Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

కేంద్రం ‘అకృత్యాలపై’ సమష్టి పోరాటం

బీజేపీ`ఆర్‌ఎస్‌ఎస్‌ దుష్ప్రచారాన్ని తిప్పికొడదాం..
వ్యక్తిగత ఆకాంక్షలకంటే పార్టీ పటిష్టత ముఖ్యం
కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ పిలుపు
పార్టీ రాష్ట్ర నేతల మధ్య సఖ్యత లోపించడంపై ఆందోళన

న్యూదిల్లీ : కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ ప్రజా వ్యతిరేక విధానాలపై సమష్టిగా పోరాటం చేయాలని కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ పిలుపునిచ్చారు. వ్యక్తిగత ఆకాంక్షల కంటే పార్టీ పటిష్టత ముఖ్యమని, క్రమశిక్షణ, ఐక్యత తప్పనిసరి అని పార్టీ అగ్రనేతలకు స్పష్టమైన సందేశం ఇచ్చారు. వచ్చే ఏడాది ఐదు రాష్ట్రాల్లో కొనసాగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించా ల్సిన వ్యూహంపై చర్చించేందుకు పార్టీ అగ్రనేతలతో మంగళవారం ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశానికి పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, ఇతర ముఖ్య నేతలు, వివిధ రాష్ట్రాల ఇన్‌ఛార్జ్‌లు, పీసీసీ అధ్యక్షులు పాల్గొన్నారు. సమావేశంలో సోనియా మాట్లాడుతూ రాష్ట్ర నాయకులలో కూడా విధానపరమైన అంశాలపై ‘స్పష్టత, సమన్వయం’ లోపించిందని తెలిపారు. కీలకాంశాలపై పార్టీ వైఖరికి చెందిన సమాచారం అట్టడుగు స్థాయి కార్యకర్తల వరకూ వెళ్లడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర నేతల మధ్య అవగాహనా లేమి, సయోధ్య లేమి కనిపిస్తోందని, పార్టీలో క్రమశిక్షణ, ఐక్యత తప్పనిసరి అని, వ్యక్తిగత ఆకాంక్షల కంటే పార్టీ పటిష్టతే మిన్న అని అన్నారు. పార్టీ చేపట్టాల్సిన కొత్త సభ్యత్వ నమోదు, అందుకు అనుసరించాల్సిన విధివిధానాలపైనా సమావేశంలో చర్చించారు. ఏ రాజకీయ ఉద్యమానికైనా కొత్త సభ్యులే కీలకమైనే విషయాన్ని పీసీసీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, ఇన్‌ఛార్జ్‌లు గుర్తించాలని, వారందరికీ ఒక వేదిక కల్పించాలని సూచించారు. దశాబ్దాల తరబడి పార్టీ ఇదే బాటలో నడుస్తోందన్నారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని పార్టీ కార్యకర్తలకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. కార్యకర్తలను గుర్తించి, ప్రభుత్వ తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టినప్పుడే ప్రజాస్వామ్య పరిరక్షణ, రాజ్యాంగ పరిరక్షణ జరుగుతుందని తెలిపారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ దుష్ప్రచారాలపై తప్పనిసరి పోరాటం సాగించాలని, ఈ యుద్ధంలో గెలవాలంటే ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీ అబద్ధాలను ప్రజల ముందుకు తీసుకువెళ్లాలని, ఎండగట్టాలని సోనియా గాంధీ పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు బలైన బాధితుల తరఫున రెట్టించిన ఉత్సాహంతో పోరాటం సాగించాలని, రైతులు, వ్యవసాయ కూలీలు, ఉద్యోగావకాశాల కోసం పోరాడుతున్న యువత, చిన్న, మధ్య తరగతి వ్యాపారులు, మన సోదర, సోదరీమణులు, ముఖ్యంగా అణగారిన వర్గాల సమస్యలపై దృష్టి సారించాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. కేంద్ర ప్రభుత్వం కీలక వ్యవస్థలకు గండికొడుతూ, జవాబుదారీతనానికి తిలోదకాలు ఇస్తోందని ఆరోపించారు. ఎన్నికలకు సిద్ధమవుతున్న రాష్ట్రాల్లో కలిసికట్టు పోరాటానికి పార్టీ కార్యకర్తలు, నేతలు సిద్ధం కావాలని, సమాజంలోని అన్నివర్గాల ఆకాంక్షలు, అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని స్పష్టమైన విధానాలు, కార్యక్రమాలతో పార్టీ ముందుకు వెళుతుందని ఆమె చెప్పారు. ఇదిలాఉండగా, పంజాబ్‌, ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, గోవా, మణిపూర్‌లలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img