Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

చలో రాజ్‌భవన్‌ ఉద్రిక్తం

సీపీఐ కార్యాలయం వద్ద పోలీసుల మోహరింపు

. ర్యాలీని అడ్డుకున్న ఖాకీలు
. అక్రమ అరెస్టులు.. పోలీస్‌స్టేషన్‌కు తరలింపు
. రాజ్యాంగ పరిరక్షణకు కదలాలని రామకృష్ణ పిలుపు

విశాలాంధ్ర – విజయవాడ: సమాఖ్య వ్యవస్థను పరిరక్షించాలని, గవర్నర్ల వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ జాతీయ సమితి పిలుపు మేరకు విజయవాడలో సీపీఐ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సమితి గురువారం చేపట్టిన ‘చలో రాజ్‌భవన్‌’ ఉద్రిక్తతకు దారితీసింది. పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో దాసరి భవన్‌కు చేరుకున్నారు. అదేసమయంలో పోలీసులు కూడా భారీ సంఖ్యలో పార్టీ కార్యాలయం చుట్టూ మోహరించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, కేంద్ర కార్యవర్గసభ్యులు అక్కినేని వనజ, రాష్ట్ర కార్యవర్గసభ్యులు దోనేపూడి శంకర్‌, విజయవాడ నగర కార్యదర్శి జి.కోటేశ్వరరావు తదితరుల నేతృత్వంలో ర్యాలీగా రాజ్‌భవన్‌కు బయలుదేరగా, పెట్రోలు బంకు సమీపంలో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో సీపీఐ నాయకులు, పోలీసుల మధ్య వాగ్వాదం జరగటంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. సీపీఐ నాయకులను బలవంతంగా అరెస్టు చేసి గవర్నర్‌పేట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ ఫెడరలిజాన్ని కాపాడాలని, గవర్నర్‌ వ్యవస్థను రద్దు చేయాలన్న డిమాండ్‌తో దేశవ్యాప్తంగా కమ్యూనిస్టు పార్టీ చలో రాజ్‌భవన్‌ చేపట్టినట్లు తెలిపారు. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రాల హక్కులను ఏమాత్రం గౌరవించటం లేదని రామకృష్ణ విమర్శించారు. రాష్ట్రాలు తీసుకునే నిర్ణయాలను కించపరుస్తున్నారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వలేదు. విభజన హామీలు అమలు చేయలేదు. మొత్తంగా రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి జగన్‌ దిల్లీ వెళ్లి అభ్యర్థిస్తున్నా ప్రధాని మోదీ ఏమాత్రం స్పందించడం లేదన్నారు. దేశవ్యాప్తంగా బీజేపీయేతర ప్రభుత్వాలను కూల్చడమే కేంద్రం పనిగా పెట్టుకుందని, ఫిరాయింపులు ప్రోత్సహిస్తున్నదని చెప్పారు. చట్టసభల్లో మెజార్టీ లేకపోయినా బీజేపీని అధికారంలోకి తీసుకువస్తున్నదన్నారు. ఫిరాయింపుల ద్వారా తొమ్మిది రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలు ఏర్పడ్డాయని చెబుతూ ఆయా రాష్ట్రాల్లో బీజేపీ నిర్వహించిన అనైతిక, అప్రజాస్వామిక చర్యలను వివరించారు. ఇలాంటి కార్యక్రమాల నిర్వహణకు బీజేపీ పెద్దలు గవర్నర్‌ వ్యవస్థను నిస్సిగ్గుగా వినియోగించుకుంటున్నారని చెప్పారు. తెలంగాణ, తమిళనాడు, కేరళ, పశ్చిమబెంగాల్‌ వంటి అన్ని రాష్ట్రాల్లో గవర్నర్‌ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్న ఘటనలను ఉదహరించారు. ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వాలను బెదిరించే స్థాయికి గవర్నర్లు దిగజారారని, ఈ నేపథ్యంలోనే గవర్నర్‌ వ్యవస్థను రద్దు చేయటం, ఫెడరలిజం వ్యవస్థను రక్షించటం, రాష్ట్రాల హక్కులను గౌరవించటం మొత్తంగా రాజ్యాంగాన్ని కాపాడాలనే ఉద్ధేశంతో చలో రాజ్‌భవన్‌ చేపట్టినట్లు రామకృష్ణ తెలిపారు. భవిష్యత్తులోనూ ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తామని, దీనికి ప్రజాస్వామిక వాదులు ముందుకు వచ్చి మద్దతివ్వాలని కోరారు. కేంద్రం తన తీరు మార్చుకోవాలని, సమాఖ్య వ్యవస్థకు తూట్లు పొడిచే చర్యలకు స్వస్తి చెప్పాలని డిమాండ్‌ చేశారు.
దోనేపూడి శంకర్‌ మాట్లాడుతూ మేధావులు, ఏదైనా రంగంలో నిష్ణాతులను గవర్నర్లుగా నియమించాలని డిమాండ్‌ చేశారు. కానీ రాజకీయ నిరుద్యోగులను గవర్నర్లుగా నియమిస్తున్నారని, వారి ద్వారా రాజకీయ ప్రత్యర్థులను దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. పోలీసు వ్యవస్థ సరిగా లేదని, వారి తీరు మారాలన్నారు. లేనిపక్షంలో ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. జి.కోటేశ్వరరావు మాట్లాడుతూ రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన గవర్నర్‌ వ్యవస్థ అసలు సిసలు రాజకీయ వ్యవస్థగా మారిందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వాలను అస్థిరపర్చటం ద్వారా తన రాజకీయ విధానాలను, ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్ధాంతాలను అమలు పర్చేలా గవర్నర్‌ వ్యవస్థ ఉందన్నారు. రాజ్యాంగానికి తూట్లు పొడిచే గవర్నర్‌ వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఫెడరల్‌ ప్రభుత్వాలను రక్షించాలని కోరారు. అరెస్టు అయిన వారిలో కె.రామకృష్ణ, అక్కినేని వనజ, దోనేపూడి శంకర్‌, జి.కోటేశ్వరరావు, సీపీఐ నగర సహాయ కార్యదర్శి నక్కా వీరభద్రరావు, నగర కార్యదర్శివర్గ సభ్యులు పంచదార్ల దుర్గాంబ, కార్యవర్గ సభ్యులు కొట్టు రమణరావు, దుగ్గిరాల సీతారావమ్మ, ప్రజానాట్య మండలి నగర అధ్యక్షుడు ఎస్‌కే నజీర్‌, కార్యదర్శి దోనేపూడి సూరిబాబు, ఏఐవైఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు లంకా గోవిందరాజులు, 6వ డివిజన్‌ కార్యదర్శి పడాల కనకారావు, 30వ డివిజన్‌ కార్యదర్శి ఎం.రవికుమార్‌, మహిళా సమాఖ్య నగర అధ్యక్షులు ఓర్సు భారతి, నాయకులు తమ్మిన దుర్గ, నీలాపు భాగ్యలక్ష్మి ఉన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img