Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

చలో తాడేపల్లి !

. వైసీపీలో ఎమ్మెల్సీ పదవుల జాతర
. సీఎం క్యాంపు కార్యాలయం వద్ద నేతల క్యూ
. అభ్యర్థుల ఎంపికపై అధిష్ఠానం కసరత్తు
. రేపో, మాపో జాబితా వెల్లడి

విశాలాంధ్ర బ్యూరో ` అమరావతి: రాష్ట్రంలో ఉపాధ్యాయ, పట్టభద్రులతోపాటు, స్థానిక సంస్థల నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదలైన నేపథó్యంలో అధికారపార్టీలో ఆశావాహుల హడావుడి ఎక్కువైంది. వైసీపీ అధిష్ఠానం ప్రస్తుతం అభ్యర్థులను ఎంపిక చేసే ప్రక్రియలో ఉంది. ఆ కసరత్తు తుది దశకు చేరుకున్నట్లు సమాచారం. రేపో, మాపో ఎంపికైన అభ్యర్థుల జాబితా వెల్లడికి రంగం సిద్ధమవుతోంది. కుల సమీకరణలతోపాటు, పార్టీకి విధేయులుగా వ్యవహరిస్తూ ఇప్పటివరకు పదవులు పొందని వారు, ప్రతిపక్ష పార్టీ సభ్యుల ఆరోపణలకు గట్టిగా తిప్పికొట్టగలిన సత్తా ఉన్న నేతలను గుర్తించి, వారికున్న లక్షణాల్లో ప్లస్‌లు, మైనస్‌లు ఆధారంగా అధిష్ఠానం జల్లెడ పడుతోంది. ఈ నేపథó్యంలో గత రెండు రోజులుగా సీఎం క్యాంపు కార్యాలయానికి ఆశావాహుల తాకిడి ఎక్కువైంది. స్థానిక సంస్థల్లో అత్యధిక శాతం సీట్లు వైసీపీ గెల్చుకుంది. దీంతో ఆ నియోజకవర్గాల నుంచి పోటీ చేసేందుకు అధికారపార్టీ నేతలు ఉర్రూతలూగుతున్నారు. గతంలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, జెడ్పీ, మున్సిపల్‌, కార్పొరేషన్‌ చైర్మన్లు ఆశించిన వారు, ఇతర కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవులు ఆశించి భంగపడ్డవారంతా ప్రస్తుతం ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం కోసం తమ వంతు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఇందుకోసం వారి జిల్లాలకు చెందిన మంత్రులు, వారి సొంత నియోజకర్గాలకు చెందిన శాసనసభ్యులు, పార్టీ ప్రాంతీయ సమన్వయకర్తలతో పాటు, ప్రభుత్వంలో అత్యంత కీలకంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, టీటీడీ చైర్మన్‌ ఎస్వీ సుబ్బారెడ్డి, పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి ఆశీస్సులు పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి వైసీపీ నేతలు పెద్దసంఖ్యలో తాడేపల్లి తరలి వస్తున్నారు.రాష్ట్రవ్యాప్తంగా 8 స్థానిక సంస్థలతోపాటు, రెండు ఉపాధ్యాయ, మూడు పట్టభద్రుల నియోజకవర్గాలకు మార్చి 13న ఎన్నిక జరుగనుంది. ఇందుకోసం నామినేషన్ల ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కాగా, ఈ నెల 23న నామినేషన్ల దాఖలుకు చివరి రోజు. దీంతో వైసీపీ నేతల్లో గంట గంటకూ ఉత్కంఠ పెరుగుతోంది. ముఖ్యంగా స్థానిక సంస్థల కోటా నుంచి ఆశించేవారి సంఖ్య అధికంగా ఉంది. ఎందుకంటే ఇవి మొత్తం ఎనిమిది స్థానాలు దాదాపు ఏకగ్రీవం అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. దీంతో పార్టీకి చందా తప్ప, ఓట్ల కోసం పెద్దగా డబ్బు ఖర్చు పెట్టే అవసరం లేకపోవడంతో… ఆశావాహులు పెద్దసంఖ్యలో విజయవాడ నగరంలోని వివిధ హోటల్స్‌లో మకాం వేసి, విభిన్న కోణాల్లో తమ వంతు ప్రయత్నాలు చేసుకుంటున్నారు.ఇటీవల తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీలోకి వచ్చిన కైకలూరు మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకట రమణకు దాదాపు అభ్యర్థిత్వం ఖరారైనట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే కడప జిల్లాలో గతంలో టీడీపీలో కీలకనేతగా పేరొందిన రామసుబ్బారెడ్డికి కూడా సీటు ఖరారైనట్లు సమాచారం. మొత్తం 8 స్థానాలకు సామాజికవర్గ సమీకరణల్లో భాగంగా అందరికీ సమ న్యాయం జరిగేలా కేటాయింపులకు అధిష్ఠానం ప్రయత్నిస్తోంది. రాయలసీమ ప్రాంతం నుంచి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలు పెద్దసంఖ్యలో ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలను ఆశిస్తున్నారు. అనంతపురం జిల్లా నుంచి కె.విజయభాస్కర రెడ్డి, చిత్తూరు జిల్లా నుంచి విశ్రాంత ఐపీఎస్‌ అధికారి రెడ్డెప్ప రెడ్డి, కర్నూలు నుంచి మాజీ ఎమ్మెల్యే డి.పార్థసారధి రెడ్డి, ఆళ్లగడ్డకు చెందిన మరో సీనియర్‌ నేత రామపుల్లారెడ్డి, నంద్యాలకు చెందిన గోపాల్‌ రెడ్డి రేసులో ఉన్నారు. వీరందరిలో రామసుబ్బారెడ్డికి ఎక్కువ అవకాశాలున్నట్లు చెపుతున్నారు. ఇక శ్రీకాకుళం జిల్లా నుంచి మాజీ ఎమ్మెల్యే నీలకంఠం నాయుడు, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ పద్మావతి,పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కారుమంచి రమేష్‌, తూర్పుగోదావరి జిల్లా నుంచి కె.సూర్యనారాయణ, నెల్లూరు నుంచి ముక్కామల ద్వారకానాథ్‌, మేరుగ మురళి పేర్లు అధిష్ఠానం పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక పట్టభద్రులు, ఉపాధ్యాయ నియోజకవర్గాలకు సంబంధించి కూడా పోటీ ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తోంది. సోమ, మంగళవారాల్లో వైసీపీ అధిష్ఠానం ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితా వెల్లడిరచే అవకాశముంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img