Thursday, April 18, 2024
Thursday, April 18, 2024

కోవిడ్‌ 3.0 సుదూరమే..

‘హైబ్రిడ్‌’ ఇమ్యూనిటీ, వాక్సినేషన్‌తోనే తగ్గిన కేసులు : నిపుణులు

న్యూదిల్లీ : యావత్‌ ప్రపంచాన్ని అల్లాడిస్తున్న కోవిడ్‌ మహమ్మారి ప్రస్తుతానికి భారత్‌లో నెమ్మదించింది. వైరస్‌ కేసులు తగ్గుముఖం పట్టడం శుభసూచికమని నిపుణులు అంటున్నారు. తద్వారా మూడవ దశ ముప్పు సుదూరమే అని, ప్రస్తుతానికి అలాంటి సంకేతాలు లేవని చెబుతున్నారు. అయితే అప్రమత్తంగా ఉండాల్సిందేనని, సమీప భవిష్యత్‌లో పరిస్థితులు మారే ఆస్కారం లేకపోలేదని హెచ్చరించారు. వాక్సినేషన్‌ జోరుగా సాగడానికి తోడు ప్రజల్లో హైబ్రిడ్‌ ఇమ్యూనిటీ ఉంటం వల్లనే కేసులు తగ్గాయన్నారు. రెండవ దశ వేళ చాలా మంది వైరస్‌ బారిన పడ్డారని, ఆపై వాక్సినేషన్‌ గతి పెరిగిందని అన్నారు. శీతాకాలంలో కొత్త వేరియంట్లు, వైరస్‌ల ప్రమాదం ఉందన్నారు. కోవిడ్‌ మూడవ దశ వచ్చినాగానీ అది రెండవదశ అంత విపత్కరంగా ఉండదని అంచనా వేశారు. డిసెంబరు ` ఫిబ్రవరిలో కేసులు పెరగవచ్చునని, శీతాకాలం కాబట్టి ముప్పు లేకపోలేదని చెప్పారు. రెండవ దశలో వేలాది మంది మృత్యువాత పడ్డారని, వేల మంది ఆసుపత్రుల పాలయ్యారని గుర్తుచేశారు. పండుగల సీజన్‌ కాబట్టి అక్టోబరు, నవంబరులోనే కోవిడ్‌ మూడవదశ సంభవించవచ్చు అని అంటువ్యాధుల నిపుణులు అంచనా వేయగా అదృష్టవశాత్తు అలాంటి పరిస్థితి రాలేదు. మంగళవారం దేశంలో 7,579 కొత్త కేసులు రాగా 543 రోజులు తర్వాత కేసుల్లో ఇంతలా తగ్గాయని, మొత్తం కేసుల సంఖ్య 3,45,26,480కి చేరిందని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. 536 రోజుల కనిష్టానికి క్రియాశీల కేసులు చేరినట్లు వెల్లడిరచింది. రెండవ దశలో కోవిడ్‌ బారిన పడి కోలుకోవడంతో అనేకమందిలో రోగనిరోధక శక్తి పెరిగిందన్నారు. వాక్సినేషన్‌ కూడా తీసుకోవడంతో మూడద దశ ముప్పు సుదూరమని చెప్పవచ్చు అని సోసిపట్‌ అశోక యూనివర్సిటీలో ఫిజిక్స్‌, బయాలజీ శాఖల ప్రొఫెసర్‌ గౌతం మీనన్‌ అన్నారు. వాక్సిన్‌ తీసుకోక ముందు కోవిడ్‌ బారిన పడి కోలుకున్న వారిలో హైబ్రిడ్‌ ఇమ్యూనిటీ ఉందని అధ్యయనాలలో వెల్లడి అయిందన్నారు. మీనన్‌ మాటలతో వైరాలజిస్ట్‌ అనురాజ్‌ అగర్వాల్‌ ఏకీభవించారు. జనాభాలో చాలా మంది రెండవ దశలో డెల్టా వేరియంట్‌ బారిన పడటం, కోలుకోవడం, వాక్సిన్‌ తీసుకోవడం వల్ల ఇమ్యూన్‌ బూస్టింగ్‌ జరిగిందని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇన్ఫెక్షన్‌ ముప్పు తగ్గినట్లు సిరో సర్వేలు చెబుతున్నాయని న్యూదిల్లీలోని సీఎస్‌ఐఆర్‌` ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ జినోమిక్స్‌, ఇంట్రగేట్రివ్‌ బయోలజీ డైరెక్టర్‌ అగర్వాల్‌ అన్నారు. దేశంలో కోవిడ్‌ కేసులు తగ్గడం శుభసూచికమని ఇమ్యూనాలజిస్ట్‌ వినీతా బాల్‌ చెప్పారు.
