Friday, April 19, 2024
Friday, April 19, 2024

కోడి కత్తి కొట్టాట – చేతులు మారిన కోట్లు

సంప్రదాయ క్రీడలకు సమాధి

. పోలీస్‌ పవర్‌కు బ్రేక్‌
. రెచ్చిపోయిన ప్రజాప్రతినిధులు
. చోద్యం చూస్తున్న ప్రభుత్వం
. నెత్తురోడిన బరులు
. కోట్ల్లు నొక్కేసిన నిర్వాహకులు
. నెత్తిన చెంగేసుకున్న కష్టజీవులు
. రక్తచరిత్రపై జంతుప్రేమికుల ధ్వజం

విశాలాంధ్రడిజిటల్‌: న్యాయదేవత కళ్లకు గంతలు కట్టారు... సంప్రదాయ కోడిపందేలకు సమాధి కట్టారు... పోలీసు పవర్‌కు పాతరేశారు... బొబ్బిలి పుంజును మించి కట్టలు తెగిన కోపంతో అధికారులపై అధికార పార్టీ నాయకులు నోరుజారి కత్తులు కట్టించి మరీ బరుల్లో కోడిపందేలకు తెరతీశారు. అడ్డొచ్చిన రక్షకభటులపై చిందులేశారు... ఆనక అంతు చూస్తామన్నారు... తమ అధికారం ముందు న్యాయస్థానం ఆదేశాలు దిగదుడుపేనని పాలకులు నిరూపించారు. అనాదిగా సంస్కృతి, సంప్రదా యాలకు నెలవైన సంక్రాంతి సంబరాలను కొత్తపుంతలు తొక్కిస్తూ రక్త చరిత్ర సృష్టిస్తున్నారు. సంప్రదాయాల ముసుగులో జూదాలు, గుండాటలకు దన్నుగా నిలుస్తూ పేదల కష్టార్జితాన్ని తన్నుకుపోతున్నారు. రాజకీయ అండతో ఒక్కో బరిని లక్షలాది రూపాయలకు తమ గుప్పెట్లో పెట్టుకున్న నిర్వాహకులు బహిరంగ దోపిడీకి పాల్పడుతున్నారు. కత్తియుద్ధం చేస్తూ ఓ వైపు ‘పుంజు’ రాజాలు నేలకొరుగుతుంటే మరోవైపు బరిలో ఏరులై పారుతున్న రక్తాన్ని చూస్తూ పందెం రాయుళ్లు కేరింతలు కొడుతు న్నారు. డాక్టర్‌ బీఆర్‌ అంబే ద్కర్‌ కోనసీమ జిల్లా రావుల పాలెం మండలంలో విధుల్లో భాగంగా గుండాటను అడ్డుకునేందుకు తన సిబ్బందితో వెళ్లిన ఎస్సైపై ప్రభుత్వ విప్‌, కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఆగ్రహంతో విరుచుకుపడటం ఓ మచ్చుతునక. ప్రభుత్వాలు ఏవైనా... కోడిపందేలకు పెట్టింది పేరైన ఆంధ్రప్రదేశ్‌లోని ఉభయ గోదావరి జిల్లాల్లో నాయకుల ఒత్తిళ్లకు అధికార యంత్రాంగం తలవంచాల్సిందే. నిబంధనలకు లోబడి నిజాయతీ అధికారులు ఎవరైనా హెచ్చరికచేస్తే... గోడకు కొట్టిన బంతిలా ‘బరి’కి తగిలి వెనక్కి వెళ్లాల్సిందే. బతుకుదెరువు కోసం కొలువులో చేరాం... బరుల జోలు మనకెందుకులే అన్నంతగా వారికున్న అధికారాన్ని ప్రభుత్వం తగ్గించేస్తోంది. దీంతో చోటామోటా నేతల నుంచి మంత్రిస్థాయి నాయకుడి వరకూ రెచ్చిపోతున్నారు. మకర సంక్రాంతినాడే రూ.100 కోట్ల పైబడి చేతులు మారాయంటే జూద క్రీడ ఏ స్థాయిలో దూసుకుపోతోందో నిరక్షరాస్యుడికి సైతం ఇట్టే అర్థమవుతోంది. మూడు రోజుల్లో సుమారు వందలాది కోట్లకు పైగా దోపిడీ వ్యాపారం జరిగినట్టు సమాచారం. బరుల వద్ద పెద్ద పెద్ద ఎల్‌ఈడీ స్క్రీన్‌లు ఏర్పాటు చేసి, ఫ్లడ్‌ లైట్ల విద్యుత్‌ కాంతుల నడుమ పగలూ, రాత్రి అన్న తేడా లేకుండా పందేలు నిర్వహిస్తుండటంతో రూ.