Friday, April 19, 2024
Friday, April 19, 2024

గెజిట్‌ అమల్లో అనిశ్చితి

జల విద్యుత్‌ ప్రాజెక్టుల అప్పగింతకు
తెలంగాణ మోకాలడ్డు

నిర్వహణ చార్జీల కోసం రూ.200 కోట్లపై అభ్యంతరం
కేంద్రం జోక్యంతోనే సమస్యకు చెక్‌

విశాలాంధ్ర బ్యూరో` అమరావతి : కృష్ణా, గోదావరి నదీ ప్రాజెక్టుల నిర్వహణను కేఆర్‌ఎంబీ, జీఆర్‌ఎంబీ పరిధిలోకి తెస్తూ ఈనెల 14వ తేదీ నుంచి అమలు కావల్సిన కేంద్ర గెజిట్‌పై అనిశ్చితి నెలకొంది. కృష్ణా ప్రాజెక్టులపై కేఆర్‌ఎంబీ ప్రతిపాదించిన అంశాలపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరాలు చెప్పడం, వీటిపై రాష్ట్ర ప్రభుత్వం చర్చించి నిర్ణయం తీసుకునే వరకు జల విద్యుత్‌ ప్రాజెక్టులు అప్పగించబోమని తెలంగాణ జలవనరుల శాఖ స్పష్టం చేయడంతో కేఆర్‌ఎంబీ ప్రకటించినట్లుగా 14వ తేదీ నుంచి గెజిట్‌ అమలు సాధ్యమయ్యే పరిస్థితి కానరావడం లేదు. కృష్ణా జలాల వాటాలోనూ తెలంగాణ ప్రభుత్వం పేచీ పెడుతోంది. రెండు రాష్ట్రాలకు నీటిని సమానంగా పంచాలని, జల విద్యుత్‌ ఉత్పత్తికి ఆంక్షలు ఒప్పుకో బోమని, ఏపీలో అక్రమ ప్రాజెక్టులపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ డిమాండ్‌ చేస్తోంది. గెజిట్‌ అమలుకు ముందే ఇవన్నీ తేలాలని కోరుతోంది. దీంతో కేంద్రం చొరవ తీసుకుంటే తప్ప ఈ సమ స్యకు ఇప్పట్లో ముగింపు పడే అవకాశం కానరా వడం లేదు. మంగళవారం హైదరాబాద్‌ జల సౌధలో కృష్ణా నీటి యాజమాన్య బోర్డు చైర్మన్‌ ఎంపీ సింగ్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో రెండు రాష్ట్రాల జలవనరుల శాఖాధికారులు పాల్గొని తమ వాదనలు బలంగా వినిపించారు. శ్రీశైలం ప్రాజెక్టు పరిధిలోని 12 ప్రాజెక్టులు, నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు పరిధిలోని 18 ప్రాజెక్టుల పర్యవేక్షణ, నిర్వహణ బాధ్యతలను తమకు అప్పగించాలని కేఆర్‌ఎంబీ ప్రతిపాదించింది. ఈనెల 14నుంచి కేంద్ర గెజిట్‌ అమలు కానున్నందున ఈ తీర్మా నాన్ని ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ఆమోదించి ఉత్తర్వులు జారీ చేస్తే గానీ గెజిట్‌ అమల్లోకి రాదని కేఆర్‌ఎంబీ చైర్మన్‌ వెల్లడిరచారు. దీనిపై ఏపీ సానుకూలత వ్యక్తం చేయగా, తెలంగాణ జలవనరుల శాఖాధికారులు మాత్రం బోర్డు ప్రతి పాదించిన అనేక అంశాలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. కృష్ణా పరివాహక ప్రాంతం తెలంగాణలో ఎక్కువగా ఉన్నందున నీటి వాటా పెరగాలని, కనీసం ప్రస్తుతమున్న 299 టీఎంసీలకు అదనంగా మరో 105 టీఎంసీలు కేటాయించాలని, నెట్టెం పాడు, బీమా, కోయిల్‌సాగర్‌, కల్వకుర్తి ప్రాజెక్టు లకు వరద జలాలు మాత్రమే ఇస్తున్నారని, వీటికి నికర జలాలు కేటాయించాలని తెలంగాణ జలవన రుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజిత్‌కుమార్‌, ఈఎన్సీ మురళీధర్‌ డిమాండ్‌ చేశారు. జల విద్యుత్‌ ప్రాజెక్టులు బోర్డు పరిధిలో ఉండడం సమంజసం కాదని తేల్చి చెప్పారు. తెలంగాణలో ఎత్తిపోతలు, బోరుబావులపై వ్యవసాయసాగు ఆధారపడి ఉన్నందున ఎప్పుడుపడితే అప్పుడు అవసరానికను గుణంగా జలవిద్యుత్‌ ఉత్పత్తి చేయాల్సి ఉంటుందని తెలిపారు. అందువల్ల కచ్చితంగా విద్యుత్‌ ప్రాజెక్టుల నిర్వహణను అప్పగించబోమని, అవసరమైతే రిజర్వాయర్లలో నీటిమట్టంపై బోర్డు యోచన చేయాలని సూచించారు. ఏపీ నుంచి సమావేశానికి హాజరైన జల వనరులశాఖాధికారులు శ్యామలరావు, నారాయణరెడ్డి కూడా తెలంగాణ సమర్పించిన జాబితాపై అభ్యంతరాలు లేవనెత్తారు. గెజిట్‌లో చేర్చిన 29 ప్రాజెక్టుల అవుట్‌లెట్లను కాకుండా కేవలం 17 అవుట్‌లెట్లను మాత్రమే కేఆర్‌ఎంబీకి ఇవ్వడం, వాటిలో జల విద్యుత్‌ కేంద్రాలు లేకుండా జాబితా సమర్పించడంపై అభ్యంతరం తెలిపారు. విద్యుత్‌ కేంద్రాలు లేకుండా అప్పగించిన ప్రాజెక్టు పాయింట్ల వల్ల ప్రయోజనం ఏముందని నిలదీశారు. ఎట్టిపరిస్థితుల్లో జలవిద్యుత్‌ ప్రాజెక్టులు బోర్డు పరిధిలోకి రావాల్సిందేనని స్పష్టం చేశారు. కేవలం ప్రాజెక్టుల అవుట్‌లెట్లతోనే కేఆర్‌ఎంబీ ముందుకెళతానంటే తాము అంగీకరించబోమని కరాఖండిగా చెప్పారు. నిర్వహణ నిమిత్తం ఒక్కో బోర్డుకు రెండు రాష్ట్రాలు చెరో రూ.200 కోట్లు కేటాయించాలని చేసిన బోర్డు ప్రతిపాదనను రెండు రాష్ట్రాల అధికారులు ప్రశ్నించారు. ఇంత పెద్దమొత్తంలో దేనికి ఖర్చు అవుతుందని ప్రశ్నించారు. మొత్తానికి అనేక అంశాలపై ఏకాభిప్రాయం రాకపోవడం, పరిష్కారం కాని సమస్యలను తెలంగాణ లేవనెత్తడంతో గెజిట్‌ అమల్లో ప్రతిష్ఠంభన కొనసాగే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img