Friday, April 19, 2024
Friday, April 19, 2024

జగన్‌ సర్కారుకి మరో ఎదురుదెబ్బ

పాఠశాల విద్యాశాఖలో మున్సిపల్‌ స్కూళ్ల విలీనంపై హైకోర్టు స్టే

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : జగన్‌ ప్రభుత్వానికి హైకోర్టులో మరో ఎదురుదెబ్బ తగిలింది. గత ఏడాది జూన్‌లో మున్సిపల్‌ స్కూళ్లను పాఠశాల విద్యాశాఖలో విలీనం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోపై ఉన్నత న్యాయస్థానం స్టే విధించింది. మున్సిపల్‌ స్కూళ్ల విలీనాన్ని వ్యతిరేకిస్తూ పురపాలక టీచర్స్‌ ఫెడరేషన్‌ (ఎంటీఎఫ్‌) అధ్యక్షుడు ఎస్‌.రామకృష్ణ హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై గురువారం విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం…రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 2115 మున్సిపల్‌ పాఠశాలల విలీనంపై స్టే విధించింది. పురపాలక చట్టాలకు, 74 అధికరణానికి వ్యతిరేకంగా జీవో 84 ఉందని న్యాయస్థానం అభిప్రాయపడిరది. జీవో 180 ద్వారా పురపాలక పాఠశాలలపై విద్యాశాఖ అధికారుల పెత్తనానికి అవకాశం కల్పించడం సమంజసం కాదని ధర్మాసనం పేర్కొంది. జీవో 184 ప్రకారం విద్యాశాఖ నుంచి పురపాలక పాఠశాలల ఉపాధ్యాయుల జీతభత్యాలు చెల్లింపు చేయకూడదనే అంశంపైనా పిటిషనర్‌తో ఏకీభవించిన హైకోర్టు…మున్సిపల్‌ పాఠశాలలను పాఠశాల విద్యాశాఖలో విలీనం చేస్తూ ఇచ్చిన జీవోని నిలిపివేసింది. మున్సిపల్‌ పాఠశాలల విలీనానికి సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన జీవోను ఉపాధ్యాయులు తీవ్రంగా వ్యతిరేకించారు. దాదాపు కోటి 30 లక్షల మంది పట్టణ జనాభాలో 5 లక్షల మంది పిల్లలు మున్సిపల్‌ పాఠశాలల్లో విద్య అభ్యసిస్తున్నారు. వారిలో 95 శాతం మంది ఎస్సీ, ఎస్టీ, బీసీల పిల్లలు ఉన్నారు. మున్సిపల్‌ స్కూళ్ల ఆస్తుల కోసమే విలీనం అంటూ అప్పట్లో ఉపాధ్యాయులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అయినప్పటికీ జగన్‌ సర్కార్‌ మొండిగా వ్యవహరిస్తూ జీవో 84 ఇచ్చింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img