Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

జీ..హుజూర్‌..!

కేంద్రం ఒత్తిడికి తలొగ్గిన జగన్‌ సర్కార్‌
వచ్చే నెల నుంచి మళ్లీ ఉచిత బియ్యం
ఎన్‌ఎఫ్‌సీఏ లబ్ధిదారుల ఎంపికపై అభ్యంతరం
నాలుగు నెలలుగా పంపిణీ నిలిపివేత

విశాలాంధ్ర బ్యూరో`అమరావతి: కేంద్ర ప్రభుత్వ ఒత్తిడికి రాష్ట్రం తలొగ్గింది. నాలుగు నెలలుగా రాష్ట్రంలో నిలచిపోయిన బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని మళ్లీ ఆగస్టు 1 నుంచి ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఆ మేరకు పౌర సరఫరాల శాఖాధికారులకు ఏర్పాట్లు చేసుకో వాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో మొత్తం 1.45 కోట్ల రేషన్‌ కార్డులున్నాయి. కరోనా కష్టాల్లో ఉన్న పేదలకు ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజన కింద కేంద్ర ప్రభుత్వం తన లెక్కల ప్రకారం 2020 ఏప్రిల్‌ నుంచి రాష్ట్రంలోని 2.68 కోట్ల మందికి ఉచిత బియ్యం అందిస్తోంది. వీరుగాకుండా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన 56.71లక్షల కార్డుల్లో 1.57 కోట్ల మంది ఉన్నారు. వీరికి రాష్ట్ర ప్రభుత్వమే భరించాల్సి వస్తుంది. దీనివల్ల నెలకు సుమారు రూ.270 కోట్ల భారం రాష్ట్ర ఖజానాపై పడుతోంది. దీంతో ఈ కార్డులను కూడా కేంద్రం కోటాలో కలిపి మొత్తానికి ఉచిత బియ్యం పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది. దీనివల్ల ఏడాదికి రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపు రూ.3,240 కోట్ల ఆర్థిక భారం తగ్గుతుంది. దీనిపై ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి దిల్లీ వెళ్లిన ప్రతిసారీ ప్రధానికి అన్ని డిమాండ్లతో పాటు దీనిని కూడా కలిపి కోరుతున్నారు. హోంశాఖా మంత్రి అమిత్‌షాను సైతం కలిసి సీఎం అభ్యర్థించారు. కేంద్ర ప్రభుత్వం గుర్తించిన లబ్ధిదారుల గుర్తింపులో హేతుబద్దీకరణ లేదని, మహారాష్ట్ర, గుజరాత్‌, కర్ణాటక రాష్ట్రాల్లో ఏపీ కంటే 10శాతం అదనంగా ఉన్నారని విశ్లేషించి చెప్పారు. రాష్ట్రంలోని అన్ని రేషన్‌ కార్డులనూ జాతీయ ఆహార భద్రతా చట్టం పరిధిలోకి తేవాలని కోరారు. కానీ కేంద్రం పట్టించుకోవడం లేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఉచిత బియ్యం పంపిణీని నాలుగు నెలలుగా నిలిపివేసింది. ఇప్పటి వరకు కేంద్రం ఈ పథకం కింద ఐదు విడతలుగా ఉచిత బియ్యం పంపిణీ చేయగా, 6వ విడతగా కూడా ఏప్రిల్‌ నుంచి సెప్టెంబరు నెల వరకు ఒక్కో కుటుంబ సభ్యునికి ఐదు కేజీల బియ్యం పంపిణీ చేయాల్సి ఉంది. అయితే ఈసారి రాష్ట్ర ప్రభుత్వం దీనిని పక్కనబెట్టింది. జాతీయ ఆహార భద్రతా చట్టం పరిధిలోకి వచ్చే కార్డులతో పాటు, రాష్ట్ర పరిధిలోని కార్డులకూ ఉచిత బియ్యం అందజేయాలని, దానిపై నిర్ణయం తీసుకునే వరకు పంపిణీ చేయబోమంటూ నిలిపివేసింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉచిత బియ్యం పంపిణీ చేయకపోతే ఆంధ్రప్రదేశ్‌ నుంచి బియ్యం, ధాన్యం సేకరణ పూర్తిగా నిలిపివేయాల్సి వస్తుందని కేంద్ర ఆహారం, ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ హెచ్చరించారు. ఏపీలో పీఎంజీకేఏవై 6వ దశ కింద ఉచిత బియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభిస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. ఆ మేరకు 8.04 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని కేటాయించామనీ, ఏ రాష్ట్రమైనా ఈ కేంద్ర పథకాన్ని అమలు చేయకపోతే అందుకు తగ్గ పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని కేంద్రం హెచ్చరించింది. ఏపీలో ఉచిత బియ్యం పంపిణీ నిలిపివేసిన విషయాన్ని టీడీపీ పార్లమెంటు సభ్యులు లోకసభలో సైతం ప్రస్తావించారు.
మొత్తానికి కేంద్రం దీనిపై సీరియస్‌గా స్పందించడంతో తలొగ్గిన రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 1వ తేదీ నుంచి పంపిణీ చేయాలని నిర్ణయించింది. అయితే ఎన్‌ఎఫ్‌సీఏ కార్డుదారులకు మాత్రమే వలంటీర్ల ద్వారా పంపిణీ చేయాలని, వారికి మాత్రమే స్లిప్పులు ఇవ్వాలని ఆదేశించినట్లు సమాచారం. మిగిలిన నాన్‌ ఎన్‌ఎఫ్‌సీఏ కార్డుదారులకు మాత్రం రాష్ట్ర ప్రభుత్వంపై భారం పడకుండా ఉచితం బియ్యం నిలిపివేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే రాష్ట్ర ప్రభుత్వం ప్రజాగ్రహం ఎదుర్కోక తప్పదు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img