Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

కేంద్ర అఫిడవిట్‌ను నిరసిస్తూ ఉక్కు కార్మికుల ఆందోళన

తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్‌

కూర్మన్నపాలెం : ఉక్కు కార్మికుల ఉద్యమం ఉద్ధృతమవుతోంది. ఇందులో భాగంగా ఇవాళ పరిశ్రమ పరిపాలన భవనం వద్ద కార్మిక నేతలు ఆందోళన చేపట్టారు. ఉక్కు పరిశ్రమ విషయంలో హైకోర్టుకు కేంద్రం సమర్పించిన అఫిడవిట్‌ను నిరసిస్తూ స్టీల్‌ ప్లాంట్‌ పరిరక్షణ పోరాట సమితి ఉద్యమించింది. పెద్ద సంఖ్యలో పరిపాలన భవనం వద్దకు చేరుకున్న కార్మికులు కేంద్ర ప్రభుత్వానికి, అఫిడవిట్‌కు వ్యతిరేకంగా ధర్నా చేసి పెద్దపెట్టున నినాదాలు చేశారు. కార్మికుల ఆందోళనలతో ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్‌ నిలిచిపోయింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ నూరు శాతం వ్యూహాత్మక అమ్మకానికి వ్యతిరేకంగా మాజీ ఐపీఎస్‌ అధికారి జేడీ లక్ష్మీనారాయణ రాష్ట్ర హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాన్ని వేసిన సందర్భంలో కేంద్ర ప్రభుత్వం తన అఫిడవిట్లో అసంబద్ధమైన ప్రకటన చేసిందనీ, వాటిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. కేంద్రం శాంతియుతంగా నిరసన తెలుపుతున్న స్టీల్‌ కార్మిక వర్గాన్ని రెచ్చగొట్టే విధంగా చర్యలు చేపడుతోందని విమర్శించారు. తమ హక్కులను హరించే విధంగా కేంద్రం నిర్ణయం తీసుకుంటే వాటిని కాపాడుకునే దిశగా ప్రతిఘటిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు జె.అయోధ్య రామ్‌, మంత్రి రాజశేఖర్‌, డి ఆదినారాయణ, వై టి దాస్‌, గంధం వెంకట్రావు, కె. సత్యనారాయణ రావు, మురళి రాజు, వై మస్తానప్ప, గణపతి రెడ్డి, డీవీ రమణారెడ్డి, కరణం సత్యారావు, డి.సురేష్‌ బాబు, వరసాల శ్రీనివాస్‌, పరంధామయ్య, కొమ్మినేని శ్రీనివాస్‌, మహాలక్ష్మి నాయుడు, డేవిడ్‌, రాంకుమార్‌ తో పాటు వివిధ విభాగాల అధ్యక్ష కార్యదర్శులు, స్టీల్‌ నిర్వాసిత నాయకులు ,అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img