Friday, April 19, 2024
Friday, April 19, 2024

గట్టెక్కేదెలా ?

బొగ్గు కొరతతో పడిపోయిన విద్యుదుత్పత్తి
గణనీయంగా పెరుగుతున్న వినియోగం
కరెంట్‌ కష్టాలు అధిగమించేందుకు ప్రభుత్వం మల్లగుల్లాలు బ గ్రామాల్లో అనధికార కోతలు
పట్టణాల్లో వాడకం తగ్గించే యత్నాలు

విశాలాంధ్ర బ్యూరో` అమరావతి : కరెంట్‌ కష్టాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. బొగ్గు కొరతతో ఒకపక్క విద్యుత్‌ ఉత్పత్తి రోజురోజుకూ పడిపోతుండగా, మరోపక్క వినియోగం విపరీతంగా పెరుగుతోంది. దీనికితోడు మార్కెట్‌లో కొనుగోలు రేటు సైతం పెరగడంతో అసలే తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్ర ప్రభుత్వంపై మరింత భారం పడుతోంది. ఈ ఇబ్బందులను అధిగమించడానికి అధికార యంత్రాంగం మల్లగుల్లాలు పడుతోంది. బొగ్గు కొరత నివారణకు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి జగన్‌ లేఖ రాసిన విషయం తెల్సిందే. ఈ లేఖ రాసి మూడు రోజులు దాటినా కేంద్రం వైపు నుంచి బొగ్గు సరఫరా మెరుగునకు తీసుకున్న చర్యలేమీ లేవు. పైగా రాష్ట్రంలో విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాల వద్ద ఉన్న బొగ్గు నిల్వలు అయిపోతుం డడంతో ఉత్పత్తి పడిపోతోంది. దీంతో గ్రామాల్లో అనధికార కోతలు మొదలయ్యాయి. పట్టణాల్లో పీక్‌ సమయాల్లో సాయంత్రం 6 నుంచి 10 గంటల వరకు విద్యుత్‌ వినియోగం తగ్గించాలని విద్యుత్‌శాఖాధిóకారులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తు న్నారు. విద్యుత్‌పై ప్రభుత్వ విధానం మారడమే ఈ సంక్షోభానికి కారణంగా ఆ శాఖాధికారులు పేర్కొంటున్నారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో బొగ్గు కొనుగోళ్లలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలతో థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలను మూసివేసి, పవర్‌ ఎక్ఛేంజిలో బహిరంగ మార్కెట్లో కొనుగోలుచేసే విధానాన్ని వైసీపీ ప్రభుత్వం చేపట్టింది. విజయవాడ నార్ల తాతారావు థర్మల్‌ పవర్‌ స్టేషన్‌లో 1,760 మెగా వాట్ల విద్యుత్‌ ఉత్పత్తి మినహా కడప ఆర్టీపీపీలో 1,650 మెగావాట్లు, కృష్ణపట్నం దామోదరం సంజీవయ్య థర్మల్‌ విద్యుత్‌ కేంద్రంలో 1,600 మెగావాట్ల ఉత్పత్తిని నిలిపివేసి, రోజువారీగా బహిరంగ మార్కెట్లో కొనుగోలు చేసే విధానాన్ని ఇంధనశాఖ అవలంబించింది. దీంతో బొగ్గు అవసరం పెద్దగా లేకుండా పోయింది. ఎన్టీటీపీ ఎస్‌ మినహా మిగిలిన కేంద్రాలను మూసివేసినా సిబ్బందికి జీతభత్యాలు, ఇతర నిర్వహణ వ్యయాలు మాత్రమే యధావిథిగా భరిస్తూనే బహిరంగ మార్కెట్లో విద్యుత్‌ కొనుగోలు చేస్తోంది. దీనివల్ల ఏపీ జెన్‌కోపై ఆర్థిక భారం పెరుగుతూ వచ్చింది. ఈ పరిస్థితుల్లో ఆర్‌టీపీపీ, కృష్ణపట్నం థర్మల్‌ కేంద్రాల్లో ఉత్పత్తిని ప్రారంభించాలంటూ రెండున్నర