Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

జీజీహెచ్‌ వద్ద ఉద్రిక్తత

రమ్యను చంపిన యువకుడిని కఠినంగా శిక్షించాలి
ఆమె కుటుంబానికి న్యాయం చేయాలి
ఆందోళనలో టీడీపీ, ప్రజాసంఘాల డిమాండ్‌
పోలీసుల అదుపులో మాజీ మంత్రులు నక్కా, ఆలపాటి
బాధిత కుటుంబానికి రూ.10 లక్షల చెక్కు అందజేత

విశాలాంధ్రబ్యూరో`గుంటూరు :
నడిరోడ్డుపై దారుణ హత్యకు గురైన బీటెక్‌ విద్యార్థిని రమ్య మృతదేహానికి సోమవారం పోస్టుమార్టం పూర్తయింది. మృతదేహాన్ని కుటుంబసభ్యులు ఇంటికి తీసుకువెళ్లేందుకు యత్నిస్తుండగా సీపీఐ, టీడీపీ, వివిధ ప్రజాసంఘాలు, పార్టీల నేతలు గుంటూరు ప్రభుత్వ వైద్యశాల వద్దకు చేరుకుని నిరసన చేపట్టారు. దీంతో అక్కడ ఉద్రిక్తత ఏర్పడిరది. దారుణహత్యకు గురైన రమ్య కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. రమ్యను కిరాతకంగా చంపిన యువకుడిని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. బాధిత కుటుంబానికి పూర్తిస్థాయిలో న్యాయం జరిగేలా చూడాలని నినాదాలు చేశారు. మృతదేహాన్ని ఆసుపత్రి నుంచి తీసుకువెళ్లకుండా ప్రజాసంఘాలు, విపక్షాల ప్రతినిధులు అడ్డుకున్నారు. అటు పోలీసులు, ఇటు ప్రజా సంఘాలు, విపక్షాల నేతలతో జీజీహెచ్‌ వద్ద ఉద్రిక్తత తలెత్తింది. దీంతో రమ్య మృతదేహాన్ని మరోమార్గం ద్వారా బయటకు తరలించారు. ఆందోళన చేస్తున్న టీడీపీ శ్రేణులను, మాజీమంత్రులు నక్కా ఆనందబాబు, ఆలపాటి రాజా, మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్‌లను నల్లపాడు పోలీసుస్టేషన్‌కు తరలించారు.
రమ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ సోమవారం రమ్య నివాసానికి వెళ్లారు. కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం గుంటూరులోని రమ్య నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. నారా లోకేష్‌ రావడంతో టీడీపీ సహా ఇతర పార్టీల నేతలు అక్కడికి చేరుకున్నారు. రమ్య తల్లిదండ్రులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. పోలీసులు వారిందరినీ అదుపులోకి తీసుకుని

వివిధ పోలీసుస్టేషన్‌లకు తరలించారు. నారా లోకేష్‌ను ప్రత్తిపాడు పోలీసుస్టేషన్‌కు తరలించడంతో అక్కడకు టీడీపీ శ్రేణులు చేరుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేశారు. ఈ సందర్భంగా లోకేష్‌ మాట్లాడుతూ జగన్‌ హయాంలో సాధారణ మహిళకు భద్రత ఎక్కడ ఉందని ప్రశ్నించారు. వివేకానందరెడ్డి కుమార్తె సునీతరెడ్డి తనకు ప్రాణగండం ఉందని చెప్పడాన్ని లోకేష్‌ ప్రస్తావించారు. చెల్లెలకే రక్షణ లేనప్పుడు సామాన్య మహిళలకు భద్రత ఎక్కడ ఉంటుందని నిలదీశారు.
ముప్పాళ్ల, జల్లి విల్సన్‌ నివాళి
రమ్య భౌతికకాయానికి నివాళులర్పించేందుకు సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావుతో పాటు జిల్లా కార్యదర్శి జంగాల అజయ్‌కుమార్‌, నగర కార్యదర్శి కోట మాల్యాద్రి జీజీహెచ్‌కు చేరుకున్నారు. ఆమె కుటుంబసభ్యులను పరామర్శించారు. అనంతరం ముప్పాళ్ల మాట్లాడుతూ రమ్యను కిరాతకంగా హత్య చేసిన శశికృష్ణను బహిరంగంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. న్యాయం కోసం రమ్య కుటుంబసభ్యులు చేస్తున్న డిమాండ్‌కు సీపీఐ సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందన్నారు. రమ్య అంతిమయాత్రలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్సీ, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు జల్లి విల్సన్‌, దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరవది సుబ్బారావు మాట్లాడుతూ రమ్య కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. పోలీసులు, ప్రభుత్వం సమన్వయంతో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరారు.
రమ్య కుటుంబ సభ్యులను రాష్ట్ర హోంమంత్రి సుచరిత సోమవారం పరామర్శించారు. గుంటూరు జీజీహెచ్‌కు వెళ్లి కుటుంబసభ్యులను కలిసి ప్రభుత్వం తరపున రూ.10 లక్షల చెక్కును అందజేశారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూస్తామని మంత్రి సుచరిత హామీ ఇచ్చారు. రమ్య హత్యకు సంబంధించి గుంటూరు ఇన్‌చార్జీ డీఐజీ రాజశేఖర్‌ బాబు సోమవారం మీడియాకు వివరాలు తెలియజేశారు. రమ్య హత్య జరిగిన కొన్ని గంటలలోనే నిందితుడు శశికృష్ణను పట్టుకున్నామని తెలిపారు. శశికృష్ణ అరెస్టుకు ముందు ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడని చెప్పారు. శశికృష్ణ, రమ్య ఇన్‌స్ట్రాగ్రాం ద్వారా పరిచయమయ్యారని, అయితే అతను వేధించడం వలన రమ్య దూరం పెట్టిందని, ప్రేమించకపోతే చంపుతానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడని డీఐజీ పేర్కొన్నారు. ప్రేమించడం లేదన్న ఉన్మాదంతో రమ్యను శశికృష్ణ హత్య చేశాడని తెలిపారు. సోషల్‌ మీడియా పరిచయాలపై సమాజం దృష్టిపెట్టాలని కోరారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img