Friday, April 19, 2024
Friday, April 19, 2024

కేంద్రంతో మా బంధం రాజకీయాలకు అతీతం

. విభజన గాయాల నుంచి ఇంకా కోలుకోలేదు
. ఇతోధికంగా సాయమందించండి
. మోదీకి సీఎం జగన్‌ విజ్ఞప్తి

విశాలాంధ్రబ్యూరో`విశాఖ : విభజన గాయాల నుంచి ఆంధ్రప్రదేశ్‌ ఇంకా పూర్తిగా కోలుకోలేదని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. కేంద్రం సహృదయంతో చేసే ప్రతి సాయం రాష్ట్ర పునర్నిర్మాణానికి ఉపయోగపడుతుందని చెప్పారు. విశాఖలోని ఏయూ ఇంజినీరింగ్‌ కళాశాల మైదానంలో శనివారం నిర్వహించిన బహిరంగ సభలో జగన్‌ మాట్లాడారు. ప్రధానితో పాటు కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్‌, గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ పాల్గొన్నారు. జగన్‌ మాట్లాడుతూ ‘విశాఖపట్నంలో అడుగుపెట్టిన ప్రధాని మోదీకి ఘనస్వాగతం. ఏయూ ఇంజినీరింగ్‌ కళాశాల మైదానం జనసంద్రాన్ని తలపిస్తోంది. జన కెరటం ఉవ్వెత్తున ఎగసిపడుతోంది. ఉత్తరాంధ్ర జనం ప్రభంజనం మాదిరిగా కదిలివచ్చింది. దాదాపు రూ.10వేల కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేస్తున్నందుకు ప్రధానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అభివృద్ధి, పరిపాలన వికేంద్రీకరణ, పారదర్శకత రాష్ట్రంలో మా ప్రాధాన్యత. ఇంటింటా ఆత్మవిశ్వాసం నింపేందుకు ప్రతి రూపాయి సద్వినియోగం చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వంతో మా అనుబంధం రాజకీయాలకు అతీతం. మాకు రాష్ట్ర ప్రయోజనాలు తప్ప మరో అజెండా ఉండదు. పెద్ద మనస్సుతో మీరు చూపే ప్రేమ ప్రజలంతా గుర్తుపెట్టుకుంటారు. మా రాష్ట్రం జాతీయ స్రవంతితో పాటు అభివృద్ధి చెందడానికి వీలుగా విశాల హృదయంతో మీరు చేసే సాయం, ప్రత్యేకంగా ఇచ్చే సంస్థ రాష్ట్ర పురోభివృద్ధికి దోహదపడుతుంది. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ నుంచి రైల్వే జోన్‌ వరకు అనేక అంశాలపై విజ్ఞప్తి చేశాం. ఏపీకి సహాయ సహకారాలు అందించాలి’ అని మోదీని సీఎం జగన్‌ కోరారు. ఒకవైపు సముద్రం, మరోవైపు జన సముద్రం కనిపిస్తోందన్నారు. కార్తీక పౌర్ణమివేళ ఎగసిపడిన కెరటాలకు మించి జనకెరటం ఇక్కడ ఉవ్వెత్తున ఎగిసిపడుతూ కనిపిస్తోందన్నారు. గాయకుడు వంగపండు, మహాకవి శ్రీశ్రీ, గురజాడ పాటలు, కవితలను జగన్‌ ప్రస్తావించారు. దాదాపుగా రూ.10,742 కోట్లు విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన నరేంద్రమోదీకి కృతజ్ఞతలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ప్రతి రూపాయి సద్వినియోగం దిశగా ప్రజల ప్రభుత్వంగా గడిచిన మూడున్నర సంవత్సరాలలో పిల్లల చదువులు,ప్రజలందరికీ వైద్య- ఆరోగ్యం, రైతుల సంక్షేమం, సామాజిక న్యాయం, మహిళా సంక్షేమంతో పాటు అభివృద్ధి, పరిపాలన వికేంద్రీకరణ, పారదర్శకత, గడపవద్దకే పరిపాలన ప్రాధాన్యతలుగా తమ ప్రభుత్వం ముందుకు సాగుతోందని జగన్‌ చెప్పారు. ఇంటింటా ఆత్మ విశ్వాసం నింపడానికి తమ ఆర్థిక వనరుల్లో ప్రతి రూపాయి సద్వినియోగం చేశామన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img