Friday, April 19, 2024
Friday, April 19, 2024

జాతీయ చిహ్నం ఆవిష్కరణకు
మతాచారమా?

మోదీ చర్యపై సీపీఐ ప్రధాన కార్యదర్శి రాజా ఆగ్రహం
ప్రధాని రాజ్యాంగ ఉల్లంఘన: సీపీఎం

న్యూదిల్లీ: కొత్త పార్లమెంటు భవనంపై జాతీయ చిహ్నాన్ని ఆవిష్కరించడానికి మతాన్ని వాడుకోవడంపై సీపీఐ, సీపీఎం తీవ్రంగా వ్యతిరేకించాయి. పూజలు, పునస్కారాల ద్వారా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం సరికాదని హితవు పలికాయి. మత సంప్రదాయాల ఆధారంగా పార్లమెంటు భవనంపై జాతీయ చిహ్నం(ఏంబ్లం)ను ప్రధాని నరేంద్రమోదీ ఆవిష్కరించడాన్ని అంగీకరించబోమని స్పష్టం చేశాయి. ‘పార్లమెంటు అందరిది. అలాంటప్పుడు దీనిని వ్యక్తిగత, ప్రైవేట్‌ కార్యక్రమంలా ఎలా నిర్వహి స్తారు. ‘అంతేకాకుండా పార్లమెంటు అనేది ఓ తటస్థ వేదిక. ఇందులోకి మతాచారాలను ఎందుకు తీసుకొస్తారు’ అని సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా మోదీ సర్కారును ప్రశ్నించారు. జాతీయ కార్యక్రమా లకు మతాన్ని కలపడం ఎంత వరకు సమంజసమని నిలదీ శారు. పార్లమెంటు హౌస్‌ అనేది ప్రధానమంత్రి ఇక్కడికి సంబంధిం చినది కాదని స్పష్టం చేశారు. ప్రధానితో పాటు అధికార, ప్రతిపక్షాలన్నీ అందులో ఉంటాయని తెలిపారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతిపక్షాలను ఈ కార్యక్రమానికి ఆహ్వానించకపోవడం ఘోర తప్పిదమని రాజా అన్నారు. మరోవైపు, ప్రధాని నరేంద్రమోదీ భారత రాజ్యాంగాన్ని పూర్తిగా ఉల్లంఘించారని సీపీఎం పొలిట్‌బ్యూరో ఓ ప్రకటనలో విమర్శించింది. మన ప్రజాస్వామ్యంలో మూడు వేర్వేరు విభాగాలు`కార్యనిర్వాహక వర్గం(ప్రభుత్వం), చట్టసభలు(పార్లమెంటు, అసెంబ్లీలు), న్యాయవ్యవస్థ ఉంటాయని రాజ్యాంగం స్పష్టంగా చెప్పిందని గుర్తుచేసింది. పార్లమెంటు నిర్వహణకు రాష్ట్రపతి ఆదేశిస్తారు. కార్యనిర్వాహకవర్గానికి ప్రధాని అధినేత. చట్ట సభలు స్వతంత్ర పాత్ర పోషిస్తాయి. చట్టాలు చేస్తాయి. ఆ చట్టాలు జవాబుదారీ తనంగా ఉండేలా చూస్తాయని వివరించింది. జాతీయ చిహ్నం ఆవిష్కరణ సమయంలో మోదీ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఎవరి విశ్వాసాలు వారు అమలు చేసుకోవడానికి భారతీయులందరికీ భారత రాజ్యాంగం హక్కు, రక్షణలు కల్పించింది. ఈ హక్కును ఎవరూ కాదనలేం. అదేసమయంలో ప్రభుత్వం ఎలాంటి విశ్వాసం, మతాన్ని అనుసరించవద్దని రాజ్యాంగం స్పష్టంగా నిర్దేశించిందని సీపీఎం పేర్కొంది.
విపక్షాల ఆగ్రహం
పార్లమెంటు భవనంపై మతాచారాల ప్రాతిపదికపైన, ఏకపక్షంగా జాతీయ చిహ్నాన్ని మోదీ ఆవిష్కరించడంపై విపక్షాలు ఆగ్రహం వెలిబుచ్చాయి. పార్లమెంటు అనేది అందరికీ చెందినదని, ఇది కేవలం మోదీ ఒక్కడిదే కాదని విమర్శించాయి. రాజ్యాంగంలో వేర్వేరుగా నిర్దేశించిన అధికారాలను మోదీ ఉల్లంఘించారని మండిపడ్డాయి. పార్లమెంటు, ప్రభుత్వం, న్యాయవ్యవస్థలకు రాజ్యాంగం వేర్వేరు అధికారాలు నిర్దేశించిందని, ప్రభుత్వాధినేతగా మోదీ ఒక్కరే పార్లమెంటు భవనంపై జాతీయ చిహ్నాన్ని ఆవిష్కరించరాదని ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఒవైసీ స్పష్టంచేశారు. లోక్‌సభకు స్పీకర్‌ ప్రాతినిధ్యం వహిస్తారని, ప్రభుత్వానికి లోక్‌సభ సబార్డినేట్‌ కాదని గుర్తుచేశారు. రాజ్యాంగ నిబంధనలన్నింటినీ మోదీ ఉల్లంఘించారని ఆరోపించారు. సీపీఐ, సీపీఎం పార్టీలు కూడా మోదీ చర్యను తీవ్రంగా గర్హించాయి. ప్రధాని ఒక్కరే జాతీయ చిహ్నాన్ని ఆవిష్కరించడం ఏమిటని కాంగ్రెస్‌ పార్టీ ప్రశ్నించింది. ఈ కార్యక్రమానికి విపక్షాల నాయకులను దూరం పెట్టడంపై ఎన్‌సీపీ నేత మజీద్‌ మెమన్‌ ఆగ్రహం వెలిబుచ్చారు. పార్లమెంటులో ప్రధాని ఒక్కరే ఉండరని, అందులో విపక్షాల నాయకులు, సభ్యులు కూడా ఉంటారని గుర్తుచేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img