Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

కేరళలో సీఏఏ అమలు కాదు..


భారత్‌కు లౌకికవాద సిద్ధాంతాలే ఆధారం : సీఎం పినరయి విజయన్‌

తిరువనంతపురం : కేరళలో పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), 2019ను అమలు చేసే ప్రసక్తే లేదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ తేల్చిచెప్పారు. మతాధారిత పౌరసత్వానికి తమ రాష్ట్రం ఎంత మాత్రం అనుకూలం కాదని స్పష్టంచేశారు. లౌకికవాద వినాశానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని దుయ్యబట్టారు. ఎల్డీఎఫ్‌ ప్రభుత్వం రెండవసారి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి అయిన సందర్భంగా తిరవనంతపురంలో నిర్వహించిన కార్యక్రమంలో పినరయి విజయన్‌ మాట్లాడారు. సీఏఏ అమలుపై స్పష్టమైన వైఖరితో ఉన్నామని, దానిని అమలు చేయబోమని పునరుద్ఘాటించారు. 2020లోనూ సీఏఏను సుప్రీంకోర్టులో విజయన్‌ ప్రభుత్వం సవాల్‌ చేసింది. అధికరణలు 14 (సమానత్వ హక్కు), 21 (జీవిక హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛ), 24 (మతస్వేచ్ఛ)కు విరుద్ధంగా ఈ చట్టం ఉందని బలంగా వాదించింది. భారత్‌ లౌకికతత్వం/లౌకికవాద సిద్ధాంతానికి అనుగుణంగా పనిచేస్తుందని, ఈ మధ్యకాలంలో లౌకికవాదానికి తూట్లు పొడిచే ప్రయత్నాలు ముమ్మరమయ్యాయని విజయన్‌ వ్యాఖ్యానించారు. ప్రజల్లో మతపరమైన ఉద్రిక్తతను రెచ్చగొట్టే విధంగా దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో అనేక సర్వేలు నిర్వహిస్తున్నారని జ్ఞానవాపి మసీదులో వీడియో సర్వేనుద్దేశించి అన్నారు. జ్ఞానవాపి తర్వాత మధురాలోని షాహీ దర్గా మసీదులోనూ వీడియో సర్వే కోసం డిమాండు తెరపైకి రావడాన్ని గుర్తుచేశారు. తాము సమాజంలోని వెనుకబడిన వర్గాలకు చెందిన కుటుంబాలను గుర్తించేందుకు సర్వే నిర్వహించామని, ఆ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని విజయన్‌ అన్నారు. సీఏఏ చట్టానికి 2019లో పార్లమెంటు ఆమోదం లభించింది. ఈ చట్టం ప్రకారం హిందువులు, సిక్కులు, క్రైస్తవులు, జైనులు, బౌద్ధులు, పార్సీలు ఒక్క ముస్లింలు మినహా ఇతర దేశాల్లో ఉండే మైనారిటీలకు భారత పౌరసత్వం లభిస్తుంది. ఇందుకోసం కటాఫ్‌ తేదీని 2014, డిసెంబరు 31గా నిర్ణయించారు. కాగా కేరళతో పాటు పంజాబ్‌, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాలు దీనిని వ్యతిరేకించాయి. తమ రాష్ట్రాల్లో దీనిని అమలు చేసేది లేదని మొదట్లోనే తేల్చిచెప్పాయి. అయితే ఈ నెలారంభంలో బెంగాల్‌లో పర్యటించిన హోంమంత్రి అమిత్‌షా ఆ రాష్ట్రంలో సీఏఏ అమలు కానున్నట్లు తెలిపారు. టీఎంసీ ప్రభుత్వం అబద్ధం చెప్పిందని, కోవిడ్‌ మహమ్మారి అంతమైన తర్వాత బెంగాల్‌లో సీఏఏ అమలు అవుతుందని సిలిగురి సమావేశంలో అమిత్‌షా ప్రకటించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img