Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

జర్నలిస్టుల నిరసనాగ్రహం

వివిధ రాజకీయ, ఉద్యోగ, కార్మిక సంఘాల నేతల సంఫీుభావం
13 జిల్లాల్లో కలెక్టరేట్‌లు, డీపీఆర్‌వో కార్యాలయాల వద్ద దీక్షలు

విశాలాంధ్ర బ్యూరో ` అమరావతి : జర్నలిస్టుల సమస్యల పరిష్కారం విషయంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ మంగళవారం ఏపీయూడబ్ల్యూజే అధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులు కలెక్టరేట్‌లు, డీపీఆర్‌వో కార్యాలయాల వద్ద నిరసన దీక్షలు చేపట్టారు. ఈ దీక్షల్లో ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియాకు చెందిన జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొనగా, టీడీపీ, సీపీఐ, సీపీఎం, జనసేన, కాంగ్రెస్‌, బీజేపీ నేతలు, కార్మిక, ఉద్యోగ, రైతు, ఇతర సంఘాల నేతలు సంఫీుభావం ప్రకటించారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు నాల్గవ స్థంభం లాంటి మీడియాను ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేయడం తగదని, జర్నలిస్టులు రోడ్డున పడే పరిస్థితి వచ్చిందంటే రాజ్యాంగం రోడ్డున పడినట్లేనని జర్నలిస్టుల ఆందోళనకు సంఫీుభావం తెలిపిన వివిధ రాజకీయ పార్టీల నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే జర్నలిస్టుల సమస్యల పరిష్కా రానికి చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో వారికి మద్దతు గా తాము కూడా పోరాడాల్సి వస్తుందని హెచ్చరించారు.
కరోనా మహమ్మారికి బలైన జర్నలిస్టు కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందజేస్తా మని ఇచ్చిన జీవోను తక్షణమే అమలు చేయాలని, అక్రిడిటేషన్‌కు జీఎస్టీ నిబంధనను మినహాయించాలని, ప్రమాద బీమా పథకాన్ని పునరుద్ధరించాలని, ఇళ్ల స్థలాలు కేటాయించాలని, ఎటాక్స్‌, అక్రిడిటేషన్‌, వెల్ఫేర్‌ కమిటీలతోపాటు సి.రాఘవాచారి ప్రెస్‌ అకాడమి పాలకవర్గ సభ్యులను నియమించాలని జర్నలిస్టులు ఈ సందర్భంగా దీక్షల్లో డిమాండ్‌ చేశారు. పాత్రికేయుల సమస్యల పరిష్కారం విషయంలో జరుగుతున్న తీవ్ర జాప్యం, సాచివేత వైఖరిపై నిరసన వ్యక్తం చేశారు.విజయవాడ ప్రెస్‌ క్లబ్‌ వద్ద కృష్ణా అర్బన్‌, రూరల్‌ శాఖల అధ్వర్యంలో జరిగిన దీక్షలో ఐజేయూ ఉపాధ్యక్షులు అంబటి ఆంజనేయులు, ఏపీయూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి చందు జనార్థన్‌, ఉపాధ్యక్షులు కంచల జయరాజ్‌, కోశాధికారి శ్రీనివాస్‌, కార్యవర్గసభ్యులు చావా రవి, యు.వెంకట్రావు, ప్రెస్‌ క్లబ్‌ అధ్యక్షులు నిమ్మరాజు చలపతిరావు, కొండా రాజేశ్వరరావు, సామ్నా ప్రధాన కార్యదర్శి రమణారెడ్డి, ఏపీపీజేఏ అధ్యక్షులు సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. వీరికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, కార్యదర్శివర్గ సభ్యులు జల్లి విల్సన్‌, ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు రావులపల్లి రవీంద్రనాథ్‌, సీఐటీయూ రాష్ట్ర నాయకులు ఉమామహేశ్వరరావు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు, టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామమోహనరావు, రాష్ట్ర కార్యదర్శి గన్నే వెంకటనారాయణ ప్రసాద్‌ (అన్నా), జనసేన రాష్ట్ర నాయకులు పోతిన వెంకట మహేష్‌, రైతు నేతలు వడ్డే శోభనాద్రీశ్వరరావు, తులసీ రావు, కాంగ్రెస్‌ నాయకులు నరహరశెట్టి నర్సింహారావు తదితరులు మద్దతు తెలియజేసి ప్రభుత్వ తీరును ఎండగట్టారు. విశాఖపట్నంలో అర్బన్‌, రూరల్‌ యూనిట్‌ అధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట జరిగిన దీక్షలో ఏపీయూడబ్ల్యూజే అధ్యక్షులు ఐ.వి.సుబ్బారావు, ఉపాధ్యక్షులు పసుపులేటి రాము, తాడేపల్లిగూడెంలో ఐజేయూ కార్యవర్గ సభ్యులు డి.సోమసుందర్‌ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img