Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

జపాన్‌ మాజీ ప్రధాని షింజో అబే దారుణహత్య

నరా నగరంలో ఎన్నికల సందర్భంగా ప్రసంగిస్తూ దుండగుడి కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన జపాన్‌ మాజీ ప్రధాని షింజో అబే కన్నుమూశారు. బుల్లెట్‌ గాయాలతో కుప్పకూలి అత్యంత విషమ పరిస్థితుల్లో ఉన్న ఆయనను హుటాహుటీన ఆసుపత్రికి తరలించగా, వైద్యులు తీవ్రంగా శ్రమించారు. అయినప్పటికీ ఫలితంలేకపోయిందని అధికారులు తెలిపారు. మాజీ ప్రధాని షింజో అబే మరణించారని వారు నిర్ధారించారు. మెడ భాగంలో తగిలిన బుల్లెట్లు తీవ్ర రక్తస్రావానికి కారణమైనట్టు భావిస్తున్నారు. షింజే అబే ను ఆసుపత్రిలో చేర్చే సమయానికే అత్యంత విషమపరిస్థితిలో ఉన్నారు. ఆసుపత్రిలో రక్తం ఎక్కించినా ప్రయోజనం లేకపోయింది. కాల్పులు జరిగినప్పుడే ఆయన మృతి చెందారని కొన్ని మీడియా సంస్థల్లో కథనాలు కూడా వచ్చాయి.
షింజో అబె మృతి పట్ల ప్రపంచ దేశాలు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశాయి. సంతాపం తెలిపాయి. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సహా వివిధ దేశాధినేతలు, ప్రధానులు తమ సానుభూతిని తెలియజేశారు.
బుల్లెట్ల వర్షం..
షింజో అబెపై ఈ ఉదయం కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. బుల్లెట్‌ గాయాలతో రక్తమోడుతూ కనిపించారు. జపాన్‌ పశ్చిమ ప్రాంతంలోని నారా సిటీలో ఈ ఘటన చోటు చేసుకుంది. అక్కడ నిర్వహించిన ఓ కార్యక్రమంలో ప్రసంగిస్తోన్న సమయంలో ఆయనపై కాల్పులు జరిపారు. ఆ వెంటనే ఆయన వేదిక మీదే కుప్పకూలిపోయారు. రక్తపుమడుగులో పడిఉన్న ఆయనను భద్రత సిబ్బంది హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.
బహిరంగ సభలో..ఆయన ప్రసంగం ప్రారంభించిన వెంటనే కాల్పులు జరిపిన శబ్దం వినిపించిందని, ఆ వెంటనే షింజో వేదిక మీద కుప్పకూలిపోయారని స్థానిక ఎన్‌హెచ్‌కే వెల్లడిరచింది. ఈ విషయాన్ని ది జపాన్‌ టైమ్స్‌ ధృవీకరించింది. ఎగువసభ కోసం ప్రస్తుతం జపాన్‌లో ఎన్నికలను నిర్వహిస్తోన్నారు. ఎల్లుండి పోలింగ్‌. ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ఆయన జపాన్‌ పశ్చిమ ప్రాంతంలోని నారా సిటీలో ఏర్పాటు చేసిన ఓ బహిరంగ సభలో పాల్గొన్నారు.

ఆ దేశ కాలమానం ప్రకారం.. మధ్యాహ్నం 11:30 గంటలకు నారా సిటీలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తోన్న సమయంలో ఈ కాల్పులు జరిగాయి. వెనుక వైపు నుంచి దుండగుడు తుపాకీతో కాల్పులు జరిపాడు. ఆ వెంటనే భద్రత బలగాలు నిందితుడిని అరెస్ట్‌ చేశాయి. అతన్ని నారా సిటీకే చెందిన యమమషి తెత్సుయగా గుర్తించారు. మాజీ మెరైన్‌ ఉద్యోగిగా నిర్ధారించారు. అతని ఇంటిని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఇంట్లో సోదాలు నిర్వహించారు.
స్పందించని శరీరం..
బుల్లెట్‌ తగిలిన వెంటనే షింజో అబెను మెడికల్‌ ఎమర్జెన్సీ హెలికాప్టర్‌లో కషిహర సిటీలోని నారా మెడికల్‌ యూనివర్శిటీకి తరలించారు. అత్యవసరంగా అత్యాధునిక వైద్య చికిత్సను అందజేశారు. అదే సమయంలో గుండెపోటు కూడా సంభవించింది. అపస్మారక స్థితిలోకి వెళ్లిన తరువాత ఆయన అవయవాలేవీ పని చేయలేదని డాక్టర్లు తెలిపారు. వైద్యానికి ఆయన శరీరం స్పందించలేదని చెప్పారు. కొద్దిసేపటి కిందటే తుదిశ్వాస విడిచినట్లు ప్రకటించారు.
ఎన్నికల ప్రచారం రద్దు..
అనూహ్యంగా సంభవించిన ఈ ఘటనతో ఎన్నికల ప్రచారాన్ని అప్పటికప్పుడు నిలిపివేశామని లిబరల్‌ డెమొక్రటిక్‌ పార్టీ నాయకులు పేర్కొన్నారు. జపాన్‌ ప్రధానమంత్రి ఫ్యుమియో కిషిడ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆర్థికంగా దేశాన్ని అత్యుత్తమంగా తీర్చిదిద్దిన నాయకుడిని కోల్పోయామంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img