Friday, April 19, 2024
Friday, April 19, 2024

భారతావని ఉప్పొంగుతోంది


టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు తొలిపతకం

మీరాబాయి చానుకు ప్రముఖులు అభినందనలు
టోక్యో ఒలింపిక్స్‌లో తన వీరోచిత ప్రదర్శనతో భారత స్టార్‌ వెయిట్‌ లిఫ్టర్‌ మీరాబాయి చాను రజతపతకం సాధించింది.ఈ మణిపూర్‌ మణిపూస దాదాపుగా 24 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌ వెయిట్‌లిఫ్టింగ్‌లో అద్భుతాన్ని ఆవిష్కరించింది. మహిళల 49 కిలోల విభాగంలో భారత కీర్తి పతాకను శిఖరాగ్రలకు చేర్చింది. స్నాచ్‌లో 87 కిలోలు, క్లీన్‌ అండ్‌ జర్క్‌లో 115 కిలోలు మొత్తంగా 202 కిలోలు ఎత్తింది. భారత త్రివర్ణ పతకాన్ని అంతర్జాతీయ వేదికగా రెపరెపలాడిరచింది. ఈ సందర్భంగా ఆమెకు పలువురు ప్రముఖులు అభినందనలు తెలిపారు. రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌, ప్రధాని మోదీతో సహా పలువురు శుభాకాంక్షలు తెలిపారు.‘‘టోక్యో ఒలంపిక్స్‌లో రజత పతకం గెలిచి, భారత్‌కు బోణీ అందించిన వెయిట్‌ లిఫ్టర్‌ మీరాబాయి చానుకు అభినందనలు’’ అంటూ రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌ పేర్కొన్నారు.ప్రధాని మోదీ కూడా శుభాకాంక్షలు తెలిపారు. ‘‘మీరాబాయి ప్రదర్శనతో భారత్‌ ఉప్పొంగుతోంది. రజత పతకం సాధించినందుకు అభినందనలు. ఆమె సాధించిన విజయం భారతీయులందరికీ స్ఫూర్తిదాయకమే’’ అని మోదీ పేర్కొన్నారు. ఒలింపిక్స్‌ క్రీడల్లో వెయిట్‌ లిఫ్టింగ్‌ విభాగంలో మీరాబాయి రజత పతకం సాధించడం గర్వంగా ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పేర్కొన్నారు. ‘యావత్‌ భారతావనిని గర్వపడేలా చేశావు చాను’ అని మణిపూర్‌ ముఖ్యమంత్రి ఎన్‌.బీరేన్‌ సింగ్‌ శుభాకాంక్షలు తెలిపారు. ‘టోక్యో ఒలింపిక్స్‌ ఆరంభంలోనే దేశానికి తొలి పతకం అందించిన చానుకు అభినందనలు. తన పుత్రికను చూసి భారతావని గర్వపడుతోంది.’ అని రాహుల్‌గాంధీ పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img