ఈశాన్య రాష్ట్రాలు ముఖ్యంగా మిజోరంలో కోవిడ్‌ కేసులు ఎక్కువగానే నమోదు అవుతున్నట్లు తెలిపారు. మిగతా దేశంతో పోల్చితే ఇక్కడ చాలా ఆలశ్యంగానే కేసులు వచ్చాయని, ఇలా వాక్సినేషన్‌, ఇమ్యూనైజేషన్‌ సరిగ్గా లేని ప్రాంతాల్లో వైరస్‌ విజృంభణకు ఆవకాశం లేకపోలేదని హెచ్చరించారు. ఆయా ప్రాంతాలు, వాక్సినేషన్‌ తదితరాల సూక్ష్మసమాచారం అందుబాటులో లేనందున అప్రమత్తత అవసరమని సూచించారు. నెల రోజులుగా యూరప్‌, ఉత్తర అమెరికాలో కోవిడ్‌ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. రెండేళ్లుగా యూరప్‌ తర్వాత కోవిడ్‌ పీడిత దేశంగా భారత్‌ ఉంది.
సమీప భవిష్యత్‌లో ముప్పు ఉంటే ఇప్పటికే సంకేతాలు వెలువడేవని మీనన్‌ అన్నారు. యూరప్‌లో మూడవ దశ సాదృశ్యమే భారత్‌లో రెండవ దశ అని చెన్నై ఐఎంఎస్‌సీ ప్రొఫెసర్‌ సీతాభ్రా సిన్హా అభిప్రాయపడ్డారు. సెప్టెంబరు మధ్యలోనే మూడవ దశ వచ్చి పోయిందన్నారు. సమీప భవిష్యత్‌లో మళ్లీ విజృంభిస్తుందా అంటే కచ్చితంగా చెప్పలేమని తెలిపారు. కోవిడ్‌ వచ్చినప్పటి నుంచే ఆర్‌ వాల్యూను సిన్హా సమీక్షిస్తున్నారు. ప్రస్తుతానికి మిజోరం, జమ్మూకశ్మీర్‌లో వెయ్యికిపైగా క్రియాశీల కేసులు ఉండగా ఆర్‌ వాల్యూ ఒకటి కంటే ఎక్కువగా ఉందన్నారు. పశ్చిమ బెంగాల్లోనూ ఇదే పరిస్థితి అని చెప్పారు. పట్టణ ప్రాంతాల్లో కేసులు గణనీయంగా తగ్గినప్పటికీ చలికాలంలో పరిస్థితి ఎలా ఉంటుందో అన్న ఆందోళన కలగుతోందని అన్నారు. జులైలో ఐసీఎంఆర్‌ చేపట్టిన నాల్గవ జాతీయ సిరో సర్వేలో దేశ జనాభాలో 67.6శాతం మందిలో కోవిడ్‌ యాంటీబాడీలు ఉన్నాయని తేలింది. వాక్సిన్‌కు అర్హులైన 82శాతం మంది మొదటి మోతాదును తీసుకోగా 43శాతం మంది రెండు టీకాలు పొందినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతానికి అంతా బాగానే ఉన్నాగానీ సమీప భవిష్యత్‌లో ఏం జరుగుతుందో చెప్పలేం. కొత్త వేరియంట్లు తదితర అంశాల ఆధారంగా పరిస్థితులు ఉంటాయి. నిర్లక్ష్యంగా వద్దు. తగిన జాగ్రత్తలు తీసుకోండి అని అగర్వాల్‌ హితవు పలికారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img