకొచ్చారు. పోలవరం నిర్వాసితులకు న్యాయం చేశాకే పోలవరంలో నీళ్లు నింపుతామంటూ ముఖ్యమంత్రి జగన్‌ ప్రకటించారు. పరిహారం అందకుండా..వాళ్లకు న్యాయం జరగకుండా పోలవరంలో నీరు నింపనంటూ నిర్వాసితులకు హామీ ఇచ్చారు. వారు ప్రాజెక్టు కోసం త్యాగాలు చేశారని..వారికి గుర్తింపు ఉంటుందని చెప్పుకొచ్చారు. కొందరు గ్రామస్తులు తమను తెలంగాణలో కలపాలంటూ ముఖ్యమంత్రిని కోరారు. ఆ సమయంలో కేంద్రం ఇప్పుడు పోలవరంలో వాళ్లే ప్రతీ అంశంలోనూ నివేదికలు ఇస్తున్నారని..అన్నింటా నిర్ణయాలు తీసుకుంటున్నారని సీఎం చెప్పుకొచ్చారు. కేంద్రంతో పోరాటం చేస్తున్నాం కేంద్రంతో తాము నిర్వాసితుల సమస్యల పైన పోరాటం చేస్తునే ఉన్నామని.. ఎప్పటికైనా నిధులు ఇవ్వాల్సిందేనని..అవి ముందుగా ఇవ్వాలని కోరుతూ వస్తున్నామని చెప్పారు. కేంద్రం ఇవ్వకుంటే రాష్ట్రమే బాధ్యత తీసుకుంటుందని హామీ ఇచ్చారు. సహాయం అందరికీ అందాలనే తాపత్రయం.. గతంలో కన్నా పరిస్థితిలో ఎంతో మారిందని సీఎం జగన్‌ వివరించారు. చింతూరులో దాదాపుగా 20 రోజుల నుంచి నీళ్లు ఉన్న పరిస్థితులు చూడలేదన్నారు. నాలుగు మండలాల్లో కలెక్టర్‌ దాదాపు 20 రోజులుగా మకాం వేసారని చెప్పుకొచ్చారు. సెప్టెంబర్‌ లోగా పోలవరం ముంపు బాధితులకు పరిహారం అందిస్తామని, నిర్వాసితులకు పరిహారం అందాకే.. పోలవరంలో నీళ్లు నింపుతామని సీఎం జగన్‌ తెలిపారు. అప్పటి దాకా ప్రాజెక్టులో నీళ్లు వదలం కేంద్రంపై ఒత్తిడి పెంచుతాం.. నిర్వాసితులను ఆదుకుంటాం అని సీఎం జగన్‌ స్పష్టం చేశారు. కేంద్రం దగ్గర కాకుంటే ఎవరి వద్ద డబ్బులు ఉంటాయని.. కేంద్రం సాయం చేయాల్సిన అవసరం ఉందని సీఎం వ్యాఖ్యానించారు. పారదర్శకంగా బాధితులకు పరిహారం అందించామన్నారు. అందరికీ రేషన్‌, ఇంటింటికీ రూ. 2 వేలు అందించాం. అధికారులను భాగస్వామ్యం చేసి.. కావాల్సిన వనరులు సమకూర్చాం అని సీఎం జగన్‌ స్పష్టం చేశారు. అర్హత ఉన్న అందరికీ రెండు నెలల్లోగా పరిహారం అందుతుందని, ఎలా ఎగ్గొట్టాలనే ఆలోచన ఈ ప్రభుత్వానికి ఉండబోదని పేర్కొన్నారు సీఎం జగన్‌. తాటాకు గుడిసెల నిర్వాసితులకు పరిహారం రూ. ఐదు వేల నుంచి పదివేలకు పెంచుతామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img