నెలల క్రితం ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. భారీవర్షాల కారణంగా మహానది కోల్‌ ఫీల్డ్స్‌లో, సింగరేణిలో తవ్వకాలు నిలిచిపోవడంతో బొగ్గు కొరత ఏర్పడిరది. మరోపక్క కరోనా, వాతావరణంలో నెలకొన్న మార్పులతో గత రెండు నెలల నుంచి గృహ విద్యుత్తు వినియోగం భారీగా పెరిగింది. ఈ డిమాండ్‌ను తట్టుకోవడానికి థర్మల్‌ విద్యుత్తుపై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇదేసమయంలో దేశవ్యాప్తంగా బొగ్గు సంక్షోభం నెలకొనడంతో తగినంత సరఫరా లేక విద్యుత్‌ ఉత్పత్తికి, వినియోగానికి మధ్య భారీ వ్యత్యాసం ఏర్పడిరది. దీంతో బహిరంగ మార్కెట్లో విద్యుత్‌ కొనాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడిరది. దానికి కూడా డిమాండ్‌ పెరగడంతో యూనిట్‌కు రూ.15కు, పీక్‌ అవర్స్‌లో సాయంత్రం 6-10 గంటల వరకూ రూ.20 చొప్పున కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఈ భారం మొత్తం జెన్‌కోపై పడుతోంది. గతంలో విదేశీ బొగ్గు కొనుగోళ్లలో అవినీతి జరిగిందంటూ వైసీపీ ఆరోపణలు చేయడంతో సింగపూర్‌, ఇండోనేషియా వంటి దేశాల నుంచి బొగ్గు కొనుగోలు చేయడాన్ని ఏపీ జెన్‌కో ఆపేసింది. ఇప్పుడు విదేశాల్లోనూ బొగ్గు తవ్వకాలు ఆగిపోవడంతో ఏపీ జెన్‌కో విద్యుదుత్పత్తి చేయలేకపోతోంది. రాష్ట్రంలో జెన్‌కో థర్మల్‌ ప్లాంట్లకు రోజుకు 70 వేల టన్నుల బొగ్గు అవసరం. ప్రస్తుతం సింగరేణి, మహానది కోల్‌ ఫీల్డ్స్‌ నుంచి రోజుకు 40 వేల టన్నుల వరకు అందుతోంది. రాష్ట్రంలో సాధారణంగా రోజువారీ విద్యుత్‌ డిమాండ్‌ను తట్టుకోవడానికి 8500 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేయాల్సి ఉంటుంది. గత నెల కొద్దిరోజులుగా 10వేల పైచిలుకు మెగావాట్లకు డిమాండ్‌ పెరిగింది. ప్రస్తుతం వరితో పాటు మెట్ట పంటల సాగుకు రోజుకు కనీసం 20 మెగావాట్ల విద్యుత్‌ అవసరం. కృష్ణపట్నంలో 1,600 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం ఉండగా, 500 మెగావాట్లు మాత్రమే వస్తోంది. కడప ఆర్టీపీపీ యూనిట్‌కి 1,650 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం ఉండగా, బొగ్గు కొరతతో మూడు యూనిట్ల ఉత్పత్తి నిలిపివేశారు. దీంతో 536 మెగావాట్లు మాత్రమే ఉత్పత్తి అవుతోంది. విజయవాడలోని వీటీపీఎస్‌లోని ఏడు యూనిట్ల నుంచి 1,760 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం ఉంటే 1,100 మెగావాట్లు ఉత్పత్తి అవుతోంది. ఆర్టీపీపీలో ఉన్న నిల్వలు మూడు రోజులకు, కృష్ణపట్నంలో ఐదు రోజులకు మాత్రమే సరిపోతాయి. ఏపీ ప్రభుత్వం రోజుకు 20 రేక్‌ల బొగ్గు కావాలని కోరుతున్నా కేంద్రం నుంచి ఆ స్థాయిలో సరఫరా కావటం లేదు. దీంతో ఈ సమస్యను అధిగమించడం ప్రభుత్వానికి సవాల్‌గా మారింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img