Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

జగన్‌ సర్కార్‌కు ఊరట

. ఆర్‌`5 జోన్‌పై ‘స్టే’ విధింపునకు హైకోర్టు నిరాకరణ
. తదుపరి విచారణ 19కి వాయిదా

విశాలాంధ్ర బ్యూరోఅమరావతి: రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాలు పథకాల్లో భాగంగా అందరికీ ఇళ్లు ఇచ్చే పథకం కింద రాజధాని అమరావతిలో ఇతర ప్రాంతాల వారికి ఇళ్ల స్థలాలు కేటాయిస్తూ జారీ చేసిన వివాదా స్పద ఉత్తర్వులపై హైకోర్టులో సర్కారుకి ఊరట లభించింది. అమరావతిలో ఆర్‌5 జోన్‌ పేరుతో ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ హైకోర్టులో అనేక పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై మంగళవారం హైకోర్టు ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా, జస్టిస్‌ మంతోజు గంగారావుతో కూడిన ద్విసభ్య ధర్మాసనం మరోసారి విచారణ జరిపింది. అమరావతిలో ఇతర ప్రాంతాల వారికి ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు మొత్తం 1134.58 ఎకరాల భూమిని కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్‌ 45 జారీ చేసింది. మొత్తం 20 లేఅవుట్లలో ఎన్టీఆర్‌, గుంటూరు జిల్లాలకు చెందిన 48,218 మంది పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయిం చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆమేరకు లబ్ధిదారుల జాబితాతో డీపీఆర్‌లు తయారు చేయాలని గుంటూరు, ఎన్టీఆర్‌ జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు కూడా జారీ చేశారు. ఇళ్ల నిర్మాణానికి అవసరమైన కనీస మౌలిక సదుపాయాలను వెంటనే కల్పించేలా తగిన కార్యాచరణ రూపొందించుకోవాలని, మే నెల మొదటివారం నాటికి పనులు కూడా ప్రారంభించాలని సీఆర్‌డీఏ అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించిన నేపథ్యంలో రాజధాని ఉద్యమం చేపడుతున్న ఐక్య కార్యాచరణ సమితి హైకోర్టును ఆశ్రయించింది.
దీనిపై మంగళవారం హైకోర్టులో వాడీవేడిగా వాదనలు జరిగాయి. రాజధాని భూములను ఇతర అవసరాలకు ఉపయోగించకూ డదని గతంలో హైకోర్టు తీర్పు ఇచ్చిన విషయాన్ని పిటిషనర్ల తరపు న్యాయవాదులు గుర్తుచేశారు. సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాదులు దేవదత్‌ కామత్‌, ఆంజనేయులు, ఉన్నం మురళీధర్‌లు తమ వాదనలు బలంగా వినిపించారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. గతంలో హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పునకు, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో పూర్తి వ్యతిరేకమని న్యాయవాదులు ధర్మాసనం దృష్టికి తెచ్చారు. దీనిపై స్పందించిన హైకోర్టు, ఇప్పటికే సుప్రీంకోర్టులో కేసు విచారణలో ఉన్నందున అక్కడికి వెళ్లొచ్చు కదా అని సూచించింది. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను ఎలా అడ్డుకుంటామని ప్రశ్నించింది. తాము కేవలం రాజధాని భూములపై మాత్రమే మాట్లాడుతున్నట్లు న్యాయవాదులు తెలిపారు. రాజధాని భూములపై థర్డ్‌ పార్టీకి హక్కులు కల్పించడం న్యాయ సమ్మతం కాదన్నారు. ప్రభుత్వ ఉత్తర్వులపై స్టే ఇవ్వాలని కోరగా, ఈ పరిస్థితుల్లో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని ధర్మాసనం చెప్పింది. దీనిపై ఈనెల 19న తదుపరి విచారణ చేపడతామని, ఈ లోపు ప్రభుత్వం, సీఆర్డీయే కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img