Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

జగన్‌ సర్కార్‌కు డేంజర్‌ బెల్‌

. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ట్రైలర్‌ చూపించాం
. పులివెందులలో జగన్‌ను ఓడిస్తాం
. నాలుగేళ్లలో అభివృద్ధి శూన్యం… అప్పులు ఘనం
. వచ్చే ఎన్నికల్లో యువతకు 40 శాతం సీట్లు
. ముందుగానే అభ్యర్థుల ప్రకటన
. ఉత్తరాంధ్ర జిల్లాల ప్రాంతీయ సదస్సులో చంద్రబాబు

విశాలాంధ్ర బ్యూరో – విశాఖపట్నం : వైసీపీ పాలనలో ఎస్సీలపై దాడులు పెరిగాయని, ఎస్సీలను వేధిస్తున్నారని ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. విశాఖలోని వీ కన్వెన్షన్‌ సెంటర్‌లో జరుగుతున్న తెలుగుదేశం జోన్‌-1 సమీక్షా సమావేశంలో చంద్రబాబు పాల్గొన్నారు. అందరికీ సమాన అవకాశాలు, సమాన గౌరవం దక్కేలా తెలుగుదేశం పార్టీ పని చేసిందని గుర్తు చేశారు. ఎస్సీలు అభివృద్ధి చెందాలంటే సైకో పాలన పోయి సైకిల్‌ పాలన రావాలని ఆయన అన్నారు. బాబూ జగ్జీవన్‌ రామ్‌ స్ఫూర్తితోనే తెలుగుదేశం పార్టీ పని చేస్తోందని తెలిపారు. మొన్న జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ట్రైలర్‌ చూపించామన్నారు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలిచిన వేపాడ చిరంజీవిని, చివరి నిమిషంలో టికెట్‌ మార్పునకు సహకరించిన చిన్ని లక్ష్మీకుమారిని చంద్రబాబు సత్కరించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఒక గెలుపు ఉత్సాహం ఇస్తుందని, ఓటమి కుంగదీస్తుందని తెలిపారు. ఆఖరికి కడపలో కూడా గెలిచామని, ఒక దెబ్బకి జగన్‌ మీటింగ్‌ పెట్టాడని అన్నారు. ఇంతకు ముందు ఎమ్మెల్యేలను బానిసలుగా చూశాడని, ఇప్పుడు ఎవరినీ వదులుకోనని ఎమ్మెల్యేలను బతిమాలుతున్నాడన్నారు. జగన్‌కు డేంజర్‌ బెల్‌ మోగిందని, మేం తలచుకుంటే తాడేపల్లి ప్యాలెస్‌ కూల్చడం ఎంతసేపు అన్నారు. విశాఖ జోన్‌ సమావేశం విజయవంతం అయిందని, నేతలు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారన్నారు. ఈ స్పందనను చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో గెలిచేది టీడీపీనే అని ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ అంటున్నట్లు వై నాట్‌ 175 కాదు, ఇప్పుడు చెబుతున్నా వై నాట్‌ పులివెందుల అని బాబు ఘటుగా చెప్పారు. పులివెందులలో జగన్‌ను ఓడిస్తామన్నారు. మొన్న జరిగిన ఎన్నికల్లో వచ్చిన తీర్పునకు కూడా జగన్‌ వక్రభాష్యం చెప్పాడని, ఓటమిని ఒప్పుకోని మనస్తత్వం ఉన్న వ్యక్తి జగన్‌ అన్నారు. నాలుగేళ్లలో జగన్‌ ఉత్తరాంధ్రకు ఏం చేశాడో చెప్పగలడా అని ప్రశ్నించారు. టీడీపీ గెలిచి ఉంటే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, పోలవరం పూర్తయ్యేవని, వంశధార, నాగావళి అనుసంధానం పూర్తయి ఉంటే ఈ మూడు జిల్లాల్లో నీటి ఎద్దడి లేకుండా ఉండేదన్నారు. ఉత్తరాంధ్రలో ఇరిగేషన్‌పై రూ.1,600 కోట్లు ఖర్చు పెడితే, ఈ ప్రభుత్వం కనీసం రూ.400 కోట్లు కూడా ఖర్చు పెట్టలేదన్నారు. నాడు తీసుకున్న నిర్ణయాల వల్ల తెలంగాణ ఇప్పుడు ఆదాయంలో అగ్రశ్రేణికి చేరిందని, ఏపీ మాత్రం అప్పుల్లో