Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

చేయిదాటిన సంక్షోభం

శ్రీలంకలో ఆర్థిక అస్థిరతపై మరోసారి పెల్లుబిక్కిన ప్రజాగ్రహం
అధ్యక్షుడి భవనంలోకి చొచ్చుకెళ్లిన నిరసనకారులు
పోలీసులతో సహా 30 మంది పౌరులకు గాయాలు
ప్రధాని నివాసాన్ని తగలబెట్టిన ఆందోళనకారులు
పారిపోయిన గొటాబయ రాజపక్స
ప్రధాని రణిల్‌ విక్రమ సింఘే రాజీనామా

కొలంబో : శ్రీలంక సంక్షోభం చేయిదాటింది. దేశ ఆర్థిక అస్థిరతపై ప్రజాగ్రహం మరోసారి పెల్లుబిక్కింది. స్థానిక కర్ఫ్యూ ఆదేశాలను ఎత్తివేయడంతో వేలాది మంది ఆందోళనకారులు శనివారం వీధుల్లోకి వచ్చారు. అధ్యక్షుడు గొటాబయ రాజపక్స రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ జాతీయ జెండాలతో వందలాదిమంది నిరసనకారులు అధ్యక్ష భవనంలోకి చొచ్చుకెళ్లారు. బారికేడ్లను బద్దలు కొట్టి మధ్య కొలంబోలో అత్యంత భద్రత కలిగిన ఫోర్ట్‌ ప్రాంతంలోని రాజపక్స అధికారిక నివాసంలోకి దూసుకెళ్లారు.
ఈ నేపథ్యంలో అధికారిక నివాసం నుంచి రాజపక్స పరారాయ్యడు. అంతకుముందు నిరసనకారులను అదుపు చేసేందుకు పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపినా ప్రయోజనం లేకపోయింది. నిరసనకారులను నియంత్రించేందుకు పోలీసులు కొలంబో వీధుల్లో ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేశారు. వారిని అదుపు చేసేందుకు జలఫిరంగులను, భాష్పవాయు గోళాలను ప్రయోగించారు. అధ్యక్ష అధికారిక నివాసానికి దారితీసే వీధులన్నీ నిరసనకారులతో నిండిపోయాయి. దేశం నలుమూలల నుంచి ప్రజలు బస్సులు, రైళ్లు, ట్రక్కుల్లో కొలంబోకు చేరుకున్నారు. చాలా మంది జాతీయ జెండాలను పట్టుకొని రోడ్లపైకి వచ్చారు. అధ్యక్షుడు రాజపక్స ఏప్రిల్‌ ప్రారంభంలో తన కార్యాలయ ఆక్రమించడానికి నిరసనకారులు వచ్చినందున అధ్యక్ష భవనాన్ని తన నివాసంగా, కార్యాలయంగా ఉపయోగిస్తున్నారు. శనివారం నిరసనలు పెరగడంతో అధ్యక్షుడిని శుక్రవారం ఇంటి నుంచి తరలించినట్లు అంతర్గత వర్గాలు చెబుతున్నాయి. అధ్యక్ష భవనం గోడలు ఎక్కిన నిరసనకారులు ఇప్పుడు ఎలాంటి ఆస్తి నష్టం జరగకుండా లేదా హింసాత్మక చర్యలకు పాల్పడకుండా ఆక్రమిస్తున్నారు. కొనసాగుతున్న నిరసనల్లో ఇద్దరు పోలీసు అధికారులతో సహా కనీసం 30 మంది గాయపడ్డారు. ప్రధాని నివాసాన్ని ఆందోళనకారులు తగలబెట్టారు. వారు కొలంబోలోని జాతీయ ఆసుపత్రిలో చేరారు. కొలంబోకు రైళ్లను నడపవలసిందిగా ప్రదర్శకులు అధికారులను బలవంతం చేయడంతో నిరసనకారులు గాలే, కాండీ, మాతర ప్రావిన్షియల్‌ పట్టణాలలో రైల్వే అధికారులతో ఘర్షణ పడ్డారు. పోలీసులు, ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌, సైన్యంతో కూడిన భారీ బృందాలను ఆ ప్రాంతం చుట్టూ మోహరించారు. ‘హోల్‌ కంట్రీ టు కొలంబో’ అనే ఉద్యమ నిర్వాహకులు మాట్లాడుతూ ప్రజలు కొలంబో ఫోర్ట్‌ వద్ద నిరసనకారులతో చేరడానికి శివారు ప్రాంతాల నుంచి నడిచారని తెలిపారు. రాజపక్స అధ్యక్ష పదవి నుంచి వైదొలగే వరకు ఆందోళన విరమించేది లేదని ఆందోళనకారులు తెలిపారు. కాగా నిరసనకారులు అధ్యక్ష భవనంలోని స్విమ్మింగ్‌ ఫూల్‌లో ఈత కొడుతూ సేదతీరడం, భవనంలోని వంటి గదిలో వంట చేసుకున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కెర్లు కొడుతున్నాయి. ఇదిలావుండగా, గొటాబయ రాజపక్స రాజీనామాకు పిలుపునిస్తూ ప్రజా నిరసన కారణంగా దేశంలో ఏర్పడిన సంక్షోభంపై చర్చించడానికి ప్రధాన మంత్రి రణిల్‌ విక్రమ సింఘే శనివారం రాజకీయ పార్టీల నేతల అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చారు.
పారిపోయిన అధ్యక్షుడు.. నేవీ షిప్‌లో సూట్‌కేసుల లోడిరగ్‌
శ్రీలంకలో ప్రజల నిరసనతో అధ్యక్షుడు గొటాబయ అధికారిక నివాసం నుంచి పారిపోయాడు. ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నాడనేది ఇంకా తెలియదు. ఈ నేపథ్యంలోనే ఓ కీలక వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నది. ఆయనకు సంబంధించిన సూట్‌కేసులు నావికా దళానికి చెందిన ఒక నౌకలోకి వేగంగా లోడ్‌ చేస్తున్న వీడియో బయటకు వచ్చింది. ఎస్‌ఎల్‌ఎన్‌ఎష్‌ గజబాహు నేవీ షిప్‌లో ముగ్గురు వ్యక్తులు పెద్ద పెద్ద సూట్‌కేసులను తీసుకెళ్లుతున్నట్టుగా ఆ వీడియో తెలుపుతున్నది. ఆ ముగ్గురు సూట్‌కేసులను వేగంగా ఆత్రంగా పట్టుకుని లాగుతూ పరుగెడుతున్నారు. ఈ సూట్‌కేసులు అధ్యక్షుడు గొటబాయ రాజపక్సేవేనని స్థానిక మీడియా పేర్కొంది.
జర్నలిస్టులపై పోలీసుల దాడి: ప్రధాని నివాసం ఎదురుగా ఉద్రిక్త వాతావరణం నెలకొనగా, కొనసాగుతున్న నిరసనలను కవర్‌ చేస్తున్న నలుగురు న్యూస్‌ ఫస్ట్‌ జర్నలిస్టులపై శ్రీలంక పోలీసు స్పెషల్‌ టాస్క్‌ ఫోర్స్‌ దాడి చేసింది. రణిల్‌ విక్రమ సింఘే వ్యక్తిగత నివాసానికి సమీపంలో శ్రీలంక పోలీసులు, పోలీసు స్పెషల్‌ టాస్క్‌ ఫోర్స్‌ దాడి చేశారు. దాడి జరిగిన కొద్దిసేపటికే తోటి జర్నలిస్టులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వారిని కూడా భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు.
క్రికెట్‌ స్టేడియం వద్ద ఆందోళన: శ్రీలంక-ఆస్ట్రేలియా టెస్ట్‌ మ్యాచ్‌ జరుగుతున్న క్రికెట్‌ స్టేడియానికి ఎదురుగా కొలంబోలోని గాలే ఫోర్ట్‌ వద్ద నిరసనకారుల బృందం గుమిగూడిరది. ఇతర సమూహాలు స్టేడియం చుట్టూ తిరుగుతూ ‘గోటా గో హోమ్‌’ అని నినాదాలు చేశారు.
ప్రధాని పదవికి రణిల్‌ విక్రమ సింఘే రాజీనామా..?
శ్రీలంక ప్రధాని రణిల్‌ విక్రమ సింఘే తన పదవికి రాజీనామా చేశారు. స్పీకర్‌ అధ్యక్షతన పార్టీ నేతల సమావేశం అనంతరం విక్రమ సింఘే తన రాజీనామాను ప్రకటించారు. అఖిలపక్ష ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు పదవులకు రాజీనామా చేయాలని విక్రమ సింఘే, గొటాబయను పార్టీ నేతలు కోరిన నేపథ్యంలోనే విక్రమ సింఘే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాజీనామాను ట్విటర్‌ వేదికంగా వెల్లడిరచారు. ‘దేశ ప్రజల భద్రత సహా ప్రభుత్వ కొనసాగింపు కోసం నేను ఈ రోజు పార్టీ నాయకుల ఉత్తమ సిఫార్సును అంగీకరిస్తున్నా. ప్రధాన మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నా’ అంటూ ట్వీట్‌ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img