Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

జహంగీర్‌పురిలో మళ్లీ ఉద్రిక్తత


పోలీసులపై నిందితుడి కుటుంబం దాడి
న్యూదిల్లీ: దేశ రాజధాని దిల్లీలోని జహంగీర్‌పురిలో సోమవారం మరోసారి ఉద్రిక్తత చోటుచేసింది. కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసు బృందంపై ఓ నిందితుడి కుటుంబం దాడికి పాల్పడిరది. జహంగీర్‌పురి అల్లర్ల సందర్భంగా విచక్షణారహితంగా కాల్పులు జరిపిన నిందితుడి నివాసానికి పోలీసు బృందం వెళ్లింది. సీడీ పార్కులోని నిందితుడి ఇంటిని పరిశీలించడానికి, కుటుంబ సభ్యులను విచారించడానికి వెళ్లిన బృందంపై దాడి చేసినట్లు డీసీపీ ఉషా రంగ్నానీ చెప్పారు. శనివారం జరిగిన అల్లర్ల సమయంలో బ్లూ షర్ట్‌ ధరించి కాల్పులు జరిపిన నిందితుడిని వీడియోల ద్వారా గుర్తించామని తెలిపారు. పోలీసు బృందంపై నిందితుడి కుటుంబ సభ్యులు రాళ్లతో దాడి చేశారని, వారిపై చట్టపరమైన చర్య తీసుకుంటామని ఆమె చెప్పారు. ఒకరిని అదుపులోకి తీసుకున్నామని, పరిస్థితి పూర్తి అదుపులో ఉందని ఆమె వెల్లడిరచారు.
కఠినంగా శిక్షిస్తాం: ఆస్తానా
జహంగీర్‌పురి అల్లర్ల కేసులో రెండు వర్గాలకు చెందిన 23 మందిని ఇప్పటి వరకు అరెస్టు చేశామని దిల్లీ పోలీసు కమిషనర్‌ రాకేశ్‌ ఆస్తానా సోమవారం చెప్పారు. హనుమాన్‌ జయంతి ఊరేగింపు సమయంలో మసీదుపై కాషాయ జెండా కప్పే ప్రయత్నం జరిగినట్లు వస్తున్న ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. ఆస్తానా మీడియాతో మాట్లాడుతూ హింసాత్మక ఘటనకు సంబంధం ఉన్న ఏ ఒక్కరినీ వదిలే ప్రసక్తేలేదని స్పష్టం చేశారు. కులాలు, మతాలకతీతంగా చర్యలు తీసుకుంటామన్నారు. మసీదుపై కాషాయ జెండా కప్పే ప్రయత్నం జరగలేదని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. జహంగీర్‌పురిలో ఓ మసీదుపై కాషాయ జెండా కప్పడానికి ప్రయత్నించడంతో ఘర్షణలు ప్రారంభమైనట్లు రాజకీయ నేతలు, సామాజిక మాధ్యమాల వినియోగదారులు ఆరోపించారు. సామాజిక మాధ్యమాల ద్వారా ప్రశాంత వాతావరణాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నించినా సహించబోమని ఆస్తానా తెలిపారు. సామాజిక మాధ్యమాలను విశ్లేషిస్తున్నామని, అల్లర్లు సృష్టించే ఉద్దేశంతో తప్పుడు వార్తలు ప్రసారం చేసినా, ఊహాగానాలు ట్వీట్‌ చేసినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించడం ద్వారా అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నామన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img