Friday, April 19, 2024
Friday, April 19, 2024

గోవా పర్యాటకంపై ‘ఒమిక్రాన్‌’ దెబ్బ?

పనాజీ : ప్రపంచ ప్రసిద్ధ క్రిస్మస్‌, కొత్త సంవత్సర వేడుకలు గోవాలో ఘనంగా జరుగుతాయి. కరోనా కొత్త ఉత్పరివర్తనం ‘ఒమిక్రాన్‌’ చూపే ప్రభావాన్ని రాష్ట్రంలోని పర్యాటక రంగం నిశితంగా గమనిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇటీవల దక్షిణాఫ్రికాలో బయటపడిన ఈ కొత్త ఉత్పరివర్తనం ఆందోళనకరమైనదిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. డిసెంబరు మధ్య నాటికి విదేశీ పర్యాటకులను తీసుకువచ్చే ఛార్టర్డ్‌ విమానాలు, అంతర్జాతీయ సర్వీసులు రావడం ప్రారంభిస్తాయని వివరించాయి. కోవిడ్‌19 మహమ్మారి తగ్గుముఖం పట్టిన తర్వాత దేశీయ పర్యాటకులకు ఈ తీర ప్రాంత రాష్ట్రం ప్రాధాన్యత గమ్యస్థానంగా మారింది. దీపావళి తర్వాత మరో ఫలవంతమైన సీజన్‌ను రాష్ట్ర పర్యాటక రంగం ఆశిస్తోంది. ‘మేము వేచి చూస్తున్నాం. ప్రస్తుతం ఇప్పటి వరకు ‘ఒమిక్రాన్‌’ ప్రభావం ఏమీ లేదు. కానీ వచ్చే 15 రోజులకు పైగా అన్ని పరిణామాలను మేము నిశితంగా పరిశీలిస్తాం. మహమ్మారి కేసులు పెరిగితే కోవిడ్‌ మార్గదర్శకాలను కఠినంగా పాటించాల్సి ఉంటుంది’ అని గోవా ట్రావెల్‌ అండ్‌ టూరిజం అసోసియేషన్‌ అధ్యక్షుడు నీలేశ్‌ షా తెలిపారు. గతంలో కేసుల సంఖ్య పెరగడానికి ముందస్తు జాగ్రత్తలు లేకపోవడమే ప్రధాన కారణమని, అయితే ప్రస్తుతం దేశంలో 70 శాతం మంది ప్రజలు కోవిడ్‌-19 టీకాను కనీసం ఒక డోస్‌ తీసుకున్నందున వ్యాప్తిని ఎదుర్కోవడానికి దేశం సంసిద్ధంగా ఉందని ఆయన అన్నారు. రాష్ట్రానికి వచ్చే ఛార్టర్డ్‌ విమానాల పరిస్థితిని షా వివరిస్తూ, ‘వీసాల జారీ ప్రక్రియ ప్రారంభమైంది’ అని అన్నారు. రష్యా, బ్రిటన్‌లలో కోవిడ్‌ కేసులు తగ్గుముఖం పట్టడంతో కేంద్ర ప్రభుత్వం డిసెంబరు 15 నుండి అంతర్జాతీయ విమాన సర్వీసులను అనుమతించిందని, అనేక మంది పర్యాటకులు ఆయా విమానాల్లో ఇక్కడకు రానున్నారని నీలేశ్‌ షా వివరించారు. ఈ కరోనా కొత్త ఉత్పరివర్తనంతో క్రిస్మస్‌, నూతన సంవత్సరం సీజన్‌ను కోల్పోతామని భయపడుతున్నారా అని ప్రశ్నించగా, అర్హులయిన జనాభా కనీసం టీకా ఒక్క డోసు తీసుకున్నందున గోవా 100 శాతం సురక్షితమైన గమ్యస్థానమని తెలిపారు. ‘అంతేకానీ మేము భయపడము. కోవిడ్‌19 ఉనికిలో ఉన్నందున మేము వ్యాపారం చేయడం నేర్చుకోవాలి’ అని షా పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img