Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

కోవిడ్‌ మృతుల కుటుంబాలకు రూ.50వేల పరిహారం

సుప్రీం కోర్టుకు కేంద్రం వెల్లడి

న్యూదిల్లీ : కోవిడ్‌ బారిన పడి ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ.50వేలు చొప్పున నష్టపరిహారాన్ని అందించనున్నట్లు కేంద్రప్రభుత్వం బుధవారం సుప్రీంకోర్టుకు తెలిపింది. జాతీయ విపత్తు నిర్వహణ యంత్రాంగం (ఎన్డీఎంఏ) సూచనల మేరకు పరిహారాన్ని అందించనున్నట్లు వెల్లడిరచింది. కోవిడ్‌ సహాయక చర్యల్లో లేదా సంబంధిత కార్యక్రమాల్లో భాగస్వామ్యంపై చనిపోయిన వారి కుటుంబాలకూ ఎక్స్‌గ్రేషియా అందిస్తామని పేర్కొంది. ఐసీఎంఆర్‌, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మార్గదర్శకాల ప్రకారం మరణానికి కోవిడ్‌ కారణమని ధ్రువీకరణ ఉంటేనే పరిహారం ఇవ్వనున్నట్లు వెల్లడిరచింది. ఈ పరిహారాన్ని రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధి (ఎస్డీఆర్‌ఎఫ్‌) నుంచి రాష్ట్రాల ద్వారా అందించనున్నట్లు పేర్కొంది. ఇదే అంశమై జూన్‌ 30న విచారణ జరిగినప్పుడు కోవిడ్‌ మృతులకు పరిహారం అందించాలని, ఇందుకు సంబంధించి తాజా మార్గదర్శకాలను ఆరు వారాల్లోగా జారీ చేయాలని ఎన్డీఎంఏకు సర్వోన్నత న్యాయస్థానం సూచించింది. కోవిడ్‌ మరణ ధ్రువీకరణ పత్రాల జారీకి కొత్త మార్గదర్శకాలు రూపొందించడంలో కేంద్రప్రభుత్వం జాప్యం చేయడంపై సెప్టెంబరు ఆరంభంలో సుప్రీంకోర్టు అసహనం వ్యక్తంచేసింది. దీంతో వారం తర్వాత అఫిడవిట్‌ను కేంద్రం సమర్పించింది. తాజాగా కోవిడ్‌ మృతుల కుటుంబాలకు రూ.50వేలు పరిహారంగా ఇవ్వనున్నట్లు సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది. జాతీయ విపత్తు నిర్వహణ యంత్రాంగం సిఫార్సు మేరకే పరిహారం ఇవ్వనున్నట్లు పేర్కొంది. కరోనా మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల పరిహారం ఇవ్వలేమని గతంలో సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపిన విషయం విదితమే.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img