Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

చలో పార్లమెంట్‌కు మద్దతు

అఖిలపక్ష రౌండ్‌టేబుల్‌ సమావేశం తీర్మానం
ఏపీ ప్రభుత్వం అఖిలపక్షాన్ని దిల్లీకి తీసుకెళ్లాలి : రామకృష్ణ
రాష్ట్రవ్యాప్తంగా ఉక్కు ఉద్యమం : జేవీ సత్యనారాయణమూర్తి
మోదీ మెడలు వంచేలా ఉద్యమిద్దాం: ఓబులేసు, ఉమామహేశ్వరరావు
పార్లమెంట్‌లో గళం వినిపిస్తాం: కొల్లు రవీంద్ర

విశాలాంధ్ర బ్యూరో`అమరావతి : విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం ఆగస్టు 2, 3 తేదీల్లో విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట వేదిక చేపట్టిన ‘చలో పార్లమెంట్‌’కు విజయవాడలో జరిగిన అఖిలపక్ష రౌండ్‌టేబుల్‌ సమావేశం మద్దతు ప్రకటించింది. విజయవాడ దాసరిభవన్‌లో సోమవారం సీపీఐ రాష్ట్ర సమితి అధ్వర్యాన విశాఖ స్టీల్‌ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణపై కేంద్ర ప్రభుత్వ నియంతృత్వ ధోరణిని నిరసిస్తూ రౌండ్‌టేబుల్‌ సమావేశం జరిగింది. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అధ్యక్షతన జరిగిన సమావేశానికి రాజకీయ, విద్యార్థి, యువజన, కార్మిక, రైతు, మహిళా సంఘాల నేతలు హాజరయ్యారు. రామకృష్ణ మాట్లాడుతూ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ యత్నాలను కేంద్రం విరమించుకోవాలని డిమాండ్‌ చేశారు. ఏపీ ప్రభుత్వం శాసనసభ తీర్మానంతో సరిపెట్టకుండా అఖిలపక్షాన్ని దిల్లీకి తీసుకెళ్లాలని సూచించారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ పరిరక్షణ కోసం జరిగే పోరాటంలో రాజకీయాలకతీతంగా అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. మోదీ ప్రభుత్వం మొదటి నుంచీ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేస్తోందన్నారు. పోరాటాల ద్వారా సాధించుకున్న విశాఖ ఉక్కును కార్పొరేట్‌ శక్తులకు కట్టబెట్టే కుట్ర చేస్తోందన్నారు. విశాఖ ఉక్కును 100 శాతం ప్రైవేటీకరిస్తామంటూ ప్రధాని మోదీ చెబుతుంటే..బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మాత్రం ప్రైవేటీకరణ కాబోదంటూ నిసిగ్గుగా అసత్యాలు చెబుతున్నారని మండిపడ్డారు. ఏపీ బీజేపీ నేతలకు చేతనైతే దిల్లీకి వెళ్లి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఆపాలని డిమాండు చేశారు. బీజేపీ నేతల ద్వంద్వ వైఖరిని తీవ్రంగా ఖండిరచారు. ఇప్పటికైనా మోదీ దిగి రావాలని, లేకుంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామన్నారు. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట వేదిక, జేఏసీ పిలుపులకు అనుగుణంగా ఉద్యమాలను ముందుకు తీసుకెళ్దామన్నారు.
సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఆవిర్భావం, చారిత్రక పోరాట ఘట్టాలను సమగ్రంగా వివరించారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖ ఉక్కు ఉద్యమంలో అందరూ భాగస్వాములు కావాలని కోరారు. ఉక్కు ఫ్యాక్టరీకి సొంత గనులు కేటాయించకుండా, నష్టాలు ఉన్నాయనే సాకుతో వంద శాతం ప్రైవేటీకరణకు పూనుకోవడం దారుణమన్నారు. కరోనా సమయంలో రోజుకు వంద టన్నులకు తగ్గకుండా మెడికల్‌ ఆక్సిజన్‌ను విశాఖ ఉక్కు ఉత్పత్తి చేసి, రోగులకు ప్రాణదాతగా నిలిచిందని గుర్తు చేశారు. నాడు ఉక్కు ఫ్యాక్టరీ కోసం భూములు త్యాగాలు చేసిన కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వలేదన్నారు.
