Friday, April 19, 2024
Friday, April 19, 2024

చలో అసెంబ్లీపై ఉక్కుపాదం

అరెస్టులు, నిర్బంధాలు

. జీవో నంబరు వన్‌ను రద్దు చేయాలి : రామకృష్ణ
. అక్రమ అరెస్టులపై మండిపాటు

విశాలాంధ్ర`విజయవాడ: ప్రజాఉద్యమాలపై ఉక్కుపాదం మోపేందుకు తీసుకొచ్చిన జీవో నంబరు వన్‌ను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ వామపక్షాలు, ఇతర పార్టీలు, ప్రజాసంఘాలు చేపట్టిన చలో అసెంబ్లీని పోలీసులు భగ్నం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా తరలివస్తున్న నాయకులు, కార్యకర్తలను ఎక్కడికక్కడ అరెస్టు చేశారు. చాలాచోట్ల నాయకులను గృహనిర్బంధం చేశారు. విజయవాడకు వచ్చే అన్ని రోడ్లపై పోలీసులు చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి నిఘాను పెంచారు. ర్యాలీగా అసెంబ్లీకి వెళుతున్న సీపీఐ, సీపీఎం, ప్రజాసంఘాల నాయకులు, కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. బలవంతంగా అరెస్టు చేశారు. పోలీసు వ్యాన్‌లోకి నెట్టేశారు. ఈ సందర్భంగా పోలీసులు, ఆందోళనకారుల మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. చివరికి నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేసి పోలీస్టేషన్‌కు తరలించారు. జీవో నం.1ను రద్దు చేయాలని సీపీఐ, సీపీఎం, ఇతర రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు సోమవారం ‘చలో అసెంబ్లీ’ చేపట్టాయి. అంతకుముందు విజయవాడలోని సీపీఐ రాష్ట్ర కార్యాలయం దాసరి భవన్‌ నుంచి తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద గల అంబేద్కర్‌ విగ్రహం వరకు ర్యాలీ జరిగింది. అక్కడ అంబేద్కర్‌ విగ్రహానికి నాయకులు నివాళి అర్పించారు. అనంతరం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ రాజ్యాంగం కల్పించిన ప్రజాస్వామ్య హక్కుల్ని కాలరాసేలా వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నంబరు వన్‌ను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. రామకృష్ణ, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు అక్కినేని వనజ, జి.ఈశ్వరయ్య, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు, సీపీఐ విజయవాడ నగర కార్యదర్శి జి.కోటేశ్వరరావు, మహిళా సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెన్మెత్స దుర్గాభవాని, ఏఐవైఎఫ్‌, ఏఐఎస్‌ఎఫ్‌ నాయకులు, కార్యకర్తలు ర్యాలీలో పాల్గొన్నారు. రామకృష్ణ మాట్లాడుతూ జీవో నంబరు వన్‌ను వైసీపీ ప్రభుత్వం ఎందుకు తీసుకువచ్చిందో ప్రజలకు వివరణ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కొన్నిసార్లు ఆందోళనలకు అనుమతిచ్చినా ముందస్తు అరెస్టులు, గృహనిర్బంధాలు ఆగడం లేదని విమర్శించారు. పాదయాత్రలను అడ్డుకుంటున్నారని, ధర్నాలకు అనుమతివ్వటం లేదని మండిపడ్డారు. గన్నవరంలో ధర్నా చేస్తున్న ఉపాధ్యాయులను అడ్డుకున్నారని చెప్పారు. ప్రజాసమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే అవకాశమే కల్పించడం లేదని మండిపడ్డారు. ఈ సమస్యను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గుర్తించాలని కోరారు. ఈ దుర్మార్గపు ప్రభుత్వానికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పారన్నారు. ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకులపై దాడి చేయటాన్ని తీవ్రంగా ఖండిరచారు. జీవో నంబరు వన్‌ను తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు.
ప్రజాస్వామ్యాన్ని గౌరవించటం లేదు: వనజ
జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ప్రజాస్వామాన్ని గౌరవించటం లేదని అక్కినేని వనజ మండిపడ్డారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో దొంగ ఓట్లతో విజయం సాధించాలనే ప్రయత్నాన్ని పట్టభద్రులు అడ్డుకున్నారని చెప్పారు. ప్రజల హక్కుల్ని కాపాడటం కోసం ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని, ఈ ప్రభుత్వాన్ని గద్దె దించుతామని హెచ్చరించారు.
సీపీఐ, ప్రజాసంఘాల నాయకుల అరెస్టు
అంబేద్కర్‌కు నివాళులర్పించిన అనంతరం చలో అసెంబ్లీకి బయలుదేరిస నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. రోప్‌ పార్టీ పోలీసులు వాహనాలు అడ్డుపెట్టి…నాయకుల్ని చుట్టుముట్టారు. పోలీసుల నిర్బంధాన్ని ఛేదించుకుని వెళ్లేందుకు కొందరు ప్రయత్నించారు. ఈ సందర్భంగా సీపీఐ నాయకులకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. పోలీసులు బలవం తంగా నాయకుల్ని ఈడ్చుకెళ్లి పోలీస్‌ వాహనాల్లో ఎక్కించారు. అరెస్టు చేసిన నాయకుల్ని కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అరెస్టు అయిన వారిలో రామకృష్ణ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, వై.వెంకటేశ్వరరావు, ముప్పాళ్ల నాగేశ్వరరావు, అక్కినేని వనజ, జి.ఈశ్వరయ్య, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దోనేపూడి శంకర్‌,

