Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

జల వివాదాలకు చెక్‌ పడేనా ?

కృష్ణా, గోదావరి ప్రాజెక్టుల నిర్వహణ బోర్డులకు అప్పగింత

అనుమతిలేని ప్రాజెక్టులకు ఆరు నెలల గడువు
కేంద్ర గెజిట్‌లో లేని వెలుగొండ పూలసుబ్బయ్య ప్రాజెక్టు
ఏపీకి మోదం.. తెలంగాణకు ఖేదం
చిన్న చిన్న సవరణలు చేయాలన్న ఏపీ

విశాలాంధ్ర బ్యూరో` అమరావతి :
తెలుగు రాష్ట్రాల మధ్య తరచూ తలెత్తుతున్న జల వివాదాలకు చెక్‌ పెట్టేందుకు కేంద్రం ఎట్టకేలకు స్పందించింది. రాష్ట్ర పునర్విభజన చట్టంలోనే కృష్ణా, గోదావరి నీటి ప్రాజెక్టులకు సంబంధించి నిర్వహణాధికారాలను పూర్తిగా బోర్డులకే అప్పగించాలని పేర్కొన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం దాని అమలుకు ఇంతకాలం నిర్లక్ష్యం చేసింది. ఫలితంగా నీటి వినియోగంలో ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్య తరచూ వివాదాలు తలెత్తాయి. ముఖ్యంగా కృష్ణానది ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు మధ్యలో ఉండటం, ప్రాజెక్టుల నిర్వహణను రెండు ప్రభుత్వాలకు అప్పగించడంతో రాజకీయ వివాదాలకు అడ్డాగా మారే పరిస్థితి నెలకొంది. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల అక్కడి రాజకీయ పరిస్థితులను చక్కదిద్దుకునేందుకు కృష్ణా ప్రాజెక్టులపై జల విద్యుత్‌ ఉత్పత్తిని ప్రధాన అస్త్రంగా ప్రయోగించింది. దీంతో దాదాపు ఆరు టీఎంసీల కృష్ణా జలాలు కడలి పాలయ్యే పరిస్థితి ఏర్పడిరది. ఏపీ ప్రభుత్వ అభ్యంతరాలను, కృష్ణాబోర్డు ఆదేశాలను తెలంగాణ ప్రభుత్వం ఏమాత్రం ఖాతరు చేయకపోవడంతో సీఎం జగన్‌ ప్రధాని నరేంద్రమోదీకి, జలశక్తి మంత్రికి రెండుసార్లు నేరుగా లేఖలు రాసి తక్షణం జోక్యం చేసుకోవాలని కోరారు. కృష్ణా, గోదావరి నదుల ప్రాజెక్టుల నిర్వహణను బోర్డుల పరిధిలోకి తెచ్చి, కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని కోరారు. మొత్తానికి స్పందించిన కేంద్ర ప్రభుత్వం కృష్ణా, గోదావరి యాజమాన్య బోర్డుల పరిధులు ఖరారు చేస్తూ కేంద్ర జలశక్తి శాఖ గెజిట్లు విడుదల చేసింది. రెండు రాష్ట్రాల్లో విస్తరించిన కృష్ణా, గోదావరి బేసిన్‌ ప్రాజెక్టుల నిర్వహణను కృష్ణా, గోదావరి బోర్డులకు అప్పగించింది. రెండు బేసిన్లలోని ప్రాజెక్టులను బోర్డుల పర్యవేక్షణ కిందికి తీసుకువచ్చింది. ప్రాజెక్టుల కార్యకలాపాలు, నిర్వహణ, నియమనిబంధనలను గెజిట్‌లో పొందుపరిచారు. బచావత్‌ ట్రైబ్యునల్‌ కేటాయింపులున్న ప్రాజెక్టులన్నీ కృష్ణా బోర్డు పరిధిలోకి వస్తాయని కేంద్రం పేర్కొంది. కృష్ణానదిపై 36, గోదావరిపై 71 ప్రాజెక్టులను కేంద్రం బోర్డుల పరిధిలోకి తెచ్చింది. అనుమతిలేని ప్రాజెక్టులకు ఆరు నెలల్లోపు అనుమతులు తెచ్చుకోవాలని, అనుమతులు రాకపోతే ప్రాజెక్టులు నిలిపివేయాలని కేంద్రం స్పష్టం చేసింది. బోర్డులకు చైర్మన్లు, సభ్య కార్యదర్శి, చీఫ్‌ ఇంజినీర్లు ఇతర రాష్ట్రాలకు చెందినవారు ఉంటారని, అన్ని ప్రాజెక్టుల నిర్వహణ బోర్డులే చూసుకుంటాయని స్పష్టంచేసింది. ఒక్కో రాష్ట్రం ఒక్కో బోర్డుకు రూ.200 కోట్ల చొప్పున సీడ్‌ మనీ కింద 60 రోజుల్లో డిపాజిట్‌ చేయాలంది. నిర్వహణ ఖర్చులను అడిగిన 15 రోజుల్లోపు చెల్లించాలని,