లక్షల్లో కోళ్లపై పందేలు కడుతూ కొందరు కుబేరులవుతుండగా, మరికొందరు నెత్తిన చెంగేసుకొని తేలుకుట్టిన దొంగల్లా పోతున్నారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. మందు, విందు, లోనబైట, గుండాట, చిత్తులాట, పేకాట, పెద్దబజార్‌`చిన్నబజార్‌, లక్కీ డ్రా ఇలా… నిషిద్ధ క్రీడలను ప్రోత్సహిస్తూ కోట్లాది రూపాయలు కొల్లగొడుతున్నారని చెబుతున్నారు. కౌంటర్‌ ఒక్కింటికి రూ.రెండు వేల టేబుల్‌, ఐదు వేల టేబుల్‌ అని పిలిచి మరీ జేబులు ఖాళీ చేస్తున్నారని చెప్పారు. సరదా కోసం వెళ్లిన కష్టజీవులు… జూదగాళ్ల మాయమాటలకు చిక్కి ఉన్నదంతా పోగొట్టుకొని చేతిలో చిల్లి గవ్వ లేకుండా నడకతో ఇంటిదారి పడుతున్నారని తెలిసింది. యేటా మాదిరిగానే ఈ ఏడాదీ తెలంగాణ నుంచి పందెంరాయుళ్లు ఆంధ్రాకు క్యూ కట్టడంతో బరులన్నీ ఉభయ కృష్ణా జిల్లాతో పాటు కోనసీమ జిల్లాలన్నీ మూడు పుంజులు ఆరు పందేలన్నట్టుగా కిటకిటలాడాయి. పందేల ప్రాంగణంలోకి ఎవరైనా ఉత్సాహవంతులు అడుగిడాలంటే రూ.20, కోడి బరిలోకి వెళ్లాలంటే రూ.100, కోడిని తీసుకెళ్లాలంటే రూ.500 ఇలా ప్రవేశ రుసుం వసూలు చేస్తూ పెద్దఎత్తున దోచుకుంటున్నారన్న ఆరోపణలు హల్‌చల్‌ చేస్తున్నాయి. సంప్రదాయ ముసుగులో పెద్దపెద్ద రాజకీయనేతలు… తమకు అనుచరులుగా ఉంటూనే విపక్ష పార్టీలో చేరిన తమ అనుంగులతో వెనకుండి బరులు నిర్వహిస్తున్నారన్న విమర్శలు జోరందుకున్నాయి. తనకు అన్యాయం జరిగిందని ఎవరైనా గొంతెత్తితే అణచివేసేందుకు ప్రైవేట్‌ సెక్యూరిటీగా బౌన్సర్లను నియమించుకున్నారంటే…దోపిడీ ఏ విధంగా చేస్తున్నారో ఇట్టే అర్థమవుతోంది. ఇదిలా ఉండగా, సంప్రదాయాల ముసుగులో ప్రభుత్వం తెరచాటున ఉండి ఇదంతా నడిపిస్తోందని జంతుప్రేమికులు అంటున్నారు. కోడిపుంజులకు కత్తులు కట్టకుండా సంప్రదాయబద్ధమైన విడిగాళ్ల పందెం వేస్తే జీవహింస ఉండదనీ, న్యాయస్థానం ఆదేశాలకు ముసుగేసి నిర్వాహకులకు వెన్నుదన్నుగా నిలుస్తున్న ప్రజాప్రతినిధులు ఇదంతా చేస్తున్నది తమ సొంత లాభం కోసమేనని ధ్వజమెత్తారు. ఓట్ల కోసం ప్రజలను మచ్చిక చేసుకోవడానికి రక్త చరిత్ర రాస్తున్నారని మండిపడ్డారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img