Friday, April 26, 2024
Friday, April 26, 2024

గుంటూరులో ఏఐటీయూసీ రాష్ట్ర మహాసభలు

విశాలాంధ్ర`గుంటూరు : అనేక రాష్ట్ర, జాతీయ మహాసభలకు అతిథ్యం ఇచ్చిన గుంటూరు నేడు ఏఐటీయూసీ రాష్ట్ర మహాసభలకు వేదిక కానున్నదని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఓబులేశు తెలిపారు. సీపీఐ, ఏఐటీయూసీ గుంటూరు జిల్లా స్థాయి విస్తృత సమావేశం ఇక్కడి మల్లయ్యలింగంభవన్‌లోని వీఎస్‌కే హాలులో మంగళవారం జరిగింది. ఏఐటీయూసీ రాష్ట్ర మహాసభలను గుంటూరులో నిర్వహించడానికి సమావేశం తీర్మానం చేసింది. సీపీఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్‌కుమార్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ సీపీఐ, ఏఐటీయూసీ నాయకులు, కార్యకర్తలు సమిష్ఠిగా మహాసభల విజయవంతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఓబులేశు మాట్లాడుతూ కార్మిక ఉద్యమాలకు పురిటిగడ్డ అయిన గుంటూరు జిల్లాలో జరిగే ఏఐటీయూసీ రాష్ట్ర మహాసభలు కార్మికుల్లో పోరాట ఉత్తేజాన్ని మరింత పెంపొందిస్తాయని ఆకాంక్షించారు. కార్మికులను కార్పొరేట్‌లకు బానిసలుగా చేసేందుకు పోరాటాలు, త్యాగాల ద్వారా సాధించుకున్న 44 చట్టాలను కేంద్రంలోని మోడి ప్రభుత్వం నాలుగు కోడ్‌లుగా తీసుకొచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ లేబర్‌ కోడ్‌లను రద్దు చేసేంత వరకు కేంద్ర ప్రభుత్వంపై కార్మికులు సంఘటితంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. ఇటువంటి తరుణంలో జరుగనున్న ఏఐటీయూసీ రాష్ట్ర మహాసభలు ఎంతో ప్రాధాన్యతను సంతరించుకున్నాయన్నారు. తొలుత ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి కాసా రాంబాబు వక్తలను వేదికపైకి ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు రావులపల్లి రవీంధ్రనాథ్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ వెలుగూరి రాధాకృష్ణమూర్తి, ముఠా వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు చల్లా చిన ఆంజనేయులు, సీపీఐ నగర కార్యదర్శి కోట మాల్యాద్రి, ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు మహంకాళి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img