Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

కేజ్రీవాల్‌పై పరువునష్టం కేసు పెడతా

పంజాబ్‌ సీఎం చన్నీ
చండీగఢ్‌ : పంజాబ్‌లో కాంగ్రెస్‌ నాయకుడి మేనల్లుడి నివాసంతో సహా అనేక చోట్ల ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) సోదాలు నిర్వహించడంతో తనను నిజాయితీ లేని వ్యక్తిగా అభివర్ణించిన ఆప్‌ నేత అరవింద్‌ కేజ్రీవాల్‌పై పరువు నష్టం కేసు నమోదు చేస్తానని పంజాబ్‌ ముఖ్యమంత్రి చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ శుక్రవారం తెలిపారు. ఇతరుల ప్రతిష్ఠను కించపరిచేలా ఆరోపణలు చేయడం కేజ్రీవాల్‌కు అలవాటని, గతంలో ఆయన బీజేపీ నేతలు నితిన్‌ గడ్కరీ, దివంగత అరుణ్‌ జైట్లీ, ఎస్‌ఏడీ నేత బిక్రమ్‌సింగ్‌ మజిథియాలకు క్షమాపణలు చెప్పాల్సి వచ్చిందని చన్నీ ఆరోపించారు. తన నియోజకవర్గం చమ్‌కౌర్‌ సాహిబ్‌లో విలేకరులతో మాట్లాడుతూ కేజ్రీవాల్‌ ఇప్పుడు అన్ని హద్దులు దాటిపోయారని అన్నారు. ఆప్‌ నాయకుడిపై పరువు నష్టం కేసు దాఖలు చేయడానికి అనుమతి ఇవ్వాలని ఆయన తన పార్టీని అభ్యర్థించారు. ‘నేను కేజ్రీవాల్‌పై పరువు నష్టం కేసు వేస్తాను. అందుకు అనుమతి ఇవ్వాలని నా పార్టీని అభ్యర్థించాను. నేను దీన్ని చేయవలసి వచ్చింది. అతను నన్ను నిజాయితీ లేనివాడిగా ప్రచారం చేస్తున్నాడు. అతను దానిని తన ట్విట్టర్‌లో ఉంచాడు’ అని చన్నీ తెలిపారు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ దాడుల నేపథ్యంలో ప్రతిపక్షాలు, ముఖ్యంగా ఆప్‌… చన్నీ, కాంగ్రెస్‌పై ఆరోపణలు చేశాయి. అంతకుముందు రోజు, కేజ్రీవాల్‌ వచ్చే నెలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో చమ్‌కౌర్‌ సాహిబ్‌ స్థానం నుంచి చన్నీ ఓడిపోతారని చెప్పారు. అదే సమయంలో చన్నీ మేనల్లుడు ఇంటి నుంచి కోట్లాది రూపాయలు స్వాధీనం చేసుకోవడం చూసి ప్రజలు దిగ్భ్రాంతికి గురయ్యారని అన్నారు. దీనిపై వ్యాఖ్యానించాల్సిందిగా కోరగా చన్నీ బదులిస్తూ, ‘ఇప్పుడు ఏం జరిగింది. డబ్బు ఎవరిదగ్గర వచ్చింది. వేరొకరిపై దాడులు చేస్తున్నారు. కానీ అతను (కేజ్రీవాల్‌) నోట్ల కట్టలను (సోదాల సమయంలో స్వాధీనం చేసుకున్న ఫోటోలు) పెట్టి, సోషల్‌ మీడియాలో నా ఫోటోతో నన్ను నిజాయితీ లేని వ్యక్తిగా అభివర్ణిస్తున్నారు’ అని తెలిపారు. ‘సోషల్‌ మీడియా ఖాతాల్లో నా ఫోటోలతో కూడిన నోట్ల కట్టల ఫోటోలు ఎందుకు. నాకు ఏ డబ్బు వచ్చింది. ఇందులో నా తప్పేంటి?. నన్ను ఇందులోకి ఎందుకు లాగుతున్నారు? వేరొకరి దగ్గర కొంత డబ్బు స్వాధీనం… పంజాబ్‌లో పది చోట్ల దాడులు జరిగాయి. మీరు దీనితో నన్ను ఎందుకు ముడిపెడుతున్నారు. ఈడీ నా ఇంటిలో సోదాలు జరిపి డబ్బు స్వాధీనం చేసుకుని ఉంటే, నన్ను అరెస్టు చేసి, నన్ను ప్రశ్నించాలి’ అని అన్నారు. ఇసుక అక్రమ తవ్వకాలపై మనీలాండరింగ్‌ నిరోధక విచారణకు సంబంధించి జరిపిన దాడుల్లో చన్నీ బంధువు నుంచి సుమారు రూ.8 కోట్లతో సహా రూ.10 కోట్లకు పైగా నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ బుధవారం వెల్లడిరచింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img