Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

జీవో నం1… ర్యాలీల నిషేధం వ్యవహారం అక్కడే తేల్చుకోండి

హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులపై జోక్యానికి సుప్రీం నిరాకరణ

. రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్‌ను హైకోర్టుకు తిప్పి పంపుతూ ఉత్తర్వులు
. జనవరి 23న విచారించాలని హైకోర్టుకు సూచన
. జగన్‌ ప్రభుత్వానికి చుక్కెదురు

న్యూదిల్లీ : సుప్రీంకోర్టులో ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వానికి చుక్కెదురయింది. రహదారులపై రోడ్‌షోలు, సభలు, సమావేశాల నియంత్రణ కోసం రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబరు 1పై విచారణను ముగిస్తున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. జాతీయ రహదారులతో సహా రోడ్లపై బహిరంగ సభలు, ర్యాలీలను నిషేధిస్తూ ఏపీ ప్రభుత్వం ఇచ్చిన కార్యనిర్వాహక ఉత్తర్వుల అమలును నిలిపివేస్తూ, హైకోర్టు ఇటీవల ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ పిటిషన్‌పై జోక్యం చేసుకోబోమని ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ పీఎస్‌ నరసింహతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. తదుపరి విచారణను రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం విచారణ చేపడుతుందని వెల్లడిరచింది. ఏపీ ప్రభుత్వం తరపున కోర్టుకు హాజరైన సీనియర్‌ న్యాయవాది సీఎస్‌ వైద్యనాథన్‌ చేసిన వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం… తన నేతృత్వంలోని డివిజన్‌ బెంచ్‌ ద్వారా ఈ పిటిషన్‌పై విచారణ జరిగేలా చూడాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కోరింది. వాద ప్రతివాదులు ఇద్దరూ… అన్ని అంశాలను డివిజన్‌ బెంచ్‌ ముందు ప్రస్తావించుకోవచ్చని సీజేఐ స్పష్టం చేశారు. అయితే సంక్షిప్త విచారణ ప్రారంభంలో, వైద్యనాథన్‌ హైకోర్టులో జరిగిన సంఘటనల క్రమాన్ని ప్రస్తావించారు. విధానపరమైన లోపాలను ఎత్తిచూపారు. ‘ఇది వెకేషన్‌ బెంచ్‌ (హైకోర్టు) చేసిన ఘోరమైన ఉల్లంఘన. వెకేషన్‌ బెంచ్‌ అలా ఎలా చెబుతుంది’ అని సీనియర్‌ న్యాయవాది అన్నారు. ప్రక్రియ ప్రకారం, రాష్ట్ర ప్రభుత్వ విధాన నిర్ణయాలకు సంబంధించినది ఏమైనప్పటికీ, హైకోర్టు వెకేషన్‌ బెంచ్‌ తీసుకోవచ్చు, నిర్ణయించవచ్చు. ఈ కేసులో శీతాకాల సెలవుల్లో ఉన్న ధర్మాసనం విచారణ పరిధిపై అభ్యంతరం లేవనెత్తుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాది పేర్కొన్నారు. అదే రోజు హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించడంపై అభ్యంతరాలు ఉన్నాయని వైద్యనాథన్‌ చెప్పారు. నోటీసు కూడా ఇవ్వకుండా ఉదయం ప్రస్తావిస్తే… మధ్యాహ్నం విచారణ చేపట్టి స్టే ఇవ్వడంపై అభ్యంతరాలు ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాది తెలిపారు. దీనికి ప్రతివాదుల తరపు న్యాయవాదులు అభ్యంతరం తెలిపారు. రాష్ట్ర అడ్వకేట్‌ జనరల్‌ వాదనలు విన్న తర్వాత డివిజన్‌ బెంచ్‌ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. రెండు పక్షాల వాదనల అనంతరం… పిటిషన్‌పై విచారణను సీజేఐ ధర్మాసనం ముగించింది. ఈ పిటిషన్‌కు సంబంధించిన మెరిట్స్‌లోకి వెళ్లడం లేదని స్పష్టం చేస్తూ… ‘జనవరి 23న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ ఈ అంశాన్ని విచారించేలా చూడాలని మేము అభ్యర్థిస్తాము’ అని సీజేఐ చెప్పారు. ఈ అంశాన్ని ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టుకు తిరిగి పంపుతున్నట్లు తెలిపారు. ఏపీ ప్రభుత్వం తరపున న్యాయవాది మహఫూజ్‌ అహ్సాన్‌ నజ్కీ కూడా కోర్టుకు హాజరయ్యారు. జాతీయ రహదారులతో సహా రోడ్లపై బహిరంగ సభలు, ర్యాలీలను నిషేధిస్తూ ప్రభుత్వ ఉత్తర్వును నిలిపివేసిన హైకోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ, జనవరి 18న రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీం కోర్టు అంగీకరించింది. కాగా, హైకోర్టు జనవరి 12న జాతీయ, రాష్ట్ర రహదారులపై బహిరంగ సభలు, ర్యాలీలను నిషేధిస్తూ ప్రభుత్వ ఉత్తర్వు (జీవో నంబరు 1) అమలును జనవరి 23 వరకు నిలిపివేసింది. ‘పోలీసు చట్టం1861లోని సెక్షన్‌ 30 కింద అందించిన విధానానికి జీవో నంబరు1 విరుద్ధమని కోర్టు ప్రాథమికంగా అభిప్రాయపడిరది’ అని అది పేర్కొంది. జీవో నంబరు1ని సవాలు చేస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ దాఖలు చేసిన రిట్‌ పిటిషన్‌పై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. విపక్షాల గొంతును నొక్కేందుకే రాష్ట్ర ప్రభుత్వం ఈ జీవోను తీసుకువచ్చిందని పిటిషనర్‌ హైకోర్టులో వాదించారు. డిసెంబరు 28న కందుకూరులో ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ నిర్వహించిన ర్యాలీలో తొక్కిసలాట జరిగి ఎనిమిది మంది మరణించిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వం జనవరి 2 అర్ధరాత్రి ఈ ఉత్తర్వులు జారీ చేసింది. పోలీసు చట్టం1861లోని నిబంధనల ప్రకారం నిషేధాజ్ఞ (జీవో నంబరు1) జారీ అయింది. రాష్ట్ర పోలీసులు వెంటనే దానిని అమలు చేయడం ప్రారంభించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img