విశాఖ ఉక్కు పరిరక్షణ వేదిక రాష్ట్ర కన్వీనర్‌ జి.ఓబులేసు తీర్మానాన్ని ప్రవేశపెడుతూ..విశాఖ స్టీలు ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఇప్పటివరకూ నిర్వహించిన ఉద్యమాల్ని వివరించారు. అనేక పోరాటాలు, ప్రాణత్యాగాల ద్వారా సిద్ధించిన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని నిలుపుకోవడానికి బీజేపీ, మోదీ మెడలు వంచేలా ఉద్యమించాలని, ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా సభలు, సమావేశాల నిర్వహిస్తామన్నారు. జులై ఆఖరులో రాస్తారోకోలు, రైల్‌రోకోలు నిర్వహించాలని ప్రతిపాదించారు. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట వేదిక నేత వి.ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ రెండు లక్షల కోట్ల రూపాయల విలువైన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ సంపదను..కారుచౌకగా కార్పొరేట్‌శక్తులకు కట్టబెట్టేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం కేంద్రం మెడలు వంచేలా ఉమ్మడి పోరాటాలు అవసరమన్నారు. విశాఖ ఉక్కు ఉద్యమంలో వామపక్ష పార్టీలు కీలక పాత్ర పోషించాయన్నారు. మాజీమంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ మోదీ నిర్ణయాన్ని అందరూ వ్యతిరేకించాలన్నారు. ఉక్కు పరిరక్షణ కోసం పార్లమెంట్‌లో టీడీపీ ఎంపీలు గళం విప్పుతారని, అదే రీతిలో వైసీపీ ఎంపీలు నడుం బిగించాలన్నారు. సీఎం జగన్‌ కేంద్రంపై ఒత్తిడి తేవాలని డిమాండు చేశారు.
ఏఐసీసీ సభ్యుడు నరహరిశెట్టి నరసింహారావు మాట్లాడుతూ విశాఖ పరిరక్షణ కోసం ఒకే మాట ఒకే బాటలో ఉద్యమిద్దామన్నారు. ఆమ్‌ఆద్మీ రాష్ట్ర కన్వీనర్‌ పోతిన వెంకట రామారావు మాట్లాడుతూ విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం దిల్లీ కేంద్రంగా కొనసాగే ఉద్యమానికి సంపూర్ణ మద్దతి తెలిపారు. సీపీఐఎంఎల్‌ న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు కె.పోలారి, ఎస్‌యూసీఐ నాయకులు అమర్‌నాథ్‌, సీపీఐఎంఎల్‌ లిబరేషన్‌ నాయకులు డి.హరినాథ్‌, ఎంసీపీఐ(యూ) నేత ఖాదర్‌ బాషా, ఇఫ్టూ నాయకులు కుటుంబరావు, ముస్లిం లీగ్‌ పార్టీ నాయకులు షేక్‌ ఖాజావలి, అమరావతి పరిరక్షణ దళిత జేఏసీ నాయకులు డాక్టర్‌ కొటికలపూడి శ్రీనివాస్‌ స్టీల్‌ ప్లాంట్‌ ఉద్యమానికి మద్దతుగా మాట్లాడారు. ఏపీ మహిళా సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.దుర్గాభవాని, సీపీఐ కృష్ణాజిల్లా కార్యదర్శి అక్కినేని వనజ, ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవీవీ ప్రసాద్‌, ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.సుబ్బారావు, టీఎన్‌ఎస్‌ఎఫ్‌ నాయకుడు విజయ్‌కుమార్‌, టీఎన్‌టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు రఘురామకృష్ణంరాజు, రాజకీయ విశ్లేషకులు మహ్మద్‌ రఫీ, ఇప్టూ రాష్ట్ర సమితి సభ్యులు పి.ప్రసాదరావు, ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్‌ ప్రసంగించారు.
ఏఐకేఎస్‌ జాతీయ ఉపాధ్యక్షుడు రావుల వెంకయ్య, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జి.ఈశ్వరయ్య, ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు రావులపల్లి రవీంద్రనాథ్‌, సీఐటీయూ నాయకులు కె.స్వరూపరాణి, ముజఫర్‌ అహ్మద్‌, పీసీసీ లీగల్‌సెల్‌ చైర్మన్‌ వి.గుర్నాథం, ముస్లింలీగ్‌ పార్టీ నాయకులు షేక్‌ రజియా, అరసం కృష్ణాజిల్లా కార్యదర్శి మోతుకూరి అరుణ్‌కుమార్‌, ఇతర రాజకీయ, ప్రజాసంఘాల నేతలు పాల్గొన్నారు. తొలుత ఆంధ్రప్రదేశ్‌ ప్రజానాట్యమండలి ప్రధాన కార్యదర్శి పి.చంద్రానాయక్‌ అభ్యుదయ గీతాలు ఆలపించారు. సీపీఐ విజయవాడ నగర కార్యదర్శి దోనేపూడి శంకర్‌ వందన సమర్పణ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img