Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

జగన్‌ హయాంలో రాష్ట్రం దివాలా

. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను గద్దె దించుతాం
. ప్రచారభేరిలో రామకృష్ణ

విశాలాంధ్ర-గుంతకల్లు: ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు. ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను వచ్చే ఎన్నికల్లో గద్దె దించుతామని స్పష్టంచేశారు. ఉభయ కమ్యూనిస్టు పార్టీల అధ్వర్యంలో పాత గుంతకల్లు బీరప్ప గుడి నుండి గాంధీ చౌక్‌ వరకు ఎద్దుల బండ్లు, గుర్రాలతో బుధవారం వినూత్నంగా ప్రచార భేరి ర్యాలీ నిర్వహించారు. రామకృష్ణతో పాటు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డి.జగదీశ్‌, సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఓబుల కొండారెడ్డి, సీపీఐ జిల్లా కార్యదర్శి జాఫర్‌, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు బి.గోవిందు, ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు జాన్సన్‌ బాబు పాల్గొన్నారు. రామకృష్ణ మాట్లాడుతూ దేశంలో ప్రమాదకర రాజకీయాలు నడుస్తున్నాయన్నారు. ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల భారతదేశంలో హిందువులతో పాటు ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు, వేలాది కులాలు, మతాలు, వివిధ భాషలు వారు కలిసిమెలిసి జీవిస్తున్నామని, అంబేద్కర్‌ రాజ్యాంగం వల్లే ఇది సాధ్యమవుతోందని చెప్పారు. మోదీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తోందని, లౌకికవాదాన్ని మట్టు పెడుతోందని రామకృష్ణ విమర్శించారు. మోదీ, అమిత్‌ షా నాయకత్వంలో మతోన్మాదం పెచ్చరిల్లుతోందని మండిపడ్డారు. దేశంలో మైనారిటీలను భయాందోళనకు గురిచేస్తున్నారన్నారు. దేశ సంపదను కార్పొరేట్‌ శక్తులకు దోచిపెడుతున్నారని ఆరోపించారు. అంబానీ, అదానీలను ప్రధాని మోదీ పెంచి పోషిస్తున్నారని తెలిపారు. దేశ రక్షణ కోసం మోదీ హటావో…దేశ్‌ బచావో నినాదంతో సీపీఐ, సీపీఎం ప్రచారభేరి చేపట్టాయని గుర్తుచేశారు.
జగన్‌ ప్రభుత్వంపై రామకృష్ణ విమర్శలు గుప్పించారు. భారీ మెజారిటీతో రాష్ట్రాన్ని చక్కగా పాలించాలని ప్రజలు కోరుకుంటే…జగన్‌ మాత్రం అప్పుల ఊబిలోకి నెట్టారని మండిపడ్డారు. ఒకటో తారీఖున ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి డబ్బులు ఉండటం లేదన్నారు. ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అప్పు కోసం దిల్లీలో పడిగాపులు పడుతున్నారని ఆరోపించారు. తల్లీ చెల్లిని పట్టించుకోని జగన్‌…రాష్ట్ర ప్రజలను ఎందుకు పట్టించుకుంటారని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని పట్టించుకోవడం లేదు. కుటుంబాన్ని పట్టించుకోవడం లేదు. అధికారమే పరమావధిగా స్టిక్కర్లు పట్టుకొని జగన్‌ తిరుగుతున్నారని రామకృష్ణ విమర్శించారు. రాష్ట్రాన్ని దివాలా పట్టించిన జగన్‌… ఈ రాష్ట్రానికి ఏ రకంగా భవిష్యత్తు, ఏ రకంగా నమ్మకమని ప్రశ్నించారు. దేశాన్ని కాపాడుకునేందుకు ముందుకు రావాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రచారభేరి ర్యాలీలో సీపీఐ నియోజవర్గం కార్యదర్శి వీరభద్రస్వామి, సహాయ కార్యదర్శులు మహేశ్‌, రమేశ్‌, పట్టణ కార్యదర్శి గోపీనాథ్‌, మండల కార్యదర్శి రాము రాయల్‌, ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కుల్లయ్య, జి.చిరంజీవి, సీపీఎం నాయకులు డి.శ్రీనివాసులు, భజంత్రీ శ్రీనివాసులు, దాసరి శ్రీనివాసులు, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బి.కేశవరెడ్డి, ఎస్‌ నాగరాజు, ఆంధ్రప్రదేశ్‌ గిరిజన సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు వైఎల్‌ రామాంజనేయులు, సీపీఐ మండల, పట్టణ సహాయ కార్యదర్శులు ఎస్‌ఎండీ గౌస్‌, రామాంజనేయులు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు దేవేంద్ర, ఏఐటీయూసీ మండల కార్యదర్శి ఈశ్వరయ్య, మండల వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ సురేశ్‌, సీపీఐ నాయకులు మురళీకృష్ణ, మల్లయ్య, పుల్లయ్య, లింగన్న, చిదంబరం, మహిళా సమాఖ్య నియోజవర్గ కార్యదర్శి రామాంజనమ్మ , ఏఐఎస్‌ఎఫ్‌ నాయకులు వెంకట్‌ నాయక్‌, వినోద్‌, సీపీఎం నాయకులు సాకే నాగరాజు, కసాపురం రమేశ్‌, వైటీ చెరువు రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img