Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

‘కోడ్‌’ ఖూనీ !

. పథకాలతో ఓటర్లకు ఎర
. రూ.కోట్లతో ప్రచారం
. ప్రజాధనం దుర్వినియోగం
. వైసీపీ అభ్యర్థులకు అధికారుల ప్రచారం

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార వైసీపీ అడుగడుగునా ఉల్లంఘనలకు పాల్పడుతోంది. వైసీపీ అభ్యర్థుల విజయం కోసం అధికార యంత్రాంగాన్ని ఉపయోగించుకోవడమే కాకుండా ఓటర్లను ఆకర్షించడానికి నిస్సిగ్గుగా కానుకలు పంచిపెడుతోంది. ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ అడ్డదారులు తొక్కుతోంది. ఎన్నికల ప్రవర్తనా నియామవళి(కోడ్‌)ని ఉల్లంఘిస్తూ ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తోంది. ఈనెల 9వ తేదీ నుంచి మార్చి 13 వరకు ఎన్నికల కోడ్‌ అమలులో ఉంటుంది. కోడ్‌కు విరుద్ధంగా వివిధ పథకాల పేరుతో ఓటర్లను రాష్ట్ర ప్రభుత్వం ప్రలోభాలకు గురిచేస్తోంది. సంక్షేమం పేరిట వైఎస్‌ఆర్‌ లా నేస్తం అందించింది. సిటిజన్‌ అవుట్‌ రీచ్‌ ప్రోగ్రాం నిర్వహణకు సిద్ధమైంది. ప్రతిష్ఠాత్మకంగా, హుందాగా కొనసాగే ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు…జగన్‌ హయాంలో పూర్తిగా రాజకీయ రంగు పులుముకున్నాయి. గత ప్రభుత్వాలు, సీఎంలు ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై ఆసక్తి చూపేవారు కాదు. అవి రాజకీయాలకు అతీతంగా జరిగేవి. పట్టభద్రులు, ఎమ్మెల్సీ ఎన్నికలకు ఉపాధ్యాయులు, విద్యావంతులు, యువజనులు, ప్రజా ఉద్యమకారులు పోటీ చేసేశారు. ఈ ఎన్నికల్లో వామపక్ష పార్టీల అభ్యర్థులే అత్యధికంగా ఎన్నికవుతూ వచ్చారు. జగన్‌ అధికారంలోకి వచ్చాక గత సంప్రదాయాలకు భిన్నంగా ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను సైతం రాజకీయం చేశారు.
గెలుపు కోసం వైసీపీ అడ్డదారులు
ఉపాధ్యాయ, ప్రజాఉద్యమాల్లో భాగస్వామ్యం లేని వైసీపీ నేతలను ఎన్నికల బరిలో దించారు. వారి గెలుపు బాధ్యతలను ఎక్కడికక్కడ వైసీపీ ముఖ్యనేతలకు అప్పగించారు. అనుకూలమైన అధికారులను ఆయా ప్రాంతాలకు బదిలీ చేశారు. ఇది తీవ్ర వివాదాస్పదంగా మారింది. ఏపీఎస్‌ఈఆర్‌టీ సంచాలకులుగా ఉన్న ప్రతాప్‌రెడ్డిని ఎమ్మెల్సీ ఎన్నికల ముందు హడావుడిగా కడప ఆర్జేడీ(పాఠశాల విద్య)గా ప్రభుత్వం బదిలీ చేసింది. ప్రభుత్వ కనుసన్నల్లో ఆయన వైసీపీ అనుకూల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి రామచంద్రారెడ్డి గెలుపు కోసం బహిరంగంగా సభలు, సమావేశాలు, సదస్సులు నిర్వహిస్తున్నారు. ఆంధ్రా విశ్వవిద్యాలయం ఉపకులపతి(వీసీ) పీవీజీడీ ప్రసాద్‌రెడ్డి సైతం అక్కడి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి విజయం కోసం ప్రచారం చేస్తున్నారు. విశాఖ దసఫలా హోటల్‌లో వైసీపీ ముఖ్యనేతలు ఏర్పాటు చేసిన సమావేశానికి వీసీ ప్రసాద్‌రెడ్డి తన హోదాను మరిచి హాజరవ్వడంపై విద్యార్థి, యువజన సంఘాలు తీవ్ర నిరసన తెలిపాయి. ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాల్లో అధికార పార్టీకి అనుకూలంగా దొంగ ఓటర్లను పెద్దఎత్తున చేర్చినట్లు ప్రచారముంది. దానిపైనా రాష్ట్ర, కేంద్ర ఎన్నికల కమిషనర్లకు ఫిర్యాదులు వెళ్లినా స్పందన లేదు. ప్రతాపరెడ్డి, ప్రసాదరెడ్డిపై చర్యలు తీసుకోవాలని గవర్నర్‌కు, ఎన్నికల కమిషన్‌కు ఉపాధ్యాయ సంఘాలు, ప్రతిపక్ష పార్టీలు ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యం.
పథకాలతో ఓటర్లకు ఎర
ఎమ్మెల్సీ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉండగా రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా ‘సిటిజన్‌ అవుట్‌ రీచ్‌ ప్రోగ్రాం’ నిర్వహణకు సచివాలయ శాఖ జిల్లా అధికారులకు ఆదేశాలిచ్చింది. ఇది పూర్తిగా ఎన్నికల కోడ్‌కు విరుద్ధం. జగన్‌ సర్కారు తన పథకాలపై విస్తృతంగా ప్రచారం చేస్తోంది. సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లతో కలిసి ఇంటింటికీ వెళ్లి సంక్షేమ పథకాల అమలుపై అభిప్రాయాలను సేకరించడం వివాదాస్పదంగా మారింది. గతంలో ఎమ్మెల్సీ ఓట్ల చేర్పింపులో వలంటీర్ల పాత్రపై విమర్శలు వచ్చాయి. ఎన్నికల కోడ్‌ సమయంలోనే రాష్ట్రవ్యాప్తంగా 2011 మంది జూనియర్‌ న్యాయవాదులకు లా నేస్తం పథకం కింద రూ.కోటి 55 వేలను వారి ఖాతాల్లో సీఎం జగన్‌ జమ చేశారు. ఈ పథకం ప్రచారం కోసం ఆర్భాటంగా మరో కోటి రూపాయలకుపైగా ప్రచారం చేయడంపై ప్రతిపక్షాలు విమర్శలు సంధించాయి. ఈ కార్యక్రమాల ద్వారా ఓటర్లను ప్రభావితం చేయడమేనని ప్రతిపక్షాలు ధ్వజమెత్తుతున్నాయి. ఇప్పటికైనా ఎన్నికల కమిషన్‌ జోక్యం చేసుకుని ఎమ్మెల్సీ ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరముంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img