ప్రాజెక్టుల నుంచి నీళ్లు, విద్యుదుత్పత్తిని బోర్డే పర్యవేక్షిస్తుందని కేంద్రం తేల్చిచెప్పింది. ఈ గెజిట్‌ నోటిఫికేషన్‌లో రెండు రాష్ట్రాలకు కొన్ని అభ్యంతరాలున్నప్పటికీ ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యతలు బోర్డులకు అప్పగించడం వల్ల తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాల సమస్య దాదాపు పరిష్కారమైనట్లేనని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
స్వాగతిస్తున్నాం..కానీ కొన్ని సవరణలు చేయాలి : ఏపీ జలవనరులశాఖ
కేంద్ర జలశక్తి శాఖ జారీ చేసిన గెజిట్‌ నోటిఫికేషన్లను ఏపీ ప్రభుత్వం స్వాగతిస్తున్నట్టు జలవనరుల శాఖ కార్యదర్శి శ్యామలరావు చెప్పారు. అక్టోబరు 14 నుంచి జలశక్తి శాఖ నోటిఫికేషన్‌ అమలులోకి వస్తుందన్నారు. బేసిన్‌ పరిధిలో లేని వాటినీ నోటిఫికేషన్‌లో పేర్కొన్నారని, వాటిని సవరించాల్సి ఉందన్నారు. వెలుగొండపై తలెత్తిన అక్షర దోషాలను సవరించాలని కేంద్రాన్ని కోరతామన్నారు. సాగునీరు విడుదల చేసినప్పుడే విద్యుత్‌ ఉత్పత్తి చేయాలి తప్ప విద్యుత్‌ ఉత్పత్తి కోసం సాగునీరు విడుదల చేయకూడదన్నారు. ఆ ప్రాథమిక సూత్రాన్ని తెలంగాణ ప్రభుత్వం ఉల్లంఘించిందన్నారు. కేఆర్‌ఎంబీ అనుమతి లేకుండానే 45 రోజులుగా తెలంగాణ జెన్‌కో శ్రీశైలం, సాగర్‌, పులిచింతల నుంచి విద్యుత్‌ ఉత్పత్తి చేసింది. శ్రీశైలం ప్రాజెక్టుకు 30.38 టీఎంసీల ఇన్‌ఫ్లో ఉంటే, అందులో 29.82 టీఎంసీల నీటిని విద్యుత్‌ ఉత్పత్తి కోసం వాడారు. దీంతో శ్రీశైలం రిజర్వాయర్‌లో నీటిమట్టం 806.8 అడుగులు మాత్రమే ఉంది. శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ ద్వారా నీరు తీసుకోవాలంటే కనీసం 854 అడుగులు ఉండాలి. దీంతో పోతిరెడ్డిపాడు ద్వారా నీరు తీసుకునే అవకాశం లేకుండా పోయింది. పులిచింతల ప్రాజెక్టు నుంచి దిగువకు విడుదల చేసిన 8 టీఎంసీల నీరు సముద్రం పాలైంది. జూన్‌ నుంచి ఇప్పటివరకు తెలంగాణ 66 టీఎంసీలు విద్యుత్‌ ఉత్పత్తి కోసం వాడిరది. దీనిపై ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రధానికి ఫిర్యాదు చేయడంతో పాటు సుప్రీంకోర్టులో కూడా పిటిషన్‌ వేశామన్నారు. దీంతో కేంద్ర జలశక్తిశాఖ కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిపై గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసిందని వివరించారు. అయితే నోటిఫికేషన్‌లో కొన్ని తప్పిదాలున్నాయని, వాటిని సరిచేయమని కేంద్రాన్ని కోరతామన్నారు. విభజన చట్టం ప్రకారం కేఆర్‌ఎంబీ కార్యాలయాన్ని ఏపీలోనే ఏర్పాటు చేయాల్సి ఉందని, కొన్ని ప్రాజెక్ట్‌లను బోర్డు పరిధిలోకి తీసుకురావడం అనవసరమన్నారు. ఏపీ వాటా ప్రకారం శ్రీశైలం, సాగర్‌ ప్రాజెక్ట్‌ల నుంచి నీటిని విడుదల చేశాక ఎలా వినియోగించుకోవాలనేది దిగువ రాష్ట్రంగా ఏపీకి ఉన్న హక్కు అన్నారు. దిగువనున్న చిన్నపాటి ప్రాజెక్ట్‌లు, కాల్వలు బోర్డు పర్యవేక్షణలో ఉంటే పంటలు దెబ్బతింటాయని తెలిపారు. రాయలసీమ ఎత్తిపోతల అంశం చాలా సున్నితమైనదని, దాన్ని నోటిఫై చేస్తే ఒక లాభం, చేయకుంటే మరో లాభమన్నారు.
పూలసుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టును గెజిట్‌లో పొందుపర్చాలి: ఏపీ రైతు సంఘం
కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజన చట్టం మేరకు కృష్ణా, గోదావరి నదుల యాజమాన్య బోర్డుల పరిధులను తెలియచేస్తూ నోటిఫికేషన్‌ జారీ చేయడాన్ని అఖిల భారత కిసాన్‌సభ ఉపాధ్యక్షులు రావుల వెంకయ్య, ఆంధ్రప్రదేశ్‌ రైతుసంఘ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.రామచంద్రయ్య, ప్రసాద్‌ శుక్రవారం ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా నోటిఫికేషన్‌ విడుదల చేయడం సంతోషకరమన్నారు. దీనితో రెండు రాష్ట్రాలు జలాశయాల వద్ద జుట్లు పట్టుకొనే దుస్ధితి ఉండదని వారు పేర్కొన్నారు. గెజిట్‌ నోటిఫికేషన్‌లో తెలుగుగంగ, హంద్రీనీవా, గాలేరునగరి, కల్వకుర్తి, నెట్టెంపాడు ప్రాజెక్టులు మాత్రమే ఆంధ్రప్రదేశ్‌ పున:వ్యవస్థీకరణ చట్టం 2014 జాబితాలో ఉన్నట్లు పేర్కొన్నారు. పూలసుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టును ఆమోదం లేని జాబితాలో ప్రస్తావించారు. అందువల్ల సీఎం జగన్‌ తక్షణం జోక్యం చేసుకొని గెజిట్‌ నోటిఫికేషన్‌కు సవరణ చేయించి పూలసుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టును పొందుపర్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img