Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

జగన్‌…ఇకనైనా కళ్లు తెరువు

జీవోని వెనక్కి తీసుకో
హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం: రామకృష్ణ

విశాలాంధ్ర బ్యూరో`అమరావతి : ప్రజాస్వామిక హక్కులను కాలరాసే జీవో నంబరు 1ని సస్పెండ్‌ చేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడంపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి ఇప్పటికైనా విజ్ఞత ప్రదర్శించి ఆ జీవోను ఉపసంహరించాలని డిమాండ్‌ చేశారు. రామకృష్ణ గురువారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, ప్రజా సమస్యలపై ఆందోళనలు అణచివేసేందుకు జగన్‌ సర్కార్‌ వివిధ రూపాల్లో నిర్బంధాలు కొనసాగిస్తున్నదని విమర్శించారు. చలో అసెంబ్లీ సహా ఏ కార్యక్రమం చేపట్టినా ఆయా పార్టీల నేతలను గృహ నిర్బంధం చేస్తూ రాజ్యాంగ హక్కులను కాలరాస్తోంది. నియంతృత్వ విధానాలతో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోంది. ఇది పరకాష్ఠకు చేరి…కందుకూరు దుర్ఘటన సాకుతో నూతన సంవత్సర కానుకగా ప్రతిపక్షాల గొంతునొక్కే జీవో నంబరు 1 తీసుకొచ్చింది. ఈ జీవోను కూడా ప్రతిపక్షాలకు ఒక రకంగా, అధికారపార్టీకి మరో విధంగా అమలు చేస్తున్నది. అన్ని రాజకీయపార్టీలు, ప్రజాస్వామ్యశక్తులన్నీ ముక్తకంఠంతో జీవోను నిరసించాయి. ప్రతిపక్షాల గొంతు నొక్కే ఈ జీవోను రద్దు చేయాలని కోరుతూ తాను హైకోర్టును ఆశ్రయించానని రామకృష్ణ తెలిపారు. దీనిపై విచారించిన హైకోర్టు…సెక్షన్‌ 30 పోలీస్‌ యాక్టు విధానాలకు భిన్నంగా జీవో ఉన్నట్లు స్పష్టం చేస్తూ దానిని సస్పెండ్‌ చేసిందని రామకృష్ణ వెల్లడిరచారు. జీవో నంబరు 1ని హైకోర్టు సస్పెండ్‌ చేయడంపై సీపీఐ శ్రేణులు విజయవాడలో సంబరాలు చేసుకున్నాయి. ఒకరికొకరు స్వీట్లు పంచుకున్నారు. సీపీఐ రాష్ట్రకార్యదర్శివర్గ సభ్యులు జల్లి విల్సన్‌. పి.హరినాథరెడ్డి, రాష్ట్రకార్యవర్గసభ్యులు దోనేపూడి శంకర్‌, విజయవాడ నగర కార్యదర్శి జి.కోటేశ్వరరావు, ఏఐవైఎఫ్‌ రాష్ట్ర ప్రధానకార్యదర్శి లెనిన్‌బాబు, ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర ప్రధానకార్యదర్శి శివారెడ్డి, డీహెచ్‌పీఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ బుట్టి రాయప్ప పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img