Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

కోవిడ్‌యేతర టీకాల పంపిణీ పెరగాలి

ఆగ్నేయాసియా దేశాలకు డబ్ల్యూహెచ్‌ఓ సూచన

న్యూదిల్లీ : కోవిడ్‌ కాలంలో వైరస్‌ను కట్టడి చేసేందుకు సంబంధిత టీకాల పంపిణీపై దృష్టి పెట్టి మిగతా వ్యాధులను నిరోధించే వాక్సిన్‌ల పంపిణీని అశ్రద్ధ చేశారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) పేర్కొంది. ఇకపై కోవిడ్‌ టీకాలతో పాటు ఇతర వాక్సిన్‌ల పంపిణీ మహమ్మారి రాకముందు సాగినట్లుగానే ఉండాలని సూచించింది. ఇందుకోసం తగిన స్థాయిలో కసరత్తు జరగాలని హితవు పలికింది. ఏ పిల్లవాడు టీకా అందని కారణంగా ప్రాణాంతక వ్యాధి బారిన పడరాదని తాజా ప్రకటనలో వెల్లడిరచింది. కోవిడ్‌ మునుపటి స్థాయికి సాధారణ ఇమ్మ్యూనైజేషన్‌ రేటు చేరడం ముఖ్యమని నొక్కిచెప్పింది. ఈమేరకు చర్యలు తీసుకోవాలని ఆగ్నేయాసియా దేశాలకు పిలుపునిచ్చింది. ఇప్పటివరకు కోవిడ్‌ టీకాలు 300 కోట్లు (3 బిలియన్లు) ఈ ప్రాంతంలో అందజేయడం అభినందనీయమని పేర్కొంది. 2021 జనవరి నుంచి టీకాల పంపిణీ మొదలైందని గుర్తుచేసింది. కోవిడ్‌ వాక్సినేషన్‌తో పాటుగానే మిగతా టీకాల పంపిణీపైనా దృష్టిని కేంద్రీకరించాలని, ఏ చిన్నారి కూడా ప్రాణాలను కాపాడే టీకాకు దూరం కారాదని డబ్ల్యూహెచ్‌ఓ ఆగ్నేయాసియా ప్రాంతీయ డైరెక్టర్‌ డాక్టర్‌ పూనమ్‌ క్షేత్రపాల్‌ సింగ్‌ అన్నారు. కోవిడ్‌ వాక్సిన్‌లతో పాటు మిగతా టీకాల పంపిణీ గతస్థాయిలో జరగవచ్చు అని ఇప్పటికే అనేక దేశాలు రుజువు చేశాయని డబ్ల్యూహెచ్‌ఓ పేర్కొంది. బంగ్లదేశ్‌, మాల్దీవులు, శ్రీలంక, థాయిలాండ్‌ దేశాల్లో కోవిడ్‌ కాలంలోనూ డీటీపీ3 కవరేజి 95 శాతానికిపైగా ఉంది. 2020లో భూటాన్‌ కాస్త వెనుకబడినప్పటికీ 2021లో పుంజుకుందని, 97`98శాతం కవరేజిని నమోదు చేసింది. ఏడాది లోపు పిల్లలకు ఇచ్చే డీటీపీ 3 (డిఫ్తీరియా, టెటనస్‌, పెర్టూసిస్‌ మూడవ టీకా) పంపిణీని ఆధారంగా అంతర్జాతీయ టీకారేటును అంచనా వేయొచ్చు అని డబ్ల్యూహెచ్‌ఓ ప్రకటన పేర్కొంది. నేపాల్‌లో డీటీపీ3 టీకా పంపిణీ రేటు 2020లో 84శాతంగా ఉంటే 2021కి 91శాతానికి చేరింది. ఆరు దేశాలు కోవిడ్‌ వాక్సిన్‌లనూ సమర్థంగా అందించాయి అని వెల్లడిరచింది. భారత్‌లో కోవిడ్‌యేతర టీకాల పంపిణీ 2020లో తగ్గగా, 2021లో కాస్త స్థిరంగా సాగినట్లు పేర్కొంది. 2021లో దాదాపు 200 కోట్లు (2 బిలియన్లు) కోవిడ్‌ టీకాలను భారత్‌ అందించిందని, ఇది 2020లో ప్రపంచ దేశాలు పంపిణీ చేసిన దానికంటే దాదాపు ఐదు రెట్లు అధికమని డబ్ల్యూహెచ్‌ఓ తెలిపింది. కోవిడ్‌తో పాటే మిగతా టీకాల పంపిణీ మునుపటి స్థాయిలో జరిగేలా ఆగ్నేయాసియా ప్రాంతంలో చర్యలు తీసుకోవడం ఎంతైనా అవసరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రధానంగా పేర్కొంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img