పి.దుర్గాభవాని, విజయవాడ నగర కార్యదర్శి జి.కోటేశ్వరరావు, సహాయ కార్యదర్శి నక్కా వీరభద్రరావు, ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు జాన్సన్‌బాబు, కార్యదర్శి ఎం.శివారెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు ఎస్‌కే నాగూర్‌, చిలుకూరి వెంకటేశ్వరరావు, నాయకులు బుట్టి రాయప్ప, పంచదార్ల దుర్గాంబ, కొట్టు రమణారావు, తూనం వీరయ్య, ఓర్సు భారతి, దోనేపూడి సూరిబాబు, కేఆర్‌ ఆంజనేయులు, పడాల కనకారావు, ఎస్‌కే సుభాని, బెవర శ్రీనివాసరావు, తమ్మిన దుర్గ, దుర్గాసి రమణమ్మ, మురేషన్‌ రాము, బి.శాంత, నీలాపు భాగ్యలక్ష్మి, డి.పుష్ప, పి.రాణి ఉన్నారు.
టీడీపీ నేతల పరామర్శ
జీవో నెం.1ను రద్దుచేయాలని చలో అసెంబ్లీ నిర్వహించిన నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. కాగా, కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌లో ఉన్న రామకృష్ణ, శ్రీనివాసరావుతో పాటు సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్‌, తెలుగుదేశం పార్టీ నాయకులను మాజీ హోమ్‌ మంత్రి నిమ్మకాయల చిన్న రాజప్ప, టీడీపీ తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్‌ రావు, బండారు సత్యనారాయణమూర్తి పరామర్శించారు. అక్రమ అరెస్టులను ఖండిరచారు.

ప్రజల ఆలోచనను అణచివేసే కుట్ర: ముప్పాళ్ల
వైసీపీ ప్రభుత్వం దుర్మార్గంగా, దుష్టబుద్ధితో ప్రజల ఆలోచనల్ని అణచివేసే కుట్రలో భాగంగానే జీవో నంబరు వన్‌ తీసుకువచ్చారని ముప్పాళ్ల నాగేశ్వరరావు ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తుచూపకుండా అడ్డుకునేందుకు ఆయుధంగా ఈ జీవోను వాడుతున్నారని విమర్శించారు. జీవోను వెనక్కు తీసుకునే వరకు ఉద్యమం ఆగదన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img