Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

గుజరాత్‌లో ఘోర ప్రమాదం

గోడ కూలి 12 మంది కార్మికుల మృతి
మోర్బి జిల్లాలో ఘటన

మోర్బి : గుజరాత్‌కు చెందిన మోర్బి జిల్లాలో బుధవారం ఘోర ప్రమాదం సంభవించింది. హల్వద్‌ పారిశ్రామిక ప్రాంతంలోని సాగర్‌ సాల్ట్‌ ప్యాకింగ్‌ ఫ్యాక్టరీ గోడ కూలడంతో 12 మంది కార్మికులు మరణించినట్లు అధికారులు తెలిపారు. దాదాపు 30 మందికిపైగా కూలీలు శిథిలాల కింద చిక్కుకున్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రులకు తరలించారు. శిథిలాల కింద ఉన్న మృతదేహాలను జేసీబీ సహాయంతో బయటకు తీశారు. బస్తాల్లో ఉప్పు నింపే సమయంలో ఈ ప్రమాదం జరిగిందని జిల్లా కలెక్టర్‌ తెలిపారు. గోడ కూలిపోగానే 20 నుంచి 30 మంది కూలీలు ఈ శిథిలాల కింద చిక్కుకున్నారు. శిథిలాల కింద చిక్కుకుని 12 మంది మరణించగా మిగిలిన వారిని రక్షించినట్టుగా అధికారులు తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి బ్రిజేశ్‌ మెర్జా మాట్లాడుతూ ‘గోడ కూలిన ఘటనలో కనీసం 12 మంది కార్మికులు మరణించారు. శిథిలాల కింద చిక్కుకున్న ఇతరులను రక్షించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి’ అని తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని మెర్జా అన్నారు. ఉప్పు ఫ్యాక్టరీలో గోడ కూలి 12 మంది కార్మికులు మృతి చెందిన ఘటనపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలుపుతూ ట్వీట్‌ చేశారు. ఈ ఘటనలో మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేలు చొప్పున పరిహారం ప్రధాన మంత్రి జాతీయ ఉపశమన నిధి (పీఎంఎన్‌ఆర్‌ఎఫ్‌) నుంచి ఇవ్వనున్నట్లు ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంవో) ట్విట్టర్‌లో పేర్కొంది. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఈ దుర్ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ట్వీట్‌ చేశారు. గుజరాత్‌ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌కి ఫోన్‌ చేసి సహాయక చర్యల గురించి అడిగి తెలుసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి పటేల్‌ ఈ దుర్ఘటనలో మృతుల కుటుంబాలు ఒక్కొక్కరికి రూ.4 లక్షల చొప్పున పరిహారాన్ని ప్రకటించారని, సహాయక చర్యల గురించి జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించినట్లు సీఎం కార్యాలయం తెలిపింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img