మునిగిపోయిందన్నారు. విశాఖలో జీ20 సమావేశాల సందర్భంగా తాము నాటిన చెట్లకు రంగులేసుకున్న వైసీపీ నేతల వైఖరిని విశాఖ ప్రజలు గుర్తించారన్నారు. రిషికొండకు గుండు కొట్టేశారని అన్నారు. నాడు భోగాపురం విమాశ్రయం కోసం 97 శాతం భూసేకరణ పూర్తి చేశామని, నాలుగేళ్లయినా జగన్‌ ఒక్క ఇటుక వెయ్యలేదన్నారు. తాము విశాఖలో మెడ్‌టెక్‌ జోన్‌ తీసుకువచ్చామని, ఫ్రాంక్లిన్‌ టెంపుల్‌టన్‌ కంపెనీని తీసుకువస్తే దాన్నీ ఈ ప్రభుత్వం తరిమేసిందన్నారు. విశాఖ ఒక సుందరమైన నగరమని, దీన్ని ఆర్థిక రాజధానిగా, ఐటీ హబ్‌గా చేయాలని ప్రయత్నం చేశామని చంద్రబాబు తెలిపారు. విశాఖలో ఐదేళ్లలో మూడు సార్లు సీఐఐ సదస్సులు నిర్వహించి, రూ.16 లక్షల కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు చేసుకున్నామని అన్నారు. పోలవరం ముంపు బాధితులకు డబ్బులు ఇవ్వలేదని, మహేంద్ర తనయ ఆఫ్‌షోర్‌ ప్రాజెక్టును జగన్‌ పూర్తి చెయ్యలేదన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో జీవో నంబరు 3 ద్వారా స్థానిక గిరిజనులకే ఉద్యోగాలు అనే ఉత్తర్వు ఇప్పుడు పోయిందని, దీనిపై వచ్చిన న్యాయపరమైన సమస్యల్లో ప్రభుత్వం పోరాడలేదని ఆరోపించారు. నాడు గిరిజన ప్రాంతాల్లో బైక్‌ అంబులెన్స్‌లు పెట్టామని, ఇప్పుడు అవన్నీ అందుబాటులో లేకుండా పోయాయన్నారు. దీంతో అడవిలోనే కాన్పులు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఏజెన్సీ నుంచి దొంగ దారిన లేటరైట్‌ పేరుతో బాక్సైట్‌ తవ్వి తీసుకువెళుతున్నారు. రాష్ట్రంలో మద్యనిషేధం చేస్తానని చెప్పిన జగన్‌ ఇప్పుడు ఏం చేస్తున్నాడని ప్రశ్నించారు. పెద్ద ఎత్తున ఇసుక మాఫియాను నడిపిస్తున్నారని ఆరోపించారు. ఒక్క విశాఖపట్నంలోనే రూ.40 వేల కోట్ల ఆస్తులను వైసీపీ నేతలు రాయించుకున్నారని చంద్రబాబు మండిపడ్డారు. టీడీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత సిట్‌ ఏర్పాటు చేసి లాక్కున్న భూములన్నీ తిరిగి ఇప్పిస్తామన్నారు. జగన్‌ రెడ్డీ నీ బంధువు అనీల్‌ రెడ్డికి విశాఖలో ఏం పని… ఇక్కడ ఒక వ్యక్తికి చెందిన 50 ఎకరాల భూమి కొట్టేశాడని ఆరోపించారు. రాష్ట్రంలో గంజాయి కల్చర్‌, గన్‌ కల్చర్‌ వచ్చిందంటే మనం సిగ్గు పడాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.10 లక్షల కోట్ల అప్పులు చేశారని, పన్నులు వేశారని, ఒక్క రోడ్డు వేయలేదని, ఒక్క ప్రాజెక్టూ కట్టలేదని, ఒక్క పరిశ్రమ తేలేదన్నారు. మరి ఆ నిధులన్నీ ఏమయ్యాయని ప్రశ్నించారు. దిల్లీ మెడలు వంచుతా అని చెప్పిన ముఖ్యమంత్రి దిల్లీ ఎందుకు వెళుతున్నాడని, ప్రత్యేక హోదా వచ్చిందా, గిరిజన యూనివర్సిటీ ప్రారంభం అయిందా, పోలవరం పూర్తయిందా, రైల్వే జోన్‌ డిమాండ్‌ పూర్తిగా నెరవేరిందా అని చంద్రబాబు ప్రశ్నించారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు, పొలిట్‌ బ్యూరో సభ్యులు పూసపాటి అశోక్‌ గజపతిరాజు, నాయకులు అయ్యన్నపాత్రుడు, కళా వెంకట రావు, చినరాజప్ప, గంట శ్రీనివాసరావు, ఉత్తరాంధ్ర జిల్లాల సీనియర్‌ నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img