Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

కొత్త జిల్లాలపై కసరత్తు

ప్రాథమిక అభ్యంతరాలపై పరిశీలన
ముందే సమీక్షలకు దిగిన అధికారులు
మార్చి 10లోగా ఉద్యోగుల విభజన: విజయ్‌కుమార్‌

విశాలాంధ్ర బ్యూరో`అమరావతి: కొత్త జిల్లాలపై ప్రభుత్వం అప్పుడే కసరత్తు ప్రారంభించింది. గడువు తేదీ కంటే ముందే అభ్యంతరాల స్వీకరణపై దృష్టి సారించింది. ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాల పునర్విభజనపై ఏపీ ప్రణాళిక విభాగం కార్యాలయంలో ప్రాథమిక స్థాయిలో పరిశీలన ప్రక్రియను బుధవారం నిర్వహించారు. ఏపీ ప్రణాళిక విభాగం సీఈవో అధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరి, ప్రకాశంజిల్లాల కలెక్టర్లు, జెడ్పీ సీఈవోలు, ఇతర ఉన్నతాధికారులు, సర్వే సెటిల్‌మెంట్‌ కమిషనర్‌ సిద్ధార్థ జైన్‌ హాజరయ్యారు. జిల్లాల పునర్విభజన అంశాలపై కలెక్టర్ల నుంచి సూచనలు, సలహాలతోపాటు ఇప్పటివరకు ప్రాథమిక స్థాయిలో వచ్చిన అభ్యంతరాలపై చర్చించారు. దీంతో జిల్లాల విభజన మరింత వేగవంతం కానుంది. అటు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల విభజనపై చాలా ఉద్యమాలు కొనసాగుతున్నాయి. అశాస్త్రీయంగా చాలా జిల్లాలను విభజించారని, కొన్నింటికి పేర్లు పెట్టాలంటూ అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. మార్చి 3వరకు అభ్యంతరాల స్వీకరణకు ప్రభుత్వం గడువు ఇచ్చినప్పటికీ, అంతకంటే ముందే సమీక్షలు నిర్వహించడంపై సర్వత్రా విమర్శలున్నాయి. ఎట్టకేలకు ప్రభుత్వం అనుకున్న సమయానికి జిల్లాల ప్రక్రియను పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందడుగు వేస్తోంది. సమీక్షలో విజయ్‌కుమార్‌ మాట్లాడుతూ, ఉద్యోగుల విభజన, నూతన జిల్లాల్లో మౌలిక సదుపాయాల కల్పనపై మార్చి 10లోగా కసరత్తు పూర్తి చేస్తామన్నారు. జిల్లాల పునర్‌వ్యవస్థీకరణలో ఇప్పటికే డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌ ఇచ్చామని, అభ్యంతరాలు, సూచనలు ఇచ్చేందుకు నెల సమయం ఇచ్చామని గుర్తుచేశారు. ప్రాథమిక స్థాయిలో జిల్లాల వారీగా వచ్చిన అభ్యంతరాలను పరిశీలిస్తున్నామన్నారు. మార్చి 10న నివేదికతో పాటు ఫైనల్‌ నోటిఫికేషన్‌ ఇస్తామని, ఏప్రిల్‌ 2 నాటికి కొత్త జిల్లాల ఏర్పాటు, కార్యకలాపాలు ప్రారంభమవుతాయని స్పష్టం చేశారు. ఉద్యోగులు, వనరుల విభజనపైనా అధ్యయనం జరుగుతోందని, రాష్ట్రపతి ఉత్తర్వులు వచ్చాక ఉద్యోగులు, జోనల్‌ విభజన ఉంటుందన్నారు. ప్రస్తుతం ఎక్కడా అసెంబ్లీ నియోజకవర్గాల విభజన చేయడం